సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఈ ఆర్థిక ఏడాది(2023–24) 1,66,736 హెక్టార్లలో చిరుధాన్యాలు పండించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థి క ఏడాదితో పోల్చితే ఇది 39,365 హెక్టార్లు అధికం. అలాగే గత ఆర్థిక ఏడాది 3.22 లక్షల మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలు ఉత్పత్తి చేయగా.. ఈసారి 4.11 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.
ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సాగు విస్తీర్ణం, వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు ప్రజలు ఆహారంగా తీసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. జిల్లాల వారీగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం లక్ష్యాలను నిర్ధారించారు. అందుకు అనుగుణంగా రైతులు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని సీఎస్ ఆదేశించారు.
వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద..
వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలో 160 చిరుధాన్యాల ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పే వారికి తగిన విధంగా ప్రోత్సాహకాలను అందించాలన్నారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చిరుధాన్యాల స్టాల్స్ ఏర్పాటు చేసి ఆయా ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఆదేశించారు. మహిళా మార్టుల్లోనూ వీటిని విక్రయించాలని సూచించారు. చిరుధాన్యాలను ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కనీస మద్దతు ధరను కూడా ప్రభుత్వం ప్రకటించింది.
అనేక జబ్బులకు చిరుధాన్యాలతో చెక్
జొన్నలు, సజ్జలు, రాగులు తదితరాల్లో పిండి పదార్థాలు ఎక్కువ. ఇవి దైనందిన అవసరాలకు సరిపడా 70 నుంచి 80 శాతం శక్తిని అందిస్తాయి. నిత్యం వీటిని ఆహారంగా వినియోగిస్తే గుండె జబ్బులు, షుగర్, బీపీ తదితర జబ్బులు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగుల్లో ఖనిజాలు ముఖ్యంగా కాల్షియం అధికంగా ఉండటంతో.. మూత్ర రోగాలను అరికట్టడంతో పాటు దేహపుష్టిని కలుగజేస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం మనం తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలను వినియోగించాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment