ఐసిఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. సురేశ్ కుమార్ చౌదరి, ఐఐఎంఆర్ డైరెక్టర్ డా. తార సత్యవతి, న్యూట్రిహబ్ సీఈవో డా. దయాకర్‌రావు తదితరుల చేతుల మీదుగా పోషక్ అనాజ్ పురస్కారాన్ని అందుకుంటున్న సాక్షి సాగుబడి సీనియర్ న్యూస్ ఎడిటర్ పంతంగి రాంబాబు
సాక్షి సాగుబడి, హైదరాబాద్: అన్ని విధాలుగా ఆరోగ్యదాయకమైన చిరుధాన్యాల ఆహారంపై అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం-2023 సందర్భంగా మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అద్భుతమైన ప్రజా చైతన్యం వెల్లివిరుస్తోందని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసిఎఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. సురేశ్ కుమార్ చౌదరి అన్నారు. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) తోడ్పాటుతో భారత ప్రభుత్వం సకల పోషకాల గనులైన చిరుధాన్యాలను శ్రీఅన్నగా పేర్కొంటూ ఫ్యూచర్ హెల్దీ సూపర్ ఫుడ్‌గా సరికొత్త రూపాల్లో తిరిగి పరిచయం చేయటంలో సఫలీకృతమైందని ఆయన తెలిపారు.
వాతావరణ మార్పుల నేపథ్యంలో మనుషుల ఆరోగ్యానికే కాకుండా భూగోళం ఆరోగ్యానికి కూడా దోహదపడే అసలైన ఆహార ధాన్యాలు చిరుధాన్యాలేనని జీ20 తదితర అంతర్జాతీయ వేదికల్లోను, దేశీయంగాను చాటి చెప్పటంలో మన దేశం విజయవంతమైందని అంటూ, భవిష్యత్తులో చిరుధాన్యాల ప్రాధాన్యం మరింత విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ప్రధాన జీవన స్రవంతిలోకి తిరిగి చిరుధాన్యాలు- ఇప్పుడు, తర్వాత’ అనే అంశంపై నొవోటెల్ హోటల్‌లో రెండు రోజుల అంతర్జాతీయ చిరుధాన్యాల సమ్మేళనం సోమవారం ప్రారంభమైంది.
హైదరాబాద్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థలోని న్యూట్రిహబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి డా. సురేశ్ కుమార్ చౌదరి అధ్యక్షతవహించారు. దేశంలో చాలా రాష్ట్రాలు మిల్లెట్ మిషన్లను ప్రారంభించాయని, ప్రజలు నెమ్మదిగా చిరుధాన్యాల వినియోగం వైపు మళ్లుతున్నారన్నారు. అయితే, చిరుధాన్యాల రైతులకు మరింత ఆదాయాన్ని అందించే పాలకులు విధాన నిర్ణయాలు తీసుకొని ప్రోత్సాహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 2023 తర్వాత కాలంలో చిరుధాన్యాలు మన ఆహారంలో మరింతగా భాగం కావాలంటే కేవలం ప్రభుత్వ చర్యలే సరిపోవని, ప్రభుత్వేర సంస్థలు, వ్యక్తులు, ప్రైవేటు ఆహార కంపెనీలు కూడా సంపూర్ణ సహకారం అందించాలని డా. సురేశ్ కుమార్ చౌదరి విజ్ఞప్తి చేశారు.
ఐసిఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. సురేశ్ కుమార్ చౌదరి
చిరుధాన్యాల పుట్టిల్లు భారత్: ఎఫ్.ఎ.ఓ. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) భారత్ ప్రతినిధి టకయుకి హగివర ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ చిరుధాన్యాలకు భారత్ పుట్టిల్లని, చిరుధాన్యాల వాణిజ్యానికి భారత్ మూలకేంద్రంగా మారే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. క్లైమెట్ ఎమర్జెన్సీ నేపథ్యంలో ఆకలి, పౌష్టికాహార లోపం, ఆహార అభద్రతలను అధిగమించడానికి చిరుధాన్యాలు ఉపకరిస్తాయని భారత్ ప్రపంచానికి శక్తివంతంగా చాటిచెప్పిందన్నారు. ఐసిఎఆర్, ఐఐఎంఆర్ చేసిన కృషి అనితరసాధ్యమైనదన్నారు. అంతర్జాతీయ సంస్థలతో పాటు, ఆహార వాణిజ్యంలో దిగ్గజాల్లాంటి బహుళజాతి కంపెనీలు కూడా చిరుధాన్యాల వైపు దృష్టి సారిస్తున్నాయన్నారు. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి చిరుధాన్యాలతో కూడిన సుస్థిర వ్యవసాయం దోహదం చేస్తుందన్నారు.
