
మాట్లాడుతున్న రాచాల యుగంధర్‌గౌడ్
సాక్షి, మహబూబ్‌నగర్(కొత్తకోట) : విప్లవ విద్యార్థి సంఘ నాయకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై కొన్ని వర్గాలు రాజకీయంగా ఎదగకుండా కుట్రలు పన్నుతున్నారని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే సహించమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్‌గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ బీసీలో అత్యున్నత స్థానంలో ఉన్నందున ఓర్వలేని కొందరు అగ్రకులాల వారు పనిగట్టుకొని లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారన్నారు.
ప్రభుత్వ సమాచారాన్ని ఇతరులకు చేరవేస్తున్నారని అభూతకల్పనలు సృష్టిస్తూ ఆయనను మంత్రి వర్గం నుండి తొలగించాలని కుట్ర చేస్తున్నారని, అదే జరిగితే రాష్ట్రంలోని బడుగులు పిడుగులై పెద్ద ఎత్తున ఉద్యమిస్తారన్నారు. మూడు రోజుల్లో బీసీ యువజన, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఉద్యమిస్తామన్నారు. నాయకులు బాలరాజుగౌడ్,అంజన్నయాదవ్, కరాటే శివయాదవ్, రాఘవేందర్, ఆశోక్ కుమార్, శివ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment