జహీరా‘బాద్‌షా’ ఎవరో...
రాజకీయ, భౌగోళిక వైవిధ్యాలకు చిరునామా జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం. రెండు జిల్లాల అసెంబ్లీ సెగ్మెంట్లతో ఏర్పడిన ఈ నియోజకవర్గం కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దులో ఉంది. ఓ జిల్లాలో టీఆర్‌ఎస్ బలంగా ఉండగా, మరో జిల్లాలో బలహీనంగా ఉండడంతో ఇక్కడి ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. సొంత బలం కన్నా ప్రత్యర్థుల బలహీనతలపైనే గురిపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు.
లోక్‌సభ నియోజకవర్గం: జహీరాబాద్
నియోజకవర్గం ఏర్పడింది : 2009
ఎవరెన్ని సార్లు గెలిచారు : కాంగ్రెస్- 1
ప్రస్తుత ఎంపీ : సురేష్ షెట్కార్
ప్రస్తుత రిజర్వేషన్ : జనరల్
ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థులు : 12 మంది
మొత్తంఓటర్లు : 14,30,413
పురుషులు : 7,03,823
స్త్రీలు : 7,26,516
ఇతరులు : 74
నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు : జహీరాబాద్, అందోలు, నారాయణ్‌ఖేడ్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్, బాన్సువాడ (నిజామబాద్ జిల్లా )
ప్రధాన అభ్యర్థులు : సురేష్ షెట్కార్(కాంగ్రెస్), మహమ్మద్ మొహియొద్దీన్ (వైఎస్సార్‌సీపీ), బీబీ పాటిల్(టీఆర్‌ఎస్), మదన్‌మోహన్ రావు(టీడీపీ)
మహమ్మద్ ఫసియొద్దీన్- సంగారెడ్డి: నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో సిద్దిపేట లోక్‌సభ స్థానం రద్దయి, జహీరాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. మెదక్ జిల్లాలోని మూడు, నిజామాబాద్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిటింగ్ ఎంపీ సురేష్ షెట్కార్ బరిలో ఉన్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన ఆయన గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సయ్యద్ యూసుఫ్ అలీపై 17,407 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఐదేళ్లలో ఆయన అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మహమ్మద్ మొహియొద్దీన్, టీఆర్‌ఎస్ అభ్యర్థి భీంరావు బస్వంత్‌రావు పాటిల్, బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి కె. మదన్ మోహన్‌రావు నుంచి సురేష్ షెట్కార్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది.
ఉద్యమం మీదే భారం..
నిజామాబాద్ జిల్లా సిర్పూర్‌కు చెందిన పారిశ్రామికవేత్త బీబీ పాటిల్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు చివరి నిమిషంలో టికెట్ కేటాయించడంతో పార్టీ శ్రేణుల నుంచే విమర్శలొచ్చాయి. ఉద్యమ ప్రభావం పాటిల్‌కు ఎంత వరకు ఉపకరిస్తుందన్నది అనుమానమే. ఆయనకు తెలుగు భాష రాదని.. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో టీఆర్‌ఎస్ బలంగానే ఉన్నా.. మెదక్ జిల్లా పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాలపై ఏమాత్రమూ పట్టు లేకపోవడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారవచ్చు.
పొత్తుపైనే ఆశలు..
టీడీపీ తరఫున నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన ఐటీ కంపెనీ అధినేత కె.మదన్ మోహన్ రావు బరిలో ఉన్నారు. ఆయన టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు సమీప బంధువు. ఇక్కడ టీడీపీ బలహీనంగా ఉన్నా, బీజేపీతో పొత్తు- నరేంద్ర మోడి గాలిపై ఆయన ఆశలు పెట్టుకున్నారు.
వైఎస్ పథకాలే అండ..
హైదరాబాద్ నగరానికి చెందిన మహమ్మద్ మొహియొద్దీన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు గణనీయంగా ఉండడం ఆయనకు కలిసివచ్చే అంశం. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ముస్లిం అభ్యర్థి స్వల్ప తేడాతో ఓడిపోవడం విశేషం. వైఎస్సార్ సంక్షేమ కార్యక్రమాలతో లబ్ధి పొందిన వారు తనను ఆదరిస్తారని ఆయన ధీమాగా ఉన్నారు.
సమస్యలతో సహవాసం..
- ఎగువ ప్రాంతంలో మంజీరానది పారుతున్నా నియోజకవర్గ ప్రజలు మాత్రం తాగు, సాగునీరుకు నోచుకోలేకపోయారు.
- తాగునీటి కోసం పల్లె ప్రజలు కిలోమీటర్ల దూరంలో ఉండే చెలమలు, వ్యవసాయ బావులపై ఆధారపడాల్సిన దుస్థితి.
- మద్దతు ధర లభించక చెరకు రైతు నష్టపోతున్నారు.
- పరిశ్రమలు లేక స్థానికంగా ఉపాధి అవకాశాల్లేవు. వందల సంఖ్యలో గిరిజన తండాలుండగా.. ఏటా గిరిజన కుటుంబాలకు వలసబాట తప్పదు. ఏడాదిలో సగభాగం తండాలన్నీ ఖాళీగా కనిపిస్తాయి.
- కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో వేల మంది గల్ఫ్ బాధితులు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు.
- గణనీయ సంఖ్యలో ఉన్న బీడీ కార్మికుల బతుకులు పొగ చూరుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసి బీడీలు చుట్టినా పూట గడవని స్థితిలో ఉన్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందడం లేదు. క్షయ, క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడుతున్నారు.
సురేష్ షెట్కార్ (కాంగ్రెస్)
అనుకూలం..
- కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందనే ప్రచారం
- మృదు స్వభావి..వివాదాలకు దూరంగా ఉండడం
- ప్రభుత్వ విద్యా సంస్థల ఏర్పాటుకు కృషి చేయడం
- బరిలో ఉన్న ప్రత్యర్థుందరూ కొత్తవాళ్లే కావడం
ప్రతికూలం...
- సమస్యలు పరిష్కారం కాక ప్రజల్లో వ్యతిరేకత
- స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం
- జిల్లాలో టీఆర్‌ఎస్ బలంగా ఉండడం
- సొంత పార్టీలో అంతర్గ కుమ్ములాటలు
నే గెలిస్తే...
- ప్రతి గ్రామానికి మంజీర నీటి సరఫరా
- పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి
- బోధన్-బీదర్ రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యలు
- కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కృషి
మదన్ మోహన్ రావు (టీడీపీ)
అనుకూలం..
- ఆర్థికంగా బలంగా ఉండడం
- సామాజిక సేవా కార్యక్రమాలు
- సైకిల్ యాత్రతో గ్రామాల్లో పర్యటించడం
- నరేంద్ర మోడి అంశం
ప్రతికూలం...
- రాజకీయాలకు కొత్త కావడం
- టీడీపీ సంస్థాగతంగా బలహీనపడడం
- బీజేపీ పొత్తుతో మైనారిటీ ఓట్లు దూరం కావడం
నే గెలిస్తే...
- వలసల నివారణ కోసం పరిశ్రమల స్థాపనకు కృషి
- బోధన్ నుంచి బీదర్ వరకు జుక్కల్, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్‌ల మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు
- గల్ఫ్ బాధితులు, బీడీ కార్మికులకు పునరావాసం
- మంజీర నుంచి ప్రతి గ్రామానికి తాగునీరు
- పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తా
బీబీపాటిల్ (టీఆర్‌ఎస్)
అనుకూలం..
- తెలంగాణవాదం బలంగా ఉండడం
- వ్యాపారవేత్తగా గుర్తింపు
- తెలుగు కన్నడిగుల మద్దతు
ప్రతికూలం...
- తెలుగు భాష రాకపోవడం
- చివరి నిమిషంలో పార్టీ టికెట్‌పై బరిలో దిగడం
- ప్రజల్లో ప్రచారం లేకపోవడం
- బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేశారనే ఆరోపణలు
నే గెలిస్తే...
- గిట్టుబాటు ధరతో పాటు రైతుల ఇతర సమస్యల పరిష్కారం
- కాలుష్య రహిత పరిశ్రమల స్థాపన ..యువతకు ఉపాధి కల్పన
- రైల్వే లైనుల ఆధునికీకరణ
మహమ్మద్ మొహియొద్దీన్ (వైఎస్సార్‌సీపీ)
అనుకూలం...
- దివంగత సీఎం వైఎస్ పథకాల ప్రభావం
- మైనారిటీల ఓట్లు గణనీయంగా ఉండడం
- గత ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థి స్వల్ప ఓట్లతో ఓడిపోవడం
- వ్యాపారవేత్తగా ప్రజలతో సత్సంబంధాలు
ప్రతికూలం..
- తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేయడం
- ప్రత్యర్థులతో పోలిస్తే ఆర్థికంగా బలహీనమే
నే గెలిస్తే...
- స్థానిక కంపెనీల్లో స్థానికులకే ఉపాధి అవకాశాలు
- కొత్త పరిశ్రమల ఏర్పాటు, పెద్దాస్పత్రి నిర్మాణం
- ప్రతి పల్లెకు మంజీర నీటి సరఫరా
- రైతు ఆత్మహత్యల నివారణకు కృషి
- ప్రభుత్వ విద్యా సంస్థల్లో టీచర్ల నియామకం