ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 2023ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ప్రపంచంలోనే చిరుధాన్యాల ఉత్పత్తిలో అగ్రగామి భారతదేశం. ఈ పంటల జీవవైవిధ్యంలోనూ మనదే అగ్రస్థానం. కాబట్టి, 2022–23 కేంద్ర బడ్జెట్‌లో చిరుధాన్య పంటలకు అదనపు విలువ జోడిస్తున్నట్లు ప్రకటించారు. చిరుధాన్యాల్లో మూడు కీలక పంటలు (జొన్నలు, సజ్జలు, రాగులు); ఆరు మైనర్ పంటలు (ఊదలు, వరిగలు, కొర్రలు, అరికెలు, అండు కొర్రలు, చిన్న అండు కొర్రలు) ఉంటాయి. గోధుమ, వరిలో కంటే పోషకపదార్థాలు, మినరల్స్, విటమిన్స్ ్స మూడు నుంచి 5 రెట్లు ఎక్కువగా ఈ చిరుధాన్యాల్లో ఉంటాయి. దేశవ్యాప్తంగా కోటి 14 లక్షల హెక్టార్లలో చిరుధాన్యాలను పండిస్తున్నారని అంచనా. అంటే సంవత్సరానికి దాదాపు కోటి 60 లక్షల టన్నుల పంట పండుతోంది.
ఆసియా చిరుధాన్యాల ఉత్పత్తిలో 80 శాతం, ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో 20 శాతాన్ని భారతదేశంలోనే పండిస్తున్నారు. భారతీయ చిరుధాన్య ఎగుమతులు 2020 సంవత్సరంలో 2 కోట్ల 60 లక్షల డాలర్లకు చేరుకున్నాయి. నాణ్యమైన చిరుధాన్యాల విత్తనాల ఉత్పత్తి, పంపిణీ, క్షేత్ర స్థాయి ప్రదర్శనలు, శిక్షణలు, ప్రాథమిక ప్రాసెసింగ్ క్లస్టర్లు, పరిశోధనా మద్దతుతో రైతులకు ప్రోత్సాహకాలు అందించడానికి... భారత ప్రభుత్వం, జాతీయ ఆహార భద్రతా లక్ష్యసాధనా నిర్వాహక మార్గదర్శకాల్లో మార్పులు తీసుకొచ్చింది. వచ్చే పాతిక సంవత్సరాలో అవసరమైన ఆహార భద్రత కోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే చిరుధాన్య దిగుబడి ప్రణాళికలను కార్యాచరణలో పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment