ఖాతాదారులతో పాటు రైతులు, వ్యాపారులకు సేవలందించే లక్ష్యంతో తమ బ్యాంకు ముందుకు సాగుతోందని ఆంధ్రాబ్యాంకు నిజామాబాద్ జోనల్ మేనేజర్ మల్లికార్జున పేర్కొన్నారు.
జహీరాబాద్, న్యూస్‌లైన్: ఖాతాదారులతో పాటు రైతులు, వ్యాపారులకు సేవలందించే లక్ష్యంతో తమ బ్యాంకు ముందుకు సాగుతోందని ఆంధ్రాబ్యాంకు నిజామాబాద్ జోనల్ మేనేజర్ మల్లికార్జున పేర్కొన్నారు. బుధవారం మండలంలోని మొగుడంపల్లి ఆంధ్రాబ్యాంకులో ఏటీఎం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ఖాతాదారులకు సైతం సేవలందించేందుకు వీలుగా తమ బ్యాంకు ఆధ్వర్యంలో నూతనంగా ఏటీఎం కేంద్రాన్ని ప్రారంభించామన్నారు.
దీంతో ఈ ప్రాంత ఖాతాదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తమ జోన్‌పరిధిలో 66 ఏటీఎంలు ఉన్నాయన్నారు. రూ.2.45 లక్షల కోట్ల వ్యాపారంతో ఆంధ్రాబ్యాంకు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థగా దేశ ప్రజల అవసరాలను తీరుస్తోందన్నారు. 2115 శాఖలు, 1893 ఏటీఎంలతో 25 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరింపబడి 20 మిలియన్ల పైబడి ఖాతాదారులకు సేవలందిస్తోందన్నారు. నిజామాబాద్ జోన్ పరిధిలో 66 శాఖలు, 66 ఏటీఎంలు సేవలందిస్తున్నాయన్నారు. రూ.819 కోట్లు వ్యవసాయ రంగానికి, రూ.597 చిన్న తరహా పరిశ్రమల రంగానికి రుణసహాయం అందించామన్నారు.
నవశక్తి పేరిట 24 గంటలు ఈ-బ్యాంకింగ్ సేవలను అందించేందుకు, ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు వీలుగా బ్యాంకు శాఖలను ఆధునీకరిస్తున్నామన్నారు. ఖాతాదారుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆంధ్రాబ్యాంకు జీవిత బీమా సౌకర్యంతో ‘ఏబీజే -ప్లస్’ అనే కొత్త సేవింగ్స్ పథకాన్ని, చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ‘అభివృద్ధి’ పేరిట కొత్త రుణ పథకాన్ని ప్రారంభించినట్లు వివరించారు. తమ బ్యాంకు అందిస్తున్న సేవలను ప్రజలు, రైతులు, వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ రామారావు, తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో కూడా సేవలు
శివ్వంపేట: గ్రామీణ స్థాయిలో తమ బ్యాంకు సేవలను విసృ్తత పరిచేందుకు కృషి చేస్తునట్లు ఆంధ్రాబ్యాంక్ నిజామాబాద్, మెదక్ జోనల్ మేనేజర్ మల్లికార్జున పేర్కొన్నారు. బుధవారం మండల దొంతి ఆంధ్రా బ్యాంక్ శాఖ వద్ద ఎటీఏం కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖాతాదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ బ్యాంకు ఆధ్వర్యంలో రూ. 3500 కోట్ల పైబడి లావాదేవిలు జరుగుతున్నాయన్నారు. అధికంగా వ్యవసాయ రంగానికి రుణాలు ఇస్తున్నామన్నారు. తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తేనే బ్యాంకులు మనుగడ సాధిస్తాయన్నారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ విద్యాసాగర్, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు పిట్ల లక్ష్మీసత్యనారాయణ, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.