రాగులతో మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు రాగులు చాలామంచిది. కాల్షియం, ఐరన్ లాంటి ముఖ్యమైన పోషకాలు అందుతాయి. రాగులతో పసందైన వంటకాలను తయారు చేసుకొని ఆస్వాదించవచ్చు. అయితే రాగులను నానబెట్టి,మొలకలొచ్చాక, వేయించి పౌడర్ చేసుకొన వాడితేమరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
పిల్లలు నుంచి పెద్దల వరకు రాగులను అనేక రూపాల్లో తీసుకోవచ్చు. రాగి జావ, రాగి పిండితో దోసెలు, ఇడ్లీలు చేసుకోవచ్చు. అలాగే రాగులతో మురుకులను కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా రాగులను మొలకలు వచ్చేలా చేసి వాటిని ఎండబెట్టి, లైట్‌గా వేయించి పౌడర్ చేసుకుంటే ఇంకా మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం. రుచికీ రుచీ పెరుగుతుంది. పోషకాలూ పెరుగుతాయి. రాగుల మొలకలతో పిండిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం.
రాగుల మొలకలతో పిండి తయారీ
రాగులను రాళ్లు, ఇసుక లేకుండా శుభ్రంగా జల్లించుకోవాలి. ఆ తరువాత వీటిని శుభ్రంగా కడగాలి. ఎక్కువ సార్లు దాదాపు నాలుగు నుంచి పదిసార్లు , తెల్ల నీళ్లు వచ్చేదాకా కడుక్కోవాలి.
కడిగిన రాగులను జాలీలో వేసుకొని నీళ్లు మొత్తం వాడేలా చూసుకోవాలి. తరువాత వీటిని పల్చని కాటన్ వస్త్రంలో(కాటన్ చున్నీ, చీర అయితే బావుంటుంది)వేసి మూట కట్టి, లైట్‌గా నీళ్లు చిలకరించి ఒక జాలీ గిన్నెలో పెట్టి, జాగ్రత్తగా వంట ఇంటి కప్‌బోర్డులో(గాలి, వెలుతురు తగలకుండా) పెట్టుకోవాలి. రెండు రోజులకు రాగులు మొలకలు భలే వస్తాయి. మూటలోంచి మొలకలు తెల్లగా బయటికి వచ్చేంత పెరుగుతాయి. వీటిని జాగ్రత్తగా తీసుకొని తడి ఆరేలాగా ఎండబెట్టుకోవాలి. ఆరిన తరువాత వీటిని నూనె లేకుండా ఉత్తి మూకుడులో వేగించుకోవాలి. మాడకుండా గరిటెతో తిప్పుతూ సన్నని సెగమీద కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. అంటే కమ్మని రాగుల మొలకల పిండి రెడీ.
ఈ పిండిని జావ, దోసెలు, చపాతీలు తయారీలో వాడుకోవచ్చు. ఇంకా రాగిమొలకలతో చేసిన పిండిలో కొద్దిగా పుట్నాల పొడి, బెల్లం, నెయ్యి కలిపి సున్ని ఉండలుగా చేసి పిల్లలకు రోజుకు ఒకటి పెడితే మంచి శక్తి వస్తుంది.
రాగి ఇడ్లీ
రాగుల పిండిలో గోధు రవ్వ, పుల్లని పెరుగు, సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని కనీసం అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.
వేడి నూనెలో ఆవాలు జీలకర్ర, జీడిపప్పు, కొన్ని ఎండు మిర్చి,, కొన్ని కరివేపాకులువేసి పోపు రెడీ చేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోనే తరిగిపెట్టుకున్న క్యారట్, ఉల్లిపాయముక్కలను వేయాలి. ఇది చల్లారాక రాగుల పిండిలో కలపాలి. తరువాత బేకింగ్ సోడా(పెరుగు పుల్లగా ఉంటే ఇది కూడా అవసరంలేదు) బాగా కలపాలి. కొత్తమీర కూడా కలుపుకోవచ్చు.
రాగులతో ఉపయోగాలు
రాగులు బలవర్దకమయిన ఆహారం. ఇతర ధాన్యాల కంటే రాగుల్లో 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఎక్కువ. నానబెట్టి, మొలకెత్తడంవల్ల పోషకాలు మరింత పెరుగుతాయి కొవ్వు కంటెంట్ తగ్గుతుంది. ఈ పిండితో చేసిన ఉగ్గును శిశువులకు కూడా తినిపించవచ్చు.
బీపీ మధుమేహం, కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం లాంటి సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తాయి. చిన్నపిల్లల్లో ఎముకల వృద్ధికి, అనీమియా నివారణలో ఉపయోగపడుతుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి
Comments
Please login to add a commentAdd a comment