కర్నూలులో బుధవారపేటకు చెందిన రామాంజనేయులు ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తాడు. ఆయన పదేళ్లుగా షుగర్ జబ్బుతో బాధపడుతున్నాడు. వైద్యుల సూచన మేరకు ఆయన ఆహార మెనూ మార్చుకున్నాడు. రాగులు, జొన్నలతో చేసిన ఆహారాన్ని తింటున్నాడు. ఫలితంగా షుగర్ స్థాయి సాధారణ స్థితికి వచ్చింది.
నంద్యాలకు చెందిన రఘురామయ్యకు ఎంతకూ షుగర్ నియంత్రణలోకి రాలేదు. దీంతో ఆహారంలో సిరిధాన్యాలు చేర్చుకున్నాడు. మూడురోజులకు ఒక సిరిధాన్యాన్ని మార్చి మార్చి వివిధ వంటకాలు తయారు చేయించుకుని తినసాగాడు. కొన్ని రోజులకే షుగర్ నియంత్రణలోకి వచ్చింది.
... వీరే కాదు జిల్లాలో అనేక మంది తమ ఆహారపు అలవాట్లను మార్చుకున్నారు. పాతకాలం నాటి ఆహార పదార్థాలను ఇష్టపడుతున్నారు. కొర్రలు, సజ్జలు, రాగులు, సామలు, గోధుమలతో చేసిన వంటకాలను తింటున్నారు.
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): బీపీ, షుగర్, కీళ్లనొప్పులు, ఊబకాయం, గ్యాస్ట్రబుల్, గుండెజబ్బులు వంటివన్నీ జీవనశైలిలో మార్పుల వల్ల వచ్చే జబ్బులే. జిల్లా జనాభా 45లక్షలకుపైగానే ఉంది. ఇందులో 20% ప్రజలు బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి జీవనశైలి జబ్బులతో బాధపడుతున్నారు. తలనొప్పి, కళ్లు తిరగడం, ఒళ్లునొప్పులు, నీరసం, మూత్రం ఎక్కువసార్లు వెళ్లడం వంటి లక్షణాలుండి వైద్యుల వద్దకు వెళ్లే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి బీపీ, షుగర్ ఉన్నట్లు నిర్ధారిస్తున్నారు. వైద్యులు ముందుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.
రొట్టెలకు భలే గిరాకీ
వైద్యుల సూచన మేరకు చాలా మంది రొట్టెలు తింటున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కర్నూలులో రొట్టెల విక్రయాలు పెరిగాయి. కర్నూలులోని గాంధీనగర్, వెంకటరమణ కాలనీ, నరసింహారెడ్డి నగర్, రైల్వేస్టేషన్ రోడ్, అశోక్‌నగర్, మద్దూర్‌నగర్, నంద్యాల రోడ్డు, గణేష్‌నగర్, సి.క్యాంపు, నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ, బుధవారపేట, శ్రీరామనగర్ తదితర కాలనీల్లో రొట్టెలు విక్రయించే దుకాణాలు వెలిశాయి. ఒక్కో రొట్టె రూ.12 నుంచి రూ.15 వరకు విక్రయిస్తున్నారు. వీటిలోకి కర్రీ కావాలంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
రెస్టారెంట్లలోనూ మార్పు
ప్రజల ఆహారపు అలవాట్లు మారడంతో హోటళ్లు, రెస్టారెంట్లలోనూ మెనూలో మార్పులు తీసుకొచ్చారు. నగరంలో 30కి పైగా చిన్నా, పెద్దా రెస్టారెంట్లు ఉన్నాయి. ఇందులో అధిక శాతం జొన్న రొట్టెలు ఆర్డర్ ఇస్తున్నారు. అందులో ఏదో ఒక కర్రీని ఆహారంగా తీసుకుంటున్నారు. రాగి ముద్ద, రాగిసంకటి, కొర్ర అన్నం కూడా రెస్టారెంట్లలో వండి పెడుతున్నారు. కర్నూలులోని ఐదురోడ్ల కూడలిలో కేవలం సిరిధాన్యాలతో వండిన ఆహారపదార్థాలను విక్రయించడం విశేషం.
సిరిధాన్యాలకు భలే గిరాకీ
ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ జొన్నలు(రాయచూరు) రూ.55, కొర్రలు రూ.60, సామలు, అరికెలు రూ.80కు పైగానే విక్రయిస్తున్నారు. ఇక సేంద్రియ ఎరువులతో పండించిన సిరిధాన్యాలు కిలో రూ.110కు పైగానే పలుకుతున్నాయి. గతంలో వీటిని కొనేవారు లేక పశువులకు పెట్టేవారంటే అతిశయోక్తి కాదు.
శుభపరిణామం
ఆకలేస్తే పిజ్జాలు, బర్గర్లు తినడం వల్ల కొవ్వు శాతం అధికమైపోయి గుండెపోటుకు దారి తీస్తోంది. పలుమార్లు కాచిన నూనెలో చేసిన బజ్జీలు తినడం, కూల్‌డ్రింక్స్, నిల్వ ఉంచిన బిస్కట్లు తినడం వల్ల క్యాన్సర్ వస్తోంది. వీటన్నింటికీ విరుగుడూ ఆహారంలో మార్పులే. ఈ దిశగా ప్రస్తుతం ప్రజలు ముందుకు వెళ్లడం శుభపరిమాణం.
–డాక్టర్ జి.రమాదేవి, డైటీషియన్, కర్నూలు
వ్యాధులు దరి చేరవు
వరి, గోధుమల్లో రెండు శాతంలోపే పీచు ఉంటుంది. సిరిధాన్యాల్లో 6 నుంచి 8 శాతం వరకు పీచు ఉంటుంది. దీనివల్ల త్వరగా జీర్ణం గాక నిదానంగా శరీరంలోకి గ్లూకోజు విడుదల అవుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మలబద్దకం పోతుంది. సిరిధాన్యాలతో తయారు చేసిన కషాయాలు సేవించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి.
–డాక్టర్ ద్వారం ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు, కర్నూలు
అన్నం పూర్తిగా మానేశాను
నాకు 12 ఏళ్లుగా షుగర్ జబ్బు ఉంది. ఈ వ్యాధి వల్ల నేను అనేక ఇబ్బందులు పడ్డాను. చివరకు వైద్యుల సలహా మేరకు నా మెనూలో మార్పులు చేసుకున్నాను. ఇప్పుడు చాలా తక్కువ పరిమాణంలో ఆహారాన్ని తీసుకుంటున్నాను. తెల్ల అన్నాన్ని పూర్తిగా మానేశాను. జొన్నరొట్టెలు, రాగి సంకటి వంటివి తింటున్నాను. ఈ కారణంగా ప్రస్తుతం షుగర్ కంట్రోల్‌లో ఉంటోంది. –వాడాల ప్రసాద్, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment