ప్రాంతాన్నిబట్టి ప్లాన్‌ | Experts say diabetic patients should have a customized diet plan | Sakshi
Sakshi News home page

ప్రాంతాన్నిబట్టి ప్లాన్‌

Published Fri, Mar 31 2023 4:42 AM | Last Updated on Fri, Mar 31 2023 4:42 AM

Experts say diabetic patients should have a customized diet plan - Sakshi

‘అన్నం మానండి, సాయంత్రం చపాతీ తినండి,ఉదయం మిల్లెట్స్‌ బెటర్‌..’ మధుమేహంతో బాధపడే వారికి ఇలాంటి సూచనలు,సలహాలు సాధారణమే. అయితే వేర్వేరు ఆహారపు అలవాట్లు ఉన్న రోగులందరికీ ఒకే రకమైన డైట్‌ చార్ట్‌ సరైనదేనా?అంటే కానేకాదు అంటున్నారు వైద్య నిపుణులు. ప్రాంతాల వారీగా, జీవనశైలులకు అనుగుణంగా కస్టమైజ్డ్‌ (కావలసిన విధంగా) డైట్‌ చార్ట్‌ రూపొందించాల్సిందే అంటున్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా విస్తృత అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. ఇందులో వేలాదిగా వైద్యులు, రోగులు భాగంపంచుకోనున్నారు.  

సాక్షి, హైదరాబాద్‌: ‘మన దేశపు ఆహారపు అలవాట్లలో ఉన్న విస్తృతమైన వ్యత్యాసాల కారణంగా, మధుమేహాన్ని నియంత్రించడానికి అందరికీ ఒకే రకంగా సరిపో యే డైట్‌ చార్ట్‌ లేదని తాజాగా పరిశోధకులు తేల్చారు. దీని ఫలితంగానే ట్రాన్స్‌కల్చరల్‌ డయాబెటిస్‌ న్యూట్రిషన్‌ అల్గోరిథం (టీడీఎన్‌ఏ) పుట్టింది..’అని చక్కెర వ్యాధి నిపుణులు డాక్టర్‌ ఒసామా హమ్డీ, పోషకాహార నిపుణులు డాక్టర్‌ ఇర్ఫాన్‌ షేక్‌ చెప్పారు. ఈ టీడీఎన్‌ఎపై అవగాహన కార్యక్రమాలకు రాష్ట్రంలో శ్రీకారం చుట్టిన సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీఎన్‌ఏ అనేది టైప్‌ 2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్‌లకు గొప్ప ఉపశమనంగా మారుతుందని వీరు పేర్కొన్నారు.
 
ప్రాంతాల వారీగా.. 
వివిధ ప్రాంతాల ప్రజల విభిన్న ఆహారపు అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాలను అధ్యయనం చేసి ఆయా ప్రాంతాల్లోని రోగుల్లో మధుమేహ నియంత్రణకు అవసరమైన ఆహారపు అలవాట్లను (ఆహార ప్రణాళిక) సూచించేదే టీడీఎన్‌ఏ. ఈ ఆల్గోరిథమ్‌ను రూపొందించడానికి, భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ, పశ్చిమ, మధ్య, తూర్పు, ఈశాన్య జోన్లుగా విభజించారు. ఆయా ప్రాంతాల ఆహారపు అలవాట్లు పరిగణనలోకి తీసుకుని మధుమేహానికి పరిష్కారాలు అన్వేషించాలనేది ఈ విభజన ఉద్దేశం. ఉదాహరణకు.. కేరళలోని తక్కువ ఆదాయ వర్గాల్లో ఎక్కువగా కనిపించే మధుమేహానికి కారణం.. వీరు ఎక్కువ కార్బోహైడ్రేట్, తక్కువ ప్రోటీన్‌ తీసుకోవడమట.

ఆ ప్రాంతంలో కాసావా (కర్ర పెండలం) ఎక్కువగా తీసుకుంటారు. ఈ కాసావా ప్రోటీన్‌ ద్వారా కాలేయంలో శరీరానికి తగ్గట్టుగా ఫిల్టర్‌ కావాలి. అయితే శరీరంలో ఉన్న తక్కువ స్థాయి ప్రోటీన్ల కారణంగా ఇది జరగడం లేదు. ఇది ప్యాంక్రియాస్‌ (క్లోమ గ్రంథి)లో కాల్షియం ఏర్పడటానికి, అంతిమంగా మధుమేహానికి దారి తీస్తోందని తేల్చారు. ఇలాంటి పలు అధ్యయన ఫలితాల నేపథ్యంలో ప్రాంతాల వారీ డైట్‌ చార్ట్‌ (టీడీఎన్‌ఏ) తయారీ ఆవశ్యకత ఏర్పడింది.  

అందరూ చేయాల్సిందిదే.. 
చక్కెర వ్యాధి పెరగడానికి ప్రధాన కారణాల్లో.. ప్రోటీన్లతో పోలిస్తే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఫాస్ట్‌ ఫుడ్‌ అధిక వినియోగం వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధుమేహులు టీడీఎన్‌ఏ పాటించడంతో పాటు ఆహారాన్ని నిదానంగా తీసుకోవడం, అర్ధరాత్రి అత్యధిక కేలరీలతో కూడిన ఆహార వినియోగాన్ని తగ్గించడం, ఎక్కువగా ప్రాసెస్‌ చేసిన కార్బోహైడ్రేట్‌లను మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లాంటివి తప్పకుండా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.  

మధుమేహం విస్తృతి తెలంగాణలో ఎక్కువ 
ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) నివేదిక ప్రకారం, గత మూడు దశాబ్దాలుగా దేశంలో మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య 150% పెరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల విస్తృతి 16.6% కాగా, ముంబై (7.5%), చెన్నై (13.5%), బెంగళూరులో 11.7% మేర పెరుగుదల ఉంది.

డయాబెటిస్‌ నియంత్రణలో లేకపోతే పెరిగిన గ్లూకోజ్‌ స్థాయిలు గుండె జబ్బులు, దృష్టి లోపం, మూత్రపిండాల రుగ్మతలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. మధుమేహం నియంత్రణలో జీవనశైలిలో మార్పులదే కీలక పాత్ర. అలాగే ప్రత్యేకమైన పోషకాహార సప్లిమెంట్స్‌ కూడా చాలా అవసరం.  
– డాక్టర్‌ ఇర్ఫాన్‌ షేక్, మెడికల్‌ అఫైర్స్‌ హెడ్, అబాట్‌ న్యూట్రిషన్‌ 

మన దగ్గర రైస్‌ వినియోగమే సమస్య 
డయాబెటిస్‌ నియంత్రణలో డైట్‌ అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంత మాత్రాన అందరికీ చపాతి/పుల్కా తినేయమని చెప్పేయడం కుదరదు. తరతరాలుగా, ప్రాంతాల వారీగా అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు మన దగ్గర రైస్‌ బాగా తీసుకుంటారు. సాధారణ అన్నం లాగే కాకుండా బిర్యానీ, పులిహోర తదితరాల రూపంలో కూడా రైస్‌ వినియోగం ఎక్కువగా ఉంటోంది. తద్వారా కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువ అవుతున్నాయి. దీనిని తగ్గించడం/నియంత్రించడానికే డైట్‌ ప్లాన్‌ను ఇస్తుంటాం.

ఉదాహరణకు అన్నం మానలేమనేవారికి పరిమాణం తగ్గించమని, రాత్రి పడుకునే ముందు తినే అలవాటున్నవారికి 7 గంటల కల్లా ముగించమని చెబుతుంటా. ఉదయం పూటి ఎక్కువమంది ఇడ్లీ తీసుకుంటారు. కానీ మేం ఇడ్లీ, దోశ బదులు పెసరట్టు తినమంటాం. కాదు కూడదనే ఇడ్లీ ప్రియులకు.. ఇడ్లీ పిండిలో చిక్కుళ్లు, పెసలు, కేరట్‌ తురుము, రాజ్‌ మా గింజలు... వంటివి కలుపుకో మంటాం. తద్వారా కార్బ్స్‌ శాతాన్ని తగ్గించడం, ప్రోటీన్, ఫైబర్‌ని పెంచడానికి ప్రయతి్నస్తాం.   – డా.పద్మనాభ వర్మ, కన్సల్టెంట్‌ ఎండోక్రైనాలజిస్ట్, ఎస్‌ఎల్జీ హాస్పిటల్స్, హైదరాబాద్‌ 

నియంత్రణే ముఖ్యం.. 
మధుమేహులు దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్న ఆహారపు అలవాట్లను మానుకుని ఆరోగ్యకరమైన ఆహారం వైపు మళ్లక తప్పదు. అయితే దీనికి కట్టుబడి ఉండే రేటు 38% కంటే తక్కువ. ఈ నేపథ్యంలో రోగుల జీవనశైలి, ఆహారపు అలవాట్ల చరిత్రకు అనుగుణంగా రూపొందించే ప్రత్యేకమైన ఆహార జాబితాయే టీడీఎన్‌ఏ. బరువు తగ్గడం, గ్లైసెమిక్‌ నియంత్రణ, నిర్వహణలో ఇది రోగికి తోడ్పడుతుంది  – డాక్టర్‌ ఒసామా హమ్డీ, మెడికల్‌ డైరెక్టర్‌ జోస్లిన్‌ డయాబెటిస్‌ సెంటర్‌  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement