చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలంటే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మేలైన విత్తనాలు, సాగు మెలకువలు చెప్పే వ్యవస్థ అందుబాటులోకి రావాలి. అంతేకాదు, పండించిన తర్వాత చిరుధాన్యాలను శుద్ధి చేసుకునే యంత్రపరికరాలు పంట భూములకు వీలైనంత దగ్గరలో అందుబాటులో ఉండాలి. గిట్టుబాటు ధరకు అమ్ముకునే మార్గం ఉండాలి. అప్పుడే, చిన్న, సన్నకారు రైతులు ఇతర పంటల నుంచి చిరుధాన్యాల సాగు వైపు మళ్లడానికి ఆసక్తి చూపగలుగుతారు. ఈ సేవలన్నీ అందించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో చిరుధాన్యాలను శుద్ధి చేసే యంత్రాలను అద్దె పద్ధతిలో వినియోగించుకునే కేంద్రాలు (కస్టమ్ హైరింగ్ సెంటర్స్) ఉండాలి. ఇటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయటం ద్వారా వందలాది మంది రైతులను చిరుధాన్యాల సాగుకు ప్రోత్సహిస్తూ పలు అవార్డులు అందుకున్న తెలుగు రైతు, వ్యాపారవేత్త వీర్‌షెట్టి బిరాదార్ ప్రశంసనీయులు.
భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) డా. విలాస్ ఎ. తొనపి ప్రోత్సాహంతో ఫార్మర్స్ ఫస్ట్ ప్రోగ్రామ్ ద్వారా వీర్‌షెట్టి సేవలందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని గంగాపూర్ గ్రామంలో వీర్‌షెట్టి బిరాదార్(47) పుట్టారు. డిగ్రీ చదివారు. ఉమ్మడి కుటుంబానికి 70 ఎకరాల సాగు భూమి ఉంది. అందులో 30 ఎకరాల్లో చిరుధాన్యాలను సాగు చే స్తున్నారు. తమ గ్రామ శివారులోనే మిల్లెట్స్ ప్రాసెసింగ్ కస్టమ్ హైరింగ్ కేంద్రాన్ని నెలకొల్పి ఆ ప్రాంత రైతులను చిరుధాన్యాల సాగుకు ప్రోత్సహిస్తున్నారు.
ఉచితంగా విత్తనాలు, సాగు సలహాలు
ఝరాసంగం మండలంతో పాటు పరిసర మండలాలు న్యాల్‌కల్, రాయికోడ్ మండలాల పరిధిలోని 8 గ్రామాల్లో వందలాది రైతులను చిరుధాన్యాల సాగుకు ప్రోత్సహిస్తున్నామని వీర్‌షెట్టి తెలిపారు. ఫార్మర్ ఫస్ట్ ప్రాజెక్టు(రాజేంద్రనగర్)కు సమన్వయకర్తగా వ్యవహరిస్తూ.. రైతులకు నాణ్యమైన చిరుధాన్యాల విత్తనాలు ఉచితంగా అంది అధిక ఆదాయం వచ్చే దిశగా రైతులకు సూచనలు, సలహాలను అందిస్తూ శాస్త్రీయ సాగు పద్ధతులను వివరిస్తున్నారు. వారు పండించిన చిరుధాన్యాలను కస్టమ్ హైరింగ్ సెంటర్‌లో ప్రాధమిక స్థాయిలో శుద్ధి చేసి, గిట్టుబాటు ధరకు తనే కొనుగోలు చేస్తున్నారు.
400 టన్నుల చిరుధాన్యాల కొనుగోలు
గ్రామాల్లో రైతులకు ఎలాంటి ఆదాయం లేకుండా ఆహార పదార్థాలను పంyì ంచేందుకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయటం. అధిక ఆదాయం వచ్చే విధంగా శాస్త్రీయ పద్ధతులు, సూచనలు, సలహాలు అందించటం. పండించిన పంటలను ఎలాంటి ఖర్చులు (రవాణా, కొనుగోలు ఏజెంట్లు, ఆలస్యం) లేకుండా నేరుగా కొనుగోలు చేయటంతో పాటు గ్రేడింగ్ చేయటం. వినియోగదారులకు మేలు రకం ఆహార పదార్థాలు అందించటమే ముఖ్య ఉద్దేశమని వీర్‌శెట్టి తెలిపారు. గత సంవత్సరం వివిధ గ్రామాల్లో పండించిన రైతుల నుంచి 400 టన్నుల చిరుధాన్యాలను కొనుగోలు చేశామని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. రైతులకు వ్యవసాయేతర ఆదాయం పెంపొందించేందుకు 2 వేల కోళ్ళు, 40 గొర్రెలు / మేకలను కూడా అందించానన్నారు.
చిరుధాన్యాలతో నాణ్యమైన ఆహారోత్పత్తులను తయారు చేయించడంతోపాటు ఢిల్లీ, హైద్రాబాద్‌లలో సొంతంగా దుకాణాలను ఏర్పాటు చేసి విక్రయిస్తుండడం విశేషం. రైతులకు తోడ్పడటంతోపాటు ఏడాదికి రూ. 20 లక్షలకు పైగా ఆదాయం గడిస్తున్నట్లు వీర్‌షెట్టి వివరించారు. ‘నార్మ్’ 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ స్థాయిలో ఐసిఏఆర్ ఉత్తమ రైతు పురస్కారాన్ని వీర్‌షెట్టి ఇటీవల అందుకున్నారు. అదే విధంగా మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ, బెస్ట్ మిల్లెట్ మిషినరీ అవార్డు, బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు, ఎంవీఆర్ మెమోరియల్ అవార్డు, బెస్ట్ మిల్లెట్ ట్రైనర్ అవార్డులను కూడా ఆయన అందుకున్నారు.
– బొగ్గుల రాజశేఖర్, సాక్షి, ఝరాసంగం, సంగారెడ్డి జిల్లా
రైతులకు అందుబాటులో 3 యంత్రాలు
రైతులు నూర్పిడి చేసి తెచ్చిన చిరుధాన్యాల్లో ఉన్న రాళ్ళు, మట్టిగడ్డలు, గడ్డి, పుల్లలను డీస్టోనర్ కం గ్రేడింగ్ మిషన్ ద్వారా వేరు చేసి శుభ్రం చేస్తారు. ఈ మిషన్ గంటకు వెయ్యి కేజీలు శుభ్రం చేస్తుంది. ఇందుకు గాను రైతుల నుంచి కేజీకి రూ.10లను చార్జిగా తీసుకుంటున్నారు. డీ హల్లర్ మిషన్ ద్వారా కొర్రలు తదితర చిరుధాన్యాలపై పొట్టు తీస్తారు. ఇందుకు గాను కేజీకి రూ.10 ఛార్జీగా తీసుకుంటున్నారు. పల్వరైజర్ మిషన్ ద్వారా పప్పుధాన్యాలను ప్రాసెస్ చేస్తారు. పొట్టు తీసిన అనంతరం పప్పు బద్దలు చేయటం, పిండి పట్టడం, రవ్వ తయారు చేసి, గ్రేడింగ్ చేస్తారు. రైతుల నుంచి కేజీకి రూ.10 చార్జీగా తీసుకుంటున్నారు. ఈ విధంగా హైరింగ్ సెంటర్ ద్వారా ధాన్యాలను గ్రేడింగ్ చేసి, తిరిగి వాటిని రైతులకు అందించటం లేదా గిట్టుబాటు ధర కల్పించి, కొనుగోలు చేయటం జరుగుతుందని వీర్‌షెట్టి తెలిపారు.
చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకే..
చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు గ్రామాలలో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాం. ఉచితంగా నాణ్యమైన విత్తనాలు అందించటంతో పాటు అవలంబించాల్సిన మెరుగైన సాగు పద్ధతులు, సూచనలు, సలహాలను అందిస్తున్నాం. రైతులు పండించిన చిరుధాన్యాలను హైరింగ్ సెంటర్‌లో శుద్ధి చేసి, గ్రేడింగ్ చే స్తాము. అనంతరం రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నాం. వాటితో తయారు చేసిన నాణ్యమైన ఆహార పదార్థాలను ఢిల్లీ, హైదరాబాద్‌లో దుకాణాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో రైతులకూ సేవలందిస్తుండటం సంతోషాన్నిస్తోంది. – వీర్‌షెట్టి బిరాదార్ (77028 60613, 94905 23302),
ఫస్ట్ ఫార్మర్ ప్రాజెక్టు సమన్వయకర్త, గంగాపూర్, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment