మన పథకాలను పొరుగుకు విస్తరిద్దాం
గవర్నర్ విద్యాసాగర్‌రావును కలసిన బీసీ సంఘం నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, గురుకుల పాఠశాలలు, స్టడీ సర్కిల్స్ లాంటి కార్యక్రమాలను మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తానని ఆ రాష్ట్రాల గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆదివారం ఆయనతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బీసీల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆర్.కృష్ణయ్య సూచించగా, గవర్నర్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి నియోజకవర్గానికో గురుకులాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. దీంతో పేదలకు ఉచిత విద్య మరింత చేరువవుతుందని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పేర్కొన్నట్లు బీసీ సంఘ ప్రతినిధులు తెలిపారు. గవర్నర్‌ను కలసిన వారిలో సంఘ ప్రతినిధులు ఆర్.అరుణ్, నందగోపాల్, మారేశ్ తదితరులున్నారు.