న్యూయార్క్: తృణధాన్యాల ప్రాధాన్యతను చాటిచెప్పేందుకు ప్రత్యేకంగా రాసిన పాటను గ్రామీ అవార్డు విజేత, భారతీయ అమెరికన్ ఫల్గుణి షాతో కలిసి ప్రధాని మోదీ పాడారు. ఈ పాటను‘అబండేన్స్ ఇన్ మిల్లెట్స్’అనే పేరుతో ఈ నెల 16న ఫల్గుణి, ఆమె భర్త గాయకుడు గౌరవ్ షా కలిసి ప్రపంచవ్యాప్తంగా అన్ని స్ట్రీమింగ్ వేదికలపైనా ఇంగ్లిష్, హిందీ భాషల్లో విడుదల చేశారు. ముంబైలో జన్మించిన గాయని, పాటల రచయిత ఫల్గుణి షాను ఫాలు అనే పేరుతో ప్రసిద్ధురాలయ్యారు.
పిల్లల కోసం ఈమె రూపొందించిన ‘ఎ కలర్‌ఫుల్ వరల్డ్’ఆల్బమ్‌కు 2022లో ప్రసిద్ధ గ్రామీ అవార్డు దక్కింది. గ్రామీ అవార్డు గెలుచుకున్న అనంతరం గత ఏడాది ప్రధాని మోదీని ఆమె ఢిల్లీలో కలిశారు. ఆ సమయంలో ప్రపంచ ఆకలిని తీర్చే సామర్థ్యమున్న, మంచి పోషక విలువలు కలిగిన తృణధాన్యాల గొప్పదనంపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఒక పాట రాయాలని ప్రధాని మోదీ సూచించారని చెప్పారు. ఇందుకు సహకారం అందించేందుకు కూడా ప్రధాని మోదీ అంగీకరించారని వివరించారు. ఒక వైపు పాట కొనసాగుతుండగానే తృణధాన్యాల గొప్పదనంపై స్వయంగా రాసిన మాటలను ప్రధాని మోదీ వినిపిస్తారని ఫాలు పీటీఐకి తెలిపారు. భారత్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment