సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా 2023ను జరుపుకుంటున్న తరుణంలో వాటి సాగుకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని గురించి కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించింది. శ్రీఅన్న పథకం ద్వారా హైదరాబాద్‌లో చిరుధాన్యాలపై ప్రత్యేక పరిశోధనలు జరపాలని నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) ఉన్న సంగతి తెలిసిందే. అందులోని పరిశోధనలకు పెద్దపీట వేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ సంస్థ జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలతో అనుసంధానమై పనిచేస్తుంది. వేలాదిమందికి ఇందులో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. భవిష్యత్తులో మిల్లెట్ ఆహారపదార్థాలు అందుబాటులోకి తీసుకురావడం, మిల్లెట్ సాగు చేసే రైతులను ప్రోత్సహించడం, ఉత్పాదకత పెంచడం ఈ పరిశోధనల లక్ష్యం. ఐఐఎంఆర్ పరిధిలో 41 మంది సాంకేతిక సిబ్బంది, 21 అడ్మినిస్ట్రేటివ్, 27 సహాయక సిబ్బంది, 17 విభాగాలలో 48 మంది శాస్త్రవేత్తల బృందం పనిచేస్తున్నారు.
2023 అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం ప్రాధాన్యం ఏంటి?
మిల్లెట్లు పోషక ఆహార ధాన్యాలు. భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి మిల్లెట్ల సాగు, వినియోగం కొనసాగుతోంది. మిల్లెట్లలో ప్రొటీన్, ఫైబర్, ఐరన్ అధికంగా ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధి రాకుండా, వచ్చినవారికి మంచి ఆహారంగా ఉంటుంది. మిల్లెట్ల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలతోపాటు, వాటిని పండించడానికి తక్కువ నీరు, తక్కువ పెట్టుబడి అవసరం. భారత ప్రభుత్వ విన్నపం మేరకు ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. భారతదేశం చేసిన ప్రతిపాదనను 70 దేశాలు ఆమోదించాయి. రసాయన పురుగుమందులు, ఎరువులు వాడకుండా మిల్లెట్లను సులభంగా పండించవచ్చు. చిన్న కమతాల రైతులకు మిల్లెట్ పంటలు పండించడం ఉపయోగకరం. మిల్లెట్లను రొట్టెలు, ఉప్మా, గంజిగా ఉపయోగించవచ్చు. మిల్లెట్లలో 60 రకాల వరకు ఉన్నాయి.
మన దేశంలో ప్రధానంగా జొన్న, సజ్జ, కొర్రలు, ఎండు కొర్రలు, ఊదలు, సామలు, రాగులు వంటి చిరుధాన్యాలు ఉన్నాయి. అయితే 1960లలో హరిత విప్లవం ద్వారా ఆహార భద్రతపై దృష్టి సారించడంతో చిరుధాన్యాల ఆహారాన్ని ప్రజలు మరిచిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ వీటిపై ఆసక్తి చూపుతున్నారు. హరిత విప్లవానికి ముందు మిల్లెట్ల సాగు దాదాపు 40 శాతం ఉండగా, ఆ తర్వాత 20 శాతానికి పడిపోయింది. మన దేశంలో ప్రస్తుతం 1.70 కోట్ల టన్నుల మిల్లెట్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది ఆసియాలో 80 శాతం, ప్రపంచ ఉత్పత్తిలో 20 శాతం ఉంటుంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హరియాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అధికంగా మిల్లెట్లను ఉత్పత్తి చేస్తాయి. మనదేశం నుంచి మిల్లెట్లను యూఏఈ, నేపాల్, సౌదీ అరేబియా, లిబియా, ఒమన్, ఈజిప్ట్, ట్యునీషియా, యెమెన్, యూకే, యూఎస్‌లకు ఎగుమతి అవుతాయి.
ఆగ్రోస్ మిల్లెట్ ఆహార కేంద్రాలు: కె.రాములు, ఎండీ, ఆగ్రోస్
అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆగ్రోస్ ఆధ్వర్యంలో మిల్లెట్‌ను ప్రజలకు చేరువ చేయాలని భావి స్తున్నాం. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వందలాది మిల్లెట్ కియోస్క్‌లను ఏర్పాటు చేయా లని నిర్ణయించాం. ఆసక్తి కలిగిన మహిళలకు మిల్లెట్ ఫుడ్‌పై ఐఐఎంఆర్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని కూడా మా ఆలోచన. శిక్షణ అనంతరం నిర్ణీత పద్ధతిలో తయారు చేసిన కియోస్క్‌లను ఏర్పాటు చేస్తాం. అందుకోసం ముందుకు వచ్చే వారికి రుణాలు ఇప్పించే ఆలోచన కూడా ఉంది. ఈ కియోస్క్‌ల్లో రెడీమేడ్ మిల్లెట్ ఫుడ్, మిల్లెట్‌తో తయారు చేసిన బిస్కెట్లు, ఐస్‌క్రీం, నూడిల్స్, మిల్లెట్ బిర్యానీ వంటివి కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment