
జహీరాబాద్: విదేశాల నుంచి ఫోన్‌లో భర్త బెదిరింపులతో పాటు ఇంట్లో అత్త, మామలు పెట్టే బాధలను భరించలేక మంజుల(36) అనే వివాహిత సోమవారం రాత్రి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ ప్రభాకర్‌రావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ పట్టణంలోని ఎస్‌బీహెచ్ కాలనీకి చెందిన కుల్‌కర్ణి సురేందర్ కుమార్తె మంజులకు ఇబ్రహీం పట్నానికి చెందిన శేషవర్ధన్‌తో 18 నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం అయిన నెల రోజులకే భర్త ఉద్యోగం నిమిత్తం కెనడా వెళ్లాడు. దీంతో మంజుల అత్త శ్రీదేవి, మామ రాఘవరావులతో కలిసి ఉండేది. దీంతో అత్త, మామలు ప్రతినిత్యం వేధింపులకు గురి చేసేవారు. భర్త సైతం ఫోనులో దూషిస్తూ మానసికంగా వేధించేవాడు.
విషయం తెలుసుకున్న తండ్రి తన కుమార్తెను పెళ్లి అయిన ఏడు నెలలకే తన దగ్గరకు తీసుకెళ్లాడు. భర్త తరచూ ఫోన్‌చేసి భార్యను బెదిరిస్తూ వేధించేవాడు. ఆరు నెలల క్రితం అత్త, మామలు, పెద్ద మనుషులు జహీరాబాద్ వచ్చి పంచాయతీ నిర్వహించారు. ఈ మేరకు భార్యా భర్తలు ఇరువురు విడాకులు తీసుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. జహీరాబాద్ కోర్టులో విడాకుల కోసం మంజుల పిటిషన్ వేసింది. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. జీవితంపై విరక్తి చెందిన మంజుల ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు వేసుకుని, ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పం టించుకుంది. కుటుంబ సభ్యులంతా దైవ దర్శనం కోసం ఝరాసంగం ఆలయానికి వెళ్లారు. ఇంట్లో మంజుల ఒక్కతే ఉంది. రాత్రి ఇంట్లో నుంచి పొగలు రావడం చూసిన చుట్టుపక్కల వారు సురేందర్ కుల్‌కర్ణికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో అతడు ఇంటికి వచ్చి ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా కుమార్తె మంజుల ఆత్మహత్య చేసుకుని ఉంది. అనంతరం సీఐ నాగరాజు సంఘటనా స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించారు. తండ్రి ఫిర్యాదు మేరకు జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment