officers neglegency
-
చినుకు పడితే చెరువే!
సక్రమంగా లేని డ్రైనేజ్ వ్యవస్థ రోడ్లపై ప్రవహిస్తోన్న మురుగు పట్టించుకోని అధికారులు ఇబ్బందులుపడుతున్న ప్రజలు జహీరాబాద్ టౌన్: దశాబ్దాల క్రితం నిర్మించి మురికి కాల్వల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. అంతేకాకుండా వ్యాపారులు కూడా మురికి కాల్వలపై శ్లాబులు వేయడంతో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టలేకపోవతున్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు శీతకన్నువేయడంతో మురికినీటిలో ప్రజలు రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు ప్రజలసమస్యను పరష్కరించాల్సిన అవసరం ఉంది. కొద్దిపాటి వర్షానికి జహీరాబాద్ పట్టణంలోని పలు రోడ్లు జలమయం అవుతున్నాయి. పట్టణంలోని బ్లాక్ రోడ్డు. సుభాష్‌గంజ్, బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు ఇలా ఏ దారి చూసినా వర్షం కురిస్తే చెరువులను తలిపిస్తాయి. నిత్యం జనసమ్మర్దంగా ఉండే ప్రధాన రోడ్లు జలమయం అవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జలయమం అవుతున్న రోడ్లలో ప్రధానంగా బ్లాక్ రోడ్డు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. వర్షం కురిస్తే అటు వర్షపునీరు ఇటు మురికినీటితో నిండిపోతోంది. గత్యంతరం లేని పరిస్థితిలో స్థానికులు ఈ దారిలో రాకపోకలు సాగిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడమేనని స్థానికులు చెబుతున్నారు. కాల్వల నిర్మాణం చాలినంతగా లేకపోవడంతో మురుగునీరు కాల్వలోకాకుండా రోడ్లపై ప్రవహిస్తోందని విచారం వ్యక్తంచేస్తున్నారు. దీనికితోడు వ్యాపారులు కూడా దశాబ్దాల క్రితం నిర్మించిన కాల్వలపై శ్లాబువేయడంతో డ్రైనేజీ శుభ్రం చేయలేకపోతున్నారు. దీంతో చెత్తచెదారం నిండిపోయి మురుగు నీరు ముందకు పారడంలేదు. బ్లాక్రోడ్డులోని ఇరువైపులా ఉన్న శిథిలమైన మురికి కాల్వల స్థానంలో కొత్తవి కట్టించాలని, డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. అండర్ డ్రైనేజీ వ్యవస్థ కరువు జహీరాబాద్ పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని పలు సందర్భాల్లో పాలకులు ప్రకటించారు. కానీ ఇంతవరకు ఈ దిశగా చర్యలు తీసుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుచేస్తే మురికి నీటితో పాటు వర్షపునీరు కూడా సాఫీగా ప్రవహిస్తుంది. నీరు రాకుండా కట్టలను కట్టాం వర్షంపడితే బ్లాక్ రోడ్డు వర్షపునీటితో నిండిపోతుంది. నీరు దుకాణాల లోపలి వరకు వస్తుంది. వాన నీరు లోపలికి రాకుండా వ్యాపారులంతా తమ తమ దుకాణాల ముందు ఎత్తుగా కట్టలను కట్టించాం. మురికి కాల్వలు సరిగ్గా లేకపొవడంతో నీరు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు చర్యలు తీసుకోవాలి. - సురేష్ , వ్యాపారి రాకపోకలకు ఆటంకం వర్షం పడితే రోడ్డు ఎటవాలుగా ఉండటంతో ఎగువ ప్రాంతంలోని నీరు బ్లాక్రోడ్డుకు చేరుతుంది. వాననీరు ముందుకు పారేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో రోడ్డులో నీరు నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. చాలా రోజుల నుంచి సమస్య వేధిస్తున్నా మున్సిపల్ అధికారులు సమస్య పరిష్కరించలేదు. - దత్తాత్రి, జహీరాబాద్ ఫిర్యాదులు వస్తున్నాయి బ్లాక్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల ప్రజలు, వ్యాపారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. నిధుల లేక డ్రైనేజీ పనులను చేపట్టడంలేదు. పనులకు పెద్ద మొత్తంలో నిధుల అవసరం. ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపాం. నిధులు వచ్చిన వెంటనే రోడ్లపై నీరు నిల్వలేకుండా చర్యలు తీసుకుంటాం. - జైత్రాం, మున్సిపల్ కమిషనర్ -
గుట్టుగా రంగురాళ్ల తవ్వకం