రైతులకు దక్కుతున్నది స్వల్పమే చిరుధాన్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా 300కుపైగా అధునాతన, వినూత్న ఆహారోత్పత్తులను ఉత్పత్తి చేసే సాంకేతికతలను రూపొందించటంలో హైదరాబాద్‌లోని ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ విశిష్ట ప్రాతను పోషించిందని, ప్రపంచానికే ఇది మార్గదర్శకమని ఐసిఎఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డా. డి.కె. యాదవ్ తెలిపారు. గతంలో చిరుధాన్యాలు ఎగుమతి చేసేవారమని, ఇప్పుడు అధునాతన తినుబండారాలను ఎగుమతి చేసే దేశంగా భారత్ మారిందన్నారు. అయితే, ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను అమ్మి వ్యాపారులు సంపాదించే మొత్తంలో 15-20% మాత్రమే చిరుధాన్యాల రైతులకు దక్కుతున్నదని, కనీసం 50% దక్కేలా విధానపరమైన చర్యలు తీసుకోగలిగితే చిరుధాన్యాలు ప్రధాన ఆహార ధాన్యంగా ప్రధాన జీవన స్రవంతిలోకి వస్తుందన్నారు.
రూ. 250 కోట్లతో ఐఐఎంఆర్‌ను అంతర్జాతీయ చిరుధాన్యాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేశామని డా. యాదవ్ వివరించారు. వరి, గోధుమలకు దీటుగా రైతులకు ఆదాయాన్నందించేలా అధిక దిగుడినిచ్చే 9 రకాల చిరుధాన్యాల వంగడాలను అందుబాటులోకి తెచ్చామని, సర్టిఫైడ్ సీడ్‌కు కొరత లేదన్నారు. భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐఐఎంఆర్) డైరెక్టర్ డాక్టర్ సి. తార సత్యవతి ప్రసంగిస్తూ చిరుధాన్యాలను పెద్దలతో పాటు పిల్లలు, యువత కూడా ఇష్టంగా తినేలా వినూత్న ఉత్పత్తులను న్యూట్రిహబ్ ద్వారా అందుబాటులోకి తెచ్చామన్నారు. గుంటూరు, బాపట్ల ప్రాంతాల్లో ప్రయోగాత్మక సాగులో మేలైన జొన్న వంగడాల ద్వారా హెక్టారుకు 7-8 టన్నుల జొన్నల దిగుబడి సాధించినట్లు తెలిపారు.
గుజరాత్‌లో బంగాళదుంపలు సాగు చేసిన తర్వాత ఆ పొలాల్లో హెక్టారుకు 7-8 టన్నుల సజ్జ దిగుబడి వచ్చిందన్నారు. దశాబ్దాల నిర్లక్ష్యం తర్వాత చిరుధాన్యాలకు పునర్‌వైభవం రానుందన్నారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ సీఈఓ డా. బి. దాయకర్‌రావు ప్రసంగిస్తూ గతంలో చిరుధాన్యాలు కొనే వారే ఉండేవారు కాదని, ఇప్పుడు కొందామంటే 40% మేరకు కొరత ఏర్పడిందన్నారు. న్యూట్రిహబ్ ద్వారా వినూత్న ఉత్పత్తులు తయారీలో స్టార్టప్‌లకు, ఆహార కంపెనీలకు ప్రపంచంలోనే ఎక్కడా లేని అధునాతన సాంకేతికతను అందిస్తున్నందున ఎగుమతులు పెరిగాయని, ప్రపంచ దేశాలు ఇప్పుడు మన వైపే చూస్తున్నాయన్నారు.
చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచి, రైతులకు మున్ముందు మంచి ఆదాయం వచ్చేలా స్టార్టప్‌లు, కంపెనీలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ఈ సమ్మేళనంలో రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. చిరుధాన్యాల సాగు, వినియోగం పెంపుదలకు విశిష్ట కృషి చేస్తున్న పలువురు శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు, పాత్రికేయులకు ఈ సందర్భంగా ‘పోషక్ అనాజ్’ జీవన సాఫల్య పురస్కారాలను అందించారు. పురస్కారాలు అందుకున్న వారిలో డాక్టర్ పివి వరప్రసాద్, డా. జీవీ రామాంజనేయులు, డా. హేమలత, డా. మీరా తదితరులతో పాటు ‘సాక్షి సాగుబడి’ సీనియర్ న్యూస్‌ఎడిటర్ పంతంగి రాంబాబు ఉన్నారు. మంగళవారం కూడా ఈ సమ్మేళనం కొనసాగుతుంది. ఈ సందర్భంగా నోవోటెల్‌లో ఏర్పాటైన స్టాళ్లలో సుమారు 200 స్టార్టప్‌లు చిరుధాన్యాల ఆహారోత్పత్తులు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.
(చదవండి: వరి ఆకారపు మిల్లెట్లు! మిల్లెట్లు తినేవారిగా మార్చేలా)
Comments
Please login to add a commentAdd a comment