బలవర్ధకమైన ఆరిక అన్నం గురించి ఈ విషయాలు తెలుసా? | Sagubadi: How To Cultivate Arikelu Kodo Millet | Sakshi
Sakshi News home page

Kodo Millets: బలవర్ధకమైన ఆరిక అన్నం గురించి ఈ విషయాలు తెలుసా?

Published Wed, Jun 21 2023 4:55 PM | Last Updated on Fri, Jul 14 2023 4:19 PM

Sagubadi: How To Cultivate Arikelu Kodo Millet - Sakshi

మొలిచిన తర్వాత 40–50 రోజులు వర్షం లేకపోయినా.. బతికి ఉండటమే కాదు చక్కని దిగుబడినిచ్చే అద్భుత ఆహార పంట.. ఆరిక అన్నం గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ఆరిక అన్నం ఇంటిల్లపాదికీ అత్యంత బలవర్ధకమైన, ఔషధ గుణాలున్న ఆహారం. ఖరీఫ్‌లో మాత్రమే సాగయ్యే చిరుధాన్య పంట ఆరిక మాత్రమే. ఆరిక 160–170 రోజుల పంట. విత్తిన తర్వాత దాదాపు 6 నెలలకు పంట చేతికి వస్తుంది. ఆరికలు విత్తుకోవడానికి ఆరుద్ర కార్తె  (జూన్‌ 22 నుంచి జూలై 6 వరకు) అత్యంత అనువైన కాలం. మొలిచిన తర్వాత 40–50 రోజులు వర్షం లేకపోయినా ఆరిక పంట నిలుస్తుంది. ఇతర పంటలు అంతగా నిలవ్వు. చిరుధాన్యాల్లో చిన్న గింజ పంటలు (స్మాల్‌ మిల్లెట్స్‌).. ఆరిక, కొర్ర, సామ, ఊద, అండుకొర్ర. ఆరిక మినహా మిగతా నాలుగు పంటలూ 90–100 రోజుల్లో పూర్తయ్యేవే. చిరుధాన్యాల సేంద్రియ సాగులో అనుభవజ్ఞుడు, వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త కె.విజయకుమార్‌ ‘సాక్షి సాగుబడి’కి వివరించారు.

సేంద్రియ పద్ధతుల్లో ఆరికల సాగులో మెలకువలను ఆయన మాటల్లోనే ఇక్కడ పొందుపరుస్తున్నాం.. ఆరిక గింజలు ఒక్క వర్షం పడి తేమ తగలగానే మొలుస్తాయి. ఒక్కసారి మొలిస్తే చాలు. గొర్రెలు తిన్నా మళ్లీ పెరుగుతుంది ఆరికె మొక్క. మొలిచిన తర్వాత దీర్ఘకాలం వర్షం లేకపోయినా తట్టుకొని బతకటం ఆరిక ప్రత్యేకత. మళ్లీ చినుకులు పడగానే తిప్పుకుంటుంది. అందువల్ల సాధారణ వర్షపాతం కురిసే ప్రాంతాలతో పాటు అత్యల్ప వర్షపాతం కురిసే ప్రాంతాలకూ ఇది అత్యంత అనువైన పంట. నల్ల కంకి సమస్యే ఉండదు. 

దిబ్బ ఎరువు/గొర్రెల మంద
ఆరిక పంటకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు అవసరం లేదు. పొలాన్ని దుక్కి చేసుకొని మాగిన పశువుల దిబ్బ ఎరువు ఎకరానికి 4–5 ట్రాక్టర్లు(12 టన్నులు) వెదజల్లాలి. లేదా గొర్రెలు, మేకలతో మందగట్టడం మంచిది. గొర్రెలు, మేకలు మూత్రం పోసిన చోట ఆరిక అద్భుతంగా దుబ్బు కడుతుంది. శ్రీవరి సాగులో మాదిరిగా 30–40 పిలకలు వస్తాయి. పొలాన్ని దుక్కి చేసి పెట్టుకొని.. మంచి వర్షం పడిన తర్వాత ఆరికెలను విత్తుకోవాలి. వెదజల్లటం కన్నా గొర్రుతో సాళ్లుగా విత్తుకోవడం మంచిది. గొర్రుతో విత్తితే విత్తనం సమాన లోతులో పడుతుంది. ఒకరోజు అటూ ఇటుగా మొలుస్తాయి.

ఒకేసారి పంటంతా కోతకు వస్తుంది. 8 సాళ్లు ఆరికలు విత్తుకొని, 1 సాలు కందులు, మళ్లీ 8 సాళ్లు ఆరికలు, ఒక సాలు ఆముదాలు విత్తుకోవాలి. ఎకరానికి 3 కిలోల ఆరిక విత్తనం కావాలి. కంది విత్తనాలు ఎకరానికి ఒకటిన్నర కిలోలు కావాలి. కిలోన్నర కందుల్లో వంద గ్రాములు సీతమ్మ జొన్నలు, 50 గ్రాములు తెల్ల / చేను గోగులు కలిపి విత్తుకోవాలి. ఎకరానికి 3 కిలోల ఆముదం విత్తనాలు కావాలి. ఎకరానికి పావు కిలో నాటు అలసందలు /బొబ్బర్లు, అర కిలో అనుములు, వంద గ్రాముల చేను చిక్కుళ్లు ఆముదాలలో కలిపి చల్లుకోవాలి. 

ఆరికలు విత్తుకునేటప్పుడు కిలో విత్తనానికి 4 కిలోల గండ్ర ఇసుక కలిపి విత్తుకోవాలి. ఆరికల విత్తనాలు ఎంత సైజులో ఉంటాయో అదే సైజులో ఉండే ఇసుక కలిపి గొర్రుతో విత్తుకోవాలి. కందులు, ఆముదం తదితర విత్తనాలను అక్కిలి / అక్కిడి కట్టెలతో విత్తుకోవాలి. ఆరికలను మిశ్రమ సాగు చేసినప్పుడు పెద్దగా చీడపీడలేమీ రావు. వ్యయ ప్రయాసలకోర్చి కషాయాలు పిచికారీలు చేయాల్సిన అవసరం లేదు.ఐదారు రకాల పంటలు కలిపి సాగు చేయడం వల్ల చీడపీడలు నియంత్రణలో ఉంటాయి. రైతు కుటుంబానికి కవాల్సిన అన్ని రకాల పంటలూ చేతికి వస్తాయి. ఆహార భద్రత కలుగుతుంది. కంది, సీతమ్మ జొన్న తదితర పంట మొక్కల పిలకలు తుంచేకొద్దీ మళ్లీ చిగుర్లు వేస్తూ పెరుగుతాయి. పక్షి స్థావరాలుగా కూడా ఇవి ఉపయోగపడతాయి. 


చేను చిక్కుళ్లు వర్షానికే పెరుగుతాయి. అనుములు, అలసందలు 35–40 రోజుల నుంచే కాయలు కోతకు వస్తాయి. రైతు కుటుంబానికి ఆహార భద్రత కలుగుతుంది. ఆర్నెల్లకు మంచి ఆదాయం కూడా వస్తుంది. వీటిని ఒకసారి విత్తితే చాలు. తర్వాత పెద్దగా చేయాల్సిన పనులేమీ ఉండవు. 
ఆరుద్ర కార్తెలో విత్తుకుంటే డిసెంబర్‌ చివర్లోనో, జనవరి మొదట్లోనో కోత కోసుకోవచ్చు. కోతల తర్వాత ఆరిక దుబ్బు మళ్లీ చిగురిస్తుంది. అది పశువులకు మంచి బలమైన మేత. ఆరిక గడ్డి వరి గడ్డి కన్నా గట్టిది. త్వరగా కుళ్లిపోదు. అందువల్ల ఎయిర్‌ కూలర్లలో వాడుతుంటారు. 

ఎకరాకు రూ. 60 వేల నికరాదాయం
వర్షాధారంగా మెట్ట భూముల్లో ఆరికలు సాగు చేస్తే ఎకరానికి ఎంత లేదన్నా 6–8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కందులు 3 క్వింటాళ్లు వస్తాయి. ఆముదాలు 5 క్వింటాళ్లు వస్తాయి. అలసందలు, అనుములు, జొన్నలు ఇంకా అదనం. ఆరికలు ప్రధాన పంటగా ఈ పద్ధతిలో సాగు చేస్తే ఎకరానికి రూ. 40 వేల నుంచి 60 వేల వరకు రైతుకు నికరాదాయం వస్తుంది. నీటి వసతి ఉండే రైతులు నాలుగు తడులు ఇస్తే దిగుబడి ఇంకా పెరుగుతుంది. ఆరు నెలల పంటైనందున ఆరికలను ఆరుద్ర కార్తెలోనే విత్తుకోవడం అనాదిగా రైతులు అనుసరిస్తున్న పద్ధతి. ఆరికలతోపాటు ఇతర సిరిధాన్యాలను కూడా ఈ కాలంలో విత్తుకోవచ్చు. 


