జహీరాబాద్ పట్టణంలోని బ్లాక్ రోడ్డులో నిలిచిన వరద(ఫైల్)
- సక్రమంగా లేని డ్రైనేజ్ వ్యవస్థ
- రోడ్లపై ప్రవహిస్తోన్న మురుగు
- పట్టించుకోని అధికారులు
- ఇబ్బందులుపడుతున్న ప్రజలు
జహీరాబాద్ టౌన్: దశాబ్దాల క్రితం నిర్మించి మురికి కాల్వల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. అంతేకాకుండా వ్యాపారులు కూడా మురికి కాల్వలపై శ్లాబులు వేయడంతో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టలేకపోవతున్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు శీతకన్నువేయడంతో మురికినీటిలో ప్రజలు రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు ప్రజలసమస్యను పరష్కరించాల్సిన అవసరం ఉంది.
కొద్దిపాటి వర్షానికి జహీరాబాద్ పట్టణంలోని పలు రోడ్లు జలమయం అవుతున్నాయి. పట్టణంలోని బ్లాక్ రోడ్డు. సుభాష్‌గంజ్, బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు ఇలా ఏ దారి చూసినా వర్షం కురిస్తే చెరువులను తలిపిస్తాయి. నిత్యం జనసమ్మర్దంగా ఉండే ప్రధాన రోడ్లు జలమయం అవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జలయమం అవుతున్న రోడ్లలో ప్రధానంగా బ్లాక్ రోడ్డు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది.
వర్షం కురిస్తే అటు వర్షపునీరు ఇటు మురికినీటితో నిండిపోతోంది. గత్యంతరం లేని పరిస్థితిలో స్థానికులు ఈ దారిలో రాకపోకలు సాగిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడమేనని స్థానికులు చెబుతున్నారు. కాల్వల నిర్మాణం చాలినంతగా లేకపోవడంతో మురుగునీరు కాల్వలోకాకుండా రోడ్లపై ప్రవహిస్తోందని విచారం వ్యక్తంచేస్తున్నారు.
దీనికితోడు వ్యాపారులు కూడా దశాబ్దాల క్రితం నిర్మించిన కాల్వలపై శ్లాబువేయడంతో డ్రైనేజీ శుభ్రం చేయలేకపోతున్నారు. దీంతో చెత్తచెదారం నిండిపోయి మురుగు నీరు ముందకు పారడంలేదు. బ్లాక్‌రోడ్డులోని ఇరువైపులా ఉన్న శిథిలమైన మురికి కాల్వల స్థానంలో కొత్తవి కట్టించాలని, డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
అండర్ డ్రైనేజీ వ్యవస్థ కరువు
జహీరాబాద్ పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని పలు సందర్భాల్లో పాలకులు ప్రకటించారు. కానీ ఇంతవరకు ఈ దిశగా చర్యలు తీసుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుచేస్తే మురికి నీటితో పాటు వర్షపునీరు కూడా సాఫీగా ప్రవహిస్తుంది.
నీరు రాకుండా కట్టలను కట్టాం
వర్షంపడితే బ్లాక్ రోడ్డు వర్షపునీటితో నిండిపోతుంది. నీరు దుకాణాల లోపలి వరకు వస్తుంది. వాన నీరు లోపలికి రాకుండా వ్యాపారులంతా తమ తమ దుకాణాల ముందు ఎత్తుగా కట్టలను కట్టించాం. మురికి కాల్వలు సరిగ్గా లేకపొవడంతో నీరు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు చర్యలు తీసుకోవాలి. - సురేష్ , వ్యాపారి
రాకపోకలకు ఆటంకం
వర్షం పడితే రోడ్డు ఎటవాలుగా ఉండటంతో ఎగువ ప్రాంతంలోని నీరు బ్లాక్‌రోడ్డుకు చేరుతుంది. వాననీరు ముందుకు పారేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో రోడ్డులో నీరు నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. చాలా రోజుల నుంచి సమస్య వేధిస్తున్నా మున్సిపల్ అధికారులు సమస్య పరిష్కరించలేదు. - దత్తాత్రి, జహీరాబాద్
ఫిర్యాదులు వస్తున్నాయి
బ్లాక్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల ప్రజలు, వ్యాపారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. నిధుల లేక డ్రైనేజీ పనులను చేపట్టడంలేదు. పనులకు పెద్ద మొత్తంలో నిధుల అవసరం. ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపాం. నిధులు వచ్చిన వెంటనే రోడ్లపై నీరు నిల్వలేకుండా చర్యలు తీసుకుంటాం. - జైత్రాం, మున్సిపల్ కమిషనర్