సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేస్తున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో బాల్క సుమన్, చిన్నయ్య, వెంకటేశ్ నేత
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ మంచిర్యాల: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి క్రికెట్‌లో వెస్టిండీస్ టీం మాదిరిగా తయారైందని.. ఒకప్పుడు వరల్డ్‌కప్ గెలిచిన ఆ టీం ఇప్పుడు ఇదే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కూడా కాలేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అలాగే ఒకప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు కనీసం ప్రతిపక్ష పార్టీ హోదాకు కూడా క్వాలిఫై కాలేదన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రనౌట్ కావడం ఖాయమని.. బీజేపీ డకౌట్ అవుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ సెంచరీ కొడతారని ధీమా వ్యక్తం చేశారు. శనివారం సంగారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో హరీశ్‌రావు పర్యటించారు. ఝరాసంగం మండలంలోని కేతకీ సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జహీరాబాద్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబి్ధదారులకు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో హరీశ్‌రావు ప్రసంగించారు.
రాష్ట్రంలో 30 స్థానాల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఫేక్ సర్వేలతో కాంగ్రెస్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తోందన్నారు. అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కనీసం తాగునీటిని కూడా సరిగ్గా సరఫరా చేయలేని కాంగ్రెస్.. తెలంగాణలో అధికారం కోసం అమలుకు వీలు కాని హామీలను ఇస్తోందని హరీశ్‌రావు విమర్శించారు.
హంగ్ కాదు.. హ్యాట్రిక్...
బీజేపీ తీరును కూడా మంత్రి హరీశ్ తూర్పారబట్టారు. రాష్ట్రంలో హంగ్ ఫలితాలు వస్తాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని, తెలంగాణలో హంగ్ రాదని, ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన సొంత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో గెలువలేని జేపీ నడ్డా.. తెలంగాణలో బీజేపీని ఎలా గెలిపిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కలెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.
‘కాళేశ్వరం’ముంపునకు శాశ్వత పరిష్కారం
కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హరీశ్‌రావు హామీనిచ్చారు. మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల్లో ప్రాణహిత, గోదావరి వరదలతో నష్టపోకుండా సర్వే చేయిస్తామని చెప్పారు. వరద ముంపు సమస్యపై స్పందించిన మంత్రి హరీశ్‌రావుకు బాల్క సుమన్ వేదికపైనే పాదాభివందనం చేశారు. మంత్రి పర్యటనలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపల్లి దివాకర్‌రావు, ఎంపీ వెంకటేశ్ నేత పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అవుతుంది
కాంగ్రెస్ గురించి రేవంత్‌రెడ్డికి ఏం తెలుసని హరీశ్‌రావు అన్నారు. టీడీపీలో ఉండి సోనియాగాం«దీని బలి దేవత అన్నాడని, ఇప్పుడు దేవత అని పొగుడుతున్నాడని విమర్శించారు. నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పుల గుర్తుతో పార్టీ పెట్టీ బీజేపీలో చేరారని, నాటి పీసీసీ అధ్యక్షుడు బొత్స వైసీపీలో చేరారని, నువ్వు ఏబీవీపీ, టీఆర్‌ఎస్, తెలుగుదేశం, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరావని, రేపు ఏ పార్టీలోకి వెళ్తావని రేవంత్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.
శనివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గోదావరిపై నిర్మిస్తున్న పడ్తనపల్లి ఎత్తిపోతల పథకం, 33/11కేవీ సబ్‌స్టేషన్, చెన్నూరు పట్టణంలో 50 పడకల ఆసుపత్రి ప్రారంభం, దోభిఘాట్‌కు శంకుస్థాపన, సుద్దాల వంతెనను మంత్రి ప్రారంభించారు. దోనబండ సభ, చెన్నూరు పట్టణంలో రోడ్ షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ ప్రకటించే మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్‌బ్లాక్ అవుతుందన్నారు. మంచిర్యాల, చెన్నూరు ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, బాల్క సుమన్‌ను భారీ మెజారీ్టతో గెలిపించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment