రాచన్నపేట వద్ద గల రైల్వే అండర్‌బ్రిడ్జి కింద భారీగా చేరిన వర్షం నీరు
- జహీరాబాద్ రైల్వే అండర్ బ్రిడ్జిలో నిలుస్తున్న వరద
- నిర్వహణ లోపంతో ప్రజల ఇబ్బందులు
జహీరాబాద్: వర్షం కురిస్తే చాలు రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి రాకపోకలు గగనమే. కిందికి పూర్తిగా వరద చేరడంతో రాకపోకలు దాదాపు నిలిచిపోతున్నాయి. ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి. జహీరాబాద్ ప్రజల సౌకర్యార్థం ఐదేళ్ల క్రితం భవానీ మందిర్ వెనుకవైపు రోడ్డుకు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించారు.
దీంతో వర్షం పడినప్పుడల్లా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిర్వహణ లోపం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్‌కు పడమర వైపు నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిలోకి వర్షం నీరు వచ్చి చేరుతోంది. వర్షం పడితే వచ్చే వరద బయటకు పోయేందుకు ఏర్పాట్లు చేయలేదు. దీంతో వర్షానికి బ్రిడ్జి కిందకు వచ్చి చేరే నీటిని ఎప్పటి కప్పుడు డీజిల్ ఇంజన్లతో తోడాల్సి వస్తోంది.
భారీ వర్షం కురిస్తే చాలు వరద నీరు అధిక మొత్తంలో బ్రిడ్జి కిందకు వచ్చి చేరుతోంది. ఒక్కోసారి 24 గంటల పాటు రాకపోకలు నిలిచిన పోయిన సందర్భాలున్నాయి. బ్రిడ్జి కిందకు చేరే వర్షం నీటిని డీజిల్ ఇంజన్ల సాయంతో బయటకు తోడాల్సి ఉంటుంది. వర్షం పడితే అప్పటి కప్పుడు మున్సిపల్ సిబ్బంది డీజిల్ ఇంజన్లు తెచ్చి నీటిని తోడడం ఇబ్బందికరంగా మారింది.
తప్పని దూర ప్రయాణం
బ్రిడ్జి కింద వర్షపు నీరు చేరి రాకపోకలు స్తంభించడంతో దూర ప్రయాణం చేయక తప్పడం లేదు. బాగారెడ్డిపల్లి, శాంతి నగర్, హమాలీ కాలనీ, డ్రైవర్స్ కాలనీలు రైల్వే స్టేషన్‌కు దక్షిణం వైపున ఉన్నాయి. ఉత్తరం వైపున ఉన్న రాచన్నపేట, సుభాష్‌గంజ్, హనుమాన్ వీధితో పాటు పలు కాలనీలు ఉన్నాయి. ఆయా కాలనీల మధ్య దూరం తక్కువే. రైల్వే స్టేషన్ మాత్రమే ఉంది. అండర్ బ్రిడ్జిలో వర్షం నీరు వచ్చి చేరితో రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద నుంచి రాక పోకలు సాగించాల్సి వస్తోంది. దీంతో సుమారు కిలో మీటరు దూరం ప్రయాణం చేయాల్సిందే.
ఇబ్బందులు పడుతున్నం
రైల్వే అండర్ బ్రిడ్జి కింద వర్షపు నీరు వచ్చి చేరుతున్నందున రాకపోకలు ఇబ్బందులు వస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లేందుకు వీలు లేకుండా ఉంది. – ఎన్.నిజాముద్దీన్ పటేల్, శాంతినగర్ కాలనీ
కాలినడకన వెళ్తున్నాం
వర్షపు నీరు రైల్వే అండర్ బ్రిడ్జి కిందకు వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచి పోతున్నాయి. మోటారు సైకిల్‌పై వెళ్లేందుకు అధిక ప్రయాణం చేయాల్సి వస్తున్నది. రైలు పట్టాలపై నుంచి కాలినడకన వెళుతున్నాం. – బి.సంగమేశ్వర్, బాగారెడ్డిపల్లి కాలనీ
ఎప్పటికప్పుడు నీటిని తోడేస్తున్నాం
రైల్వే బ్రిడ్జి కిందకు చేరుతున్న వర్షం నీటిని ఎప్పటికప్పుడు తోడేసేందుకు చర్యలు చేపడుతున్నాం. వర్షపు నీరు బయటకు వెళ్లే అవకాశం లేనందున ఇంజన్ల ద్వారా తోడివేయిస్తున్నాం. అయినా రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. – శ్రీధర్‌రెడ్డి, మున్సిపల్ ఏఈ