
దా‘రుణం’!
సాక్షి సంగారెడ్డి,సంగారెడ్డి: అరవై ఏళ్ల కల సాకారమైనా.. రైతన్న మృత్యుఘోష వినిపిస్తూనే ఉంది. ‘మన రాజ్యం.. మన పాలన’కోసం ఆశగా కొట్లాడిన అన్నదాతలు.. ఇప్పుడెందుకో కలవరపడుతున్నారు. తెలంగాణ ‘సంబురాలు’ కూడా ఒడిసిపోక ముందే మెతుకుసీమ రైతింట్లో ‘సావు’ దరువేస్తోంది. కొత్త సర్కారు అస్పష్ట మాటలు.. మీడియా లీకులు.. రుణాల మాఫీపై ఆంక్షలు.. అన్నీ కలిసి అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ‘అప్పులు తీరుతాయో లేదోనని.. ఎట్టా బతికేదని’ దిగులు చెందుతూ మృత్యువాత పడుతున్నారు.
మునిపల్లి మండలం పోల్కంపల్లి గ్రామంలో యువరైతు ముత్యాల సంగయ్య గుండెపోటుతో చనిపోగా.. తాజాగా శుక్రవారం జహీరాబాద్ మండలం కాశీంపూర్‌లో బోయిని దత్తాత్రి గుండె ఆగి చనిపోయారు. దత్తాత్రికి ఎనిమిది ఎకరాల భూమి ఉంది. కాలం కలిసిరాక, పంటలు పండక అప్పులు కావడం...దానికి తోడు ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయడంతో దాదాపు 6 ఎకరాల భూమి అమ్మేశాడు. ఆరు నెలల కిందట మరో ఆడపిల్ల పెళ్లి చేశాడు. దాదాపు రూ.2 లక్షలు అప్పు అయింది.
గత ఏడాది గ్రామీణ వికాస బ్యాంకు జహీరాబాద్ శాఖ నుంచి రూ. 65 వేల
పంట లోను తీసుకున్నాడు. ఇప్పుడది వడ్డీతో కలుపుకొని రూ.72 వేల వరకు అయింది. ఎన్నికల సమయంలో రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుని హోదాలో కేసీఆర్ ప్రకటించడంతో దత్తాత్రి నెత్తి మీద ఉన్న భారం దిగినట్లు అయింది. అయితే బుధవారం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని ప్రచారం జరగడంతో అప్పు తీరేది ఎట్టా అని మదనపడ్డ దత్తాత్రికి గుండెపోటు వచ్చి చనిపోయాడని ఆయన కుటుంబ సభ్యులు ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు.
జోగిపేట మండలం పోల్కంపల్లిలో గురువారం మరణించిన యువ రైతు సంగయ్య గుండెపోటుకు గల కారణాలను శుక్రవారం రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సేకరించారు. వివరాల ప్రకారం 2011 నుంచి 2013 మధ్యకాలంలో సంగయ్య కుటుంబం దాదాపు రూ 2.12 లక్షల పంట రుణం తీసుకుంది. ఎస్‌బీహెచ్ బ్యాంకు మునిపల్లి శాఖ నుంచి వీరు రుణాలు పొందారు. సంగయ్య పేరు మీద రూ. 50 వేలు, ఆయన తండ్రి ఆశయ్య పేరు మీద రూ. 90 వేలు, తల్లి బాలమ్మ పేరు మీద రూ. 72 వేల రుణం ఉంది. ఒక్కొక్కరి పేరు మీద రూ. లక్ష లోపే రుణాలు ఉన్నాయి. అన్ని రుణాలు మాఫీ అవుతాయని సంగయ్య ఆశపడ్డారు. కానీ రుణాలు మాఫీ అయ్యే అవకాశం లేకపోవడంతో గుండెపోటు వచ్చి చనిపోయాడని అధికారులు వాంగ్మూలం సేకరించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లాల్లో 3,65,787 మంది రైతులు రూ. 2,404 కోట్ల పంట రుణాలు తీసున్నారు.
1,90,406 మంది సన్నకారు రైతులు రూ.1,130 కోట్లు, 86,272 మంది చిన్నకారు రైతులు రూ. 633 కోట్ల రుణాలు తీసుకున్నారు. గడిచిన మూడేళ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. దాదాపు తొమ్మిది లక్షలకు పైగా మంది రైతులు ఉన్నారు. రూ. 4.500 కోట్ల పంట రుణాలున్నాయి. ప్రస్తుత పరిస్థితిని చూస్తే కేవలం సన్నకారు రైతుల రుణాలు రూ.1,130 కోట్లు మాత్రమే మాఫీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాంకు అధికారుల గణాంకాలను చూస్తే దాదాపు ఐదు లక్షల మంది రైతులకు రుణ మాఫీ అయ్యే అవకాశం లేదు. దీంతో రుణమాఫీ మీద కోటి ఆశలు పెట్టుకున్న రైతులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు.