రైల్వే అండర్ బ్రిడ్జి పనులు అసంపూర్తిగా ఉండడంతో పట్టణ ప్రజలు రాక పోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జహీరాబాద్: రైల్వే అండర్ బ్రిడ్జి పనులు అసంపూర్తిగా ఉండడంతో పట్టణ ప్రజలు రాక పోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిస్తే అండర్ బ్రిడ్జి నుంచి రాకపోకలు పూర్తిగా స్తంభించి పోతుండడంతో ప్రజలు మరో రోడ్డు గుండా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జహీరాబాద్ పట్టణం మధ్యలో రైల్వేస్టేషన్ ఉండడంతో ప్రజలు ఇరు వైపుల నుంచి ఆయా కాలనీలకు కాలినడకన, వాహనాలపై రాక పోకలు సాగించేందుకు అవస్థలకు గురవుతున్నారు.
గతంలో ఉన్న రైల్వే గేటును మూసి వేయడంతో రైల్వే అండర్‌బ్రిడ్జిని నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో మూడు సంవత్సరాల క్రితం రైల్వే అండర్ బ్రిడ్జిని మంజూరు చేయించి పనులు చేపట్టారు. పనులు చివరి దశలో అర్ధంతరంగా నిలిచి పోయాయి. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి కాకుండా జాప్యం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. వర్షం కురిస్తే బ్రిడ్జినిండా నీరు నిలిచి రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా పోతున్నది. వర్షం నీటిని తోడేందుకు వీలుగా రెండు బావులను నిర్మించాల్సి ఉంది. అయినా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.
ఒక బావిని మాత్రమే నిర్మించి అసంపూర్తి పనులతో వదిలి పెట్టారు. మరో బావిని నిర్మించాల్సి ఉంది. బావులను తవ్వించి, సీసీ పనులు చేపట్టాల్సి ఉంది. వర్షం నీరు బావుల్లోకి చేరే విధంగా ఏర్పాట్లు చేసి, ఆ నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపాల్సి ఉంటుంది. అయినా పనులను పూర్తి చేయించే విషయంలో జాప్యం జరుగుతుండడం పట్ల పట్టణ ప్రజలు తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేస్తున్నారు. వర్షం నీరు కాలువల ద్వారా బావుల్లోకి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసిన పైపు లైను వద్దకు మట్టి చేరి నీరు బావుల్లోకి చేరే అవకాశం లేకుండా పోతోందని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.64 లక్షలు కేటాయించగా, సీసీ రోడ్డు, రోడ్డుకు ఇరువైపులా సీసీ గోడల నిర్మాణం, బావుల తవ్వకం పనుల కోసం రూ.1.20 కోట్లు మంజూరు చేసింది. కరెంటు మోటార్లకు బదులు డిజిల్ ఇంజన్లను వినియోగించి నీటిని తోడాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కొనుగోలు చేసిన డీజిల్ ఇంజన్లు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైల్వే అండర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయించి రాక పోకల ఇబ్బందులను దూరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.