చోద్యం చూస్తున్న అధికారులు నంగునూరు: రంగురాళ్లు తవ్వుతూ కొందరు వ్యాపారులు అక్రమ రవాణా చేస్తూ కాసులు గడిస్తున్నారు. రహదారికి సమీపంలోనే ఈ తతంగం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మండలంలోని వెంకటాపూర్ గ్రామంలోని ఓ రైతు పొలంలో కొన్ని రోజులుగా రంగు రాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా తవ్వకాలు జరిపి రాళ్లను సేకరించి అనంతరం భూమిని చదును చేస్తున్నారు. అనంతరం ఆదే భూమిలో మొక్కలను నాటుతూ ప్రతి రోజు కూళీల చేత రాళ్లను వేరు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నారు. భూమిలో నుంచి ఖనిజాలను తీయాలంటే తప్పనిసరిగా మైనింగ్ అధికారులు లేదా రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొందరు వ్యాపారులు తవ్వకాలు చేపట్టి రెండు రోజులకోమారు రంగు రాళ్లను దూర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. భూమిలో నుంచి తీసిన పెద్ద రాళ్లను వేరు చేసి కూలీల చేత తమకు కావలసిన సైజులో తయారు చేసి అటోలో తరలిస్తున్నారు. రోడ్డు పక్కనే అక్రమ పారం జరుగుతున్నా అధికారుల పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ రవాణాను అడ్డుకోవాలని వారు కోరుతున్నారు. -
అక్రమ వెంచర్లకు పెద్దల అండ
దళారులుగా సర్పంచ్‌లు! పట్టించుకోని అధికారులు పటాన్చెరు: మండలంలో అక్రమ వెంచర్ల దందా జోరుగా సాగుతోంది. పలువురు సర్పంచ్‌లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోండడంతో పంచాయతీకి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. వెంచర్లకు అనుమతులున్నాయని పాత తేదీల్లో దస్తావేజులు సృష్టిస్తున్నట్టు సమాచారం. రెవెన్యూ అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తోండడంతో అక్రమ వెంచర్ల జోరు పెరిగింది. పటాన్చెరు మండలానికి రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడంతో రియల్ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. నందిగామ పరిధిలో వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు ఓ రెవెన్యూ అధికారికి రూ.14 లక్షలు ముట్టజెప్పి భూమి చదును చేసే పనులకు శ్రీకారం చుట్టారని సమాచారం. అనుమతులు లేకుండానే భూమి చదును చేసే పనులు సాగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. నందిగామ పరిధిలో అదే వెంచర్ నిర్వాహకులు గతంలో హెచ్ఎండీఏ అనుమతులున్నాయని బోర్డులు పెట్టి ప్రచారం చేశారు. తాజాగా ఆ బోర్డులను తొలగించి భూమిని చదును చేస్తున్నారు. రోడ్లు వేసేందుకు మట్టిని తవ్వి తెస్తున్నారు. వాల్టా చట్టం ప్రకారం ప్రైవేటు పట్టాదారు భూమిలో మట్టి తవ్వినా రెవెన్యూ అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ నిబంధనలు రెవెన్యూ అధికారుల సొంత జేబు రాబడికి అనువుగా ఉందే తప్ప ప్రజలకు ఉపయోగపడటం లేదు. భవిష్యత్‌లో పర్యావరణానికి జరిగే నష్టంపై ఎవరూ ఆలోచించడం లేదు. పచ్చని చెట్లను నరికేస్తూ వెంచర్లు వేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఆ సంగతి పక్కన పెడితే ప్రజలను మోసం చేస్తూ కొత్తగా వస్తున్న వెంచర్లను ఆపాల్సిన సర్పంచ్‌లు దళారులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పటాన్చెరు మండలంలో జరుగుతున్న అక్రమ వెంచర్లను వెంటనే ఆపాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. అక్రమ వెంచర్లతో కొత్తగా వచ్చే ఆవాసాల్లో కనీస మౌలిక వసతులు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. పాటి, ముత్తంగి, ఇస్నాపూర్, భానూర్, నందిగామ గ్రామాల్లో లెక్కాపత్రం లేకుండా అక్రమ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో అక్రమ వెంచర్లు, నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇస్నాపూర్ సర్పంచ్ తీరుపై ఆ గ్రామ నాయకులు నేరుగా డీపీఓకు, ఇతర అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. హెచ్ఎండీఏ అనుమతి లేకుండానే నందిగామలో సాగుతున్న రియల్ డ్రామాలను అధికారులు అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.