పూర్తిగా ఎండిన తర్వాతే కోయాలి
పక్వానికి రాక ముందే కోయకుండా జాగ్రత్తవహించిన రైతులకు నాణ్యమైన ఆరిక ధాన్యం దిగుబడి వస్తుంది. విత్తిన తర్వాత ఆరికలను 160–170 రోజులు పొలంలో ఉంచాల్సిందే. పూర్తిగా పంట ఎండి గింజ, కర్ర నలుపు రంగులోకి రావాలి. అటూ ఇటూ కాకుండా ఊదా రంగులో ఉన్నప్పుడు కొయ్యకూడదు. తొందరపడి ముందే కోస్తే తాలు గింజ ఎక్కువగా వస్తుంది. 8 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 5 క్వాంటాళ్లే వస్తుంది. పైగా అవి విత్తనంగా పనికి రావు. బియ్యం దిగుబడి కూడా తగ్గిపోతుంది. అందువల్ల వ్యాపారులు రైతులకు మంచి ధర ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. పక్వానికి వచ్చే వరకు ఆగి కోసి, కుప్పపై కొద్ది రోజులు ఉంచి నూర్పిడి చేయాలి. అప్పుడు మంచి తూకం వస్తుంది. అన్నం కూడా మంచి రుచి వస్తుంది. 

♦ కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, బరిగెలు, గోల్డు బరిగలను సాగు చేయవచ్చు. వీటి పంటకాలం 10–80 రోజులు. ఎకరానికి 8–9 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి నేలల్లోనైనా పండుతాయి. ఎకరాకు 3 కిలోల విత్తనం చాలు. 

♦ కొర్రలో జడ కొర్ర, ముద్ద కొర్ర రకాలుంటాయి. ముద్ద కొర్ర కంకిపై నూగు పీచు అధికంగా ఉంటుంది. కాబట్టి పిచుకలు తినడానికి అవకాశం ఉండదు. 85–95 రోజుల్లో కోతకు వస్తాయి. నల్లరేగడి, తువ్వ, ఎర్రచెక్క, ఇసుక నేలల్లో ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. చౌడు గరప నేలల్లో దిగుబడి తక్కువగా వస్తుంది. ఎకరానికి 3 కిలోల విత్తనం చాలు.

♦ ఊదలు ఎటువంటి నేలల్లోనైనా సాగు చేయవచ్చు. ఒకమాదిరి జిగట, ఉప్పు నేలల్లోనూ, నీరు నిలువ ఉన్న నేలల్లోనూ సాగు చేయవచ్చు. భూమిని తేలికపాటుగా మెత్తగా దున్ని పశువుల ఎరువు ఎకరానికి 5 టన్నులు వేసి కలియదున్నాలి. అది లేకపోతే గొర్రెలు, ఆవుల మందను పొలంలో మళ్లించాలి. కలుపు లేకుండా చూసుకోవాలి.

♦ రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేదు. భూమి సారవంతంగా ఉంటే 8–10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వంద నుంచి 110 రోజుల పంటకాలం. 5 సార్లు నీరు పారించాల్సి ఉంటుంది. వర్షాకాలంలో నీరు కట్టాల్సిన అవసరం లేదు. 

♦ అండుకొర్రను ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. ఎటువంటి నేలల్లోనైనా పండుతుంది. నీరు నిల్వ ఉండే భూములు పనికిరావు. దీన్ని పల్చగా విత్తుకోవాలి. ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. పలచగా ఉంటే ఎక్కువ పిలకలు వస్తాయి. రసాయనిక ఎరువులు వాడకూడదు. యూరియా వేస్తే బాగా పెరిగి పడిపోతుంది. 90–105 రోజుల్లో పంట వస్తుంది.

♦ పంట పక్వానికి రాక ముందే కోస్తే గింజలు నాసిరకంగా ఉంటాయి. బియ్యం సరిగ్గా ఉండవు. పిండి అవుతాయి. సిరిధాన్యాలు ఏవైనా సరే గింజ ముదరాలి. కర్రలు బాగా పండాలి. అప్పుడు కోస్తేనే మంచి నాణ్యత వస్తుంది, మంచి ధర పలుకుతుంది. సిరిధాన్యాలు సాగు చేసిన భూమి ఏగిలి మారి సారవంతమవుతుంది. 
 
♦ విత్తనాలు వేసుకునే ముందు విధిగా మొలక పరీక్ష చేసుకోవాలి. కొబ్బరి చిప్పలోనో, ప్లాస్టిక్‌ గ్లాసులోనో అడుగున చిన్న చిల్లి పెట్టి, మట్టి నింపాలి. తగుమాత్రంగా నీరు పోసి 2 గంటల తర్వాత 10–20 విత్తనాలు వేసి తేలికగా మట్టి కప్పేయాలి. రకాన్ని బట్టి 3–7 రోజుల మధ్య మొలక వస్తుంది. మొలక తక్కువగా ఉంటే ఆ ధాన్యం విత్తనానికి పనికిరాదని గుర్తించాలి.  

♦ సిరిధాన్యాల సాగుపై సలహాల కోసం విజయకుమార్‌ (98496 48498) ను ఆంధ్రప్రదేశ్‌ రైతులు ఉ. 6–9 గం. మధ్యలో, తెలంగాణ రైతులు సా. 6–9 గం. మధ్య సంప్రదించవచ్చు. 
– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌


వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త కె.విజయకుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement