medical advice
-
ప్రాంతాన్నిబట్టి ప్లాన్
‘అన్నం మానండి, సాయంత్రం చపాతీ తినండి,ఉదయం మిల్లెట్స్ బెటర్..’ మధుమేహంతో బాధపడే వారికి ఇలాంటి సూచనలు,సలహాలు సాధారణమే. అయితే వేర్వేరు ఆహారపు అలవాట్లు ఉన్న రోగులందరికీ ఒకే రకమైన డైట్ చార్ట్ సరైనదేనా?అంటే కానేకాదు అంటున్నారు వైద్య నిపుణులు. ప్రాంతాల వారీగా, జీవనశైలులకు అనుగుణంగా కస్టమైజ్డ్ (కావలసిన విధంగా) డైట్ చార్ట్ రూపొందించాల్సిందే అంటున్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా విస్తృత అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. ఇందులో వేలాదిగా వైద్యులు, రోగులు భాగంపంచుకోనున్నారు. సాక్షి, హైదరాబాద్: ‘మన దేశపు ఆహారపు అలవాట్లలో ఉన్న విస్తృతమైన వ్యత్యాసాల కారణంగా, మధుమేహాన్ని నియంత్రించడానికి అందరికీ ఒకే రకంగా సరిపో యే డైట్ చార్ట్ లేదని తాజాగా పరిశోధకులు తేల్చారు. దీని ఫలితంగానే ట్రాన్స్కల్చరల్ డయాబెటిస్ న్యూట్రిషన్ అల్గోరిథం (టీడీఎన్ఏ) పుట్టింది..’అని చక్కెర వ్యాధి నిపుణులు డాక్టర్ ఒసామా హమ్డీ, పోషకాహార నిపుణులు డాక్టర్ ఇర్ఫాన్ షేక్ చెప్పారు. ఈ టీడీఎన్ఎపై అవగాహన కార్యక్రమాలకు రాష్ట్రంలో శ్రీకారం చుట్టిన సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీఎన్ఏ అనేది టైప్ 2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్లకు గొప్ప ఉపశమనంగా మారుతుందని వీరు పేర్కొన్నారు. ప్రాంతాల వారీగా.. వివిధ ప్రాంతాల ప్రజల విభిన్న ఆహారపు అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాలను అధ్యయనం చేసి ఆయా ప్రాంతాల్లోని రోగుల్లో మధుమేహ నియంత్రణకు అవసరమైన ఆహారపు అలవాట్లను (ఆహార ప్రణాళిక) సూచించేదే టీడీఎన్ఏ. ఈ ఆల్గోరిథమ్‌ను రూపొందించడానికి, భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ, పశ్చిమ, మధ్య, తూర్పు, ఈశాన్య జోన్లుగా విభజించారు. ఆయా ప్రాంతాల ఆహారపు అలవాట్లు పరిగణనలోకి తీసుకుని మధుమేహానికి పరిష్కారాలు అన్వేషించాలనేది ఈ విభజన ఉద్దేశం. ఉదాహరణకు.. కేరళలోని తక్కువ ఆదాయ వర్గాల్లో ఎక్కువగా కనిపించే మధుమేహానికి కారణం.. వీరు ఎక్కువ కార్బోహైడ్రేట్, తక్కువ ప్రోటీన్ తీసుకోవడమట. ఆ ప్రాంతంలో కాసావా (కర్ర పెండలం) ఎక్కువగా తీసుకుంటారు. ఈ కాసావా ప్రోటీన్ ద్వారా కాలేయంలో శరీరానికి తగ్గట్టుగా ఫిల్టర్ కావాలి. అయితే శరీరంలో ఉన్న తక్కువ స్థాయి ప్రోటీన్ల కారణంగా ఇది జరగడం లేదు. ఇది ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంథి)లో కాల్షియం ఏర్పడటానికి, అంతిమంగా మధుమేహానికి దారి తీస్తోందని తేల్చారు. ఇలాంటి పలు అధ్యయన ఫలితాల నేపథ్యంలో ప్రాంతాల వారీ డైట్ చార్ట్ (టీడీఎన్ఏ) తయారీ ఆవశ్యకత ఏర్పడింది. అందరూ చేయాల్సిందిదే.. చక్కెర వ్యాధి పెరగడానికి ప్రధాన కారణాల్లో.. ప్రోటీన్లతో పోలిస్తే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్ అధిక వినియోగం వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధుమేహులు టీడీఎన్ఏ పాటించడంతో పాటు ఆహారాన్ని నిదానంగా తీసుకోవడం, అర్ధరాత్రి అత్యధిక కేలరీలతో కూడిన ఆహార వినియోగాన్ని తగ్గించడం, ఎక్కువగా ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లను మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లాంటివి తప్పకుండా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహం విస్తృతి తెలంగాణలో ఎక్కువ ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నివేదిక ప్రకారం, గత మూడు దశాబ్దాలుగా దేశంలో మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య 150% పెరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల విస్తృతి 16.6% కాగా, ముంబై (7.5%), చెన్నై (13.5%), బెంగళూరులో 11.7% మేర పెరుగుదల ఉంది. డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు గుండె జబ్బులు, దృష్టి లోపం, మూత్రపిండాల రుగ్మతలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. మధుమేహం నియంత్రణలో జీవనశైలిలో మార్పులదే కీలక పాత్ర. అలాగే ప్రత్యేకమైన పోషకాహార సప్లిమెంట్స్ కూడా చాలా అవసరం. – డాక్టర్ ఇర్ఫాన్ షేక్, మెడికల్ అఫైర్స్ హెడ్, అబాట్ న్యూట్రిషన్ మన దగ్గర రైస్ వినియోగమే సమస్య డయాబెటిస్ నియంత్రణలో డైట్ అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంత మాత్రాన అందరికీ చపాతి/పుల్కా తినేయమని చెప్పేయడం కుదరదు. తరతరాలుగా, ప్రాంతాల వారీగా అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు మన దగ్గర రైస్ బాగా తీసుకుంటారు. సాధారణ అన్నం లాగే కాకుండా బిర్యానీ, పులిహోర తదితరాల రూపంలో కూడా రైస్ వినియోగం ఎక్కువగా ఉంటోంది. తద్వారా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతున్నాయి. దీనిని తగ్గించడం/నియంత్రించడానికే డైట్ ప్లాన్‌ను ఇస్తుంటాం. ఉదాహరణకు అన్నం మానలేమనేవారికి పరిమాణం తగ్గించమని, రాత్రి పడుకునే ముందు తినే అలవాటున్నవారికి 7 గంటల కల్లా ముగించమని చెబుతుంటా. ఉదయం పూటి ఎక్కువమంది ఇడ్లీ తీసుకుంటారు. కానీ మేం ఇడ్లీ, దోశ బదులు పెసరట్టు తినమంటాం. కాదు కూడదనే ఇడ్లీ ప్రియులకు.. ఇడ్లీ పిండిలో చిక్కుళ్లు, పెసలు, కేరట్ తురుము, రాజ్ మా గింజలు... వంటివి కలుపుకో మంటాం. తద్వారా కార్బ్స్ శాతాన్ని తగ్గించడం, ప్రోటీన్, ఫైబర్‌ని పెంచడానికి ప్రయతి్నస్తాం. – డా.పద్మనాభ వర్మ, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, ఎస్ఎల్జీ హాస్పిటల్స్, హైదరాబాద్ నియంత్రణే ముఖ్యం.. మధుమేహులు దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్న ఆహారపు అలవాట్లను మానుకుని ఆరోగ్యకరమైన ఆహారం వైపు మళ్లక తప్పదు. అయితే దీనికి కట్టుబడి ఉండే రేటు 38% కంటే తక్కువ. ఈ నేపథ్యంలో రోగుల జీవనశైలి, ఆహారపు అలవాట్ల చరిత్రకు అనుగుణంగా రూపొందించే ప్రత్యేకమైన ఆహార జాబితాయే టీడీఎన్ఏ. బరువు తగ్గడం, గ్లైసెమిక్ నియంత్రణ, నిర్వహణలో ఇది రోగికి తోడ్పడుతుంది – డాక్టర్ ఒసామా హమ్డీ, మెడికల్ డైరెక్టర్ జోస్లిన్ డయాబెటిస్ సెంటర్ -
వైద్యంలో ఒకప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా!
ఇటీవల చిన్న ఆరోగ్య సమస్య వస్తే సంప్రదించడానికి బాగా పరిచయం, వైద్య వృత్తిలో ఐదారు దశాబ్దాలకు పైగా అపారమైన అనుభవం, ఎండీ జనరల్ మెడిసిన్ డిగ్రీ ఉన్న ఒక సీనియర్ జన రల్ ఫిజీషియన్ దగ్గరికి వెళ్లాం. డాక్టర్ చాలా విపులంగా పరీక్ష చేశారు. బహుశా ఆయన స్పెషలిస్ట్ కాకపోవడం వల్లనే ఇలా పరీక్షించగలిగారు. అదే ఏ స్పెషాలిటీ ఆసుపత్రికో కన్సల్టేషన్ కు పోతే ఆ అనుభవమే వేరు. రోగి వంటిమీద ఏ స్పెషలిస్టయినా చెయ్యి వేయడం కానీ, స్టెత్ పెట్టి చూడడం కానీ సాధారణంగా ఉత్పన్నం కాదు. స్పెషలిస్టుల అప్పాయింట్మెంట్ దొరకడం, కలవడం ఒక ప్రహసనం. భారీ మొత్తంలో కన్సల్టేషన్ ఫీజ్ చెల్లించుకుని, గంటలకొద్దీ వెయిట్ చేసి, బయటనే పారా మెడికల్ వ్యక్తితో బీపీ, సాచ్యురేషన్, బరువు ఇత్యాదులు చూపించుకుని, స్పెషలిస్టును కలిసీ కలవడంతోనే సమస్య విని, తక్షణమే ఖరీదైన డయాగ్నాస్టిక్ పరీక్షలు చేయించాలి అంటారు చాలామంది. రిపోర్టులు వచ్చిన తరువాత చాలా మంది స్పెషలిస్టులు పూర్తిగా వాటి ఆధారంగా చికిత్స మొదలు పెట్టడమే కాని క్లినికల్‌గా కోరిలేట్ చేసుకోవడం ఆరుదేమో అనాలి. పెద్ద పెద్ద సూపర్ స్పెషలిస్టుల దగ్గర, వాళ్లు చూడడానికి ముందు ఒక సహాయక డాక్టర్ రోగి వివరాలు తీసుకుంటారు. ఆ వివరాల మీదా, రేడియాలజీ, పాథాలజీ పరీక్షల రిపోర్టుల మీదా ఆధారపడి సాగు తున్నది ఆధునిక వైద్యం. ఇది మంచిదా కాదా అంటే జవాబు చెప్పగలిగేవారు ఆ రంగానికి చెందిన నిపుణులే. వైద్యరంగంలో వచ్చిన, వస్తున్న పెనుమార్పులు, అభివృద్ధి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఆహ్వానించాల్సిందే కాని, వాటి మరో కోణం కొంత ఆందోళనకు దారి తీస్తుంది అనడం తప్పుకాదేమో! ఒకప్పుడు కేవలం ఎంబీబీఎస్ చదువుతో ఆపి ప్రభుత్వ ఉద్యోగమో, ప్రయివేట్ ప్రాక్టీసో చేసుకునేవారు. ఎక్కువలో ఎక్కువ జనరల్ మెడిసిన్, లేదా జనరల్ సర్జరీ చదివేవారు. వారిదగ్గరికి పోయిన రోగికి చికిత్స చేసే క్రమంలో రోగి నాడి చూడడం దగ్గరనుండి, స్టెతస్కోప్ వంటిమీద పెట్టి రోగ నిర్ధారణ చేయడంతో సహా, బీపీ చూడడం, అవసరమైన వారికి స్వయంగా ఇంజక్షన్ ఇవ్వడం, కట్టు కట్టడం లాంటి అనేకమైన వాటిని డాక్టర్ స్వయంగా చేసేవాడు. రోగికి ఎంతో తృప్తి కలిగేది. వారే అన్ని రకాల శస్త్ర చికిత్సలు చేసేవారు. ఎప్పుడైతే స్పెషలిస్టులు వైద్య రంగంలో పెరిగిపోసాగారో, ఒక్కో రుగ్మతకు ఒక్కో డాక్టర్ అవసరం పెరగసాగింది. ఈ నేపథ్యంలో, ఎంబీబీఎస్ తప్ప అదనపు స్పెషలిస్ట్ క్వాలిఫికేషన్ లేని ప్రజా వైద్యుడు, 50–60 సంవత్సరాల క్రితమే వృత్తిపరంగా రోగుల అన్నిరకాల రుగ్మతలకు తన అనుభవాన్ని ఆసాంతం రంగరించి చికిత్స చేసిన మహా మనీషి, ఖమ్మం జిల్లా వాసి, మాజీ రాజ్యసభ సభ్యుడు, స్వర్గీయ డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి (వైఆర్కే) అనుభవం నుంచి ప్రతి వైద్యుడూ నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. ఖమ్మం పట్టణానికి రాధాకృష్ణమూర్తి వచ్చి ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లో, ‘స్పెషలిస్టు’ డాక్టర్లంటూ ఎక్కువ మంది లేరు. అధికశాతం జనరల్ ప్రాక్టీషనర్లే. ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన వారే. ప్రముఖులతో సహా పలువురికి, ఆయన అప్పటికున్న సదుపాయాల ఆధారంగానే, టాన్సిల్స్ ఆపరేషన్ చేశారు. బహుశా ఖమ్మం పట్టణంలో మొదటి టాన్సిల్ ఆపరేషన్ చేసింది ఆయనేనేమో. అలాగే వేసెక్టమీ ఆపరేషన్లు ఖమ్మంలో ప్రారంభించిది కూడా ఆయనే. డాక్టర్ రాధాకృష్ణమూర్తి చేసిన ఆపరే షన్లలో, ఈ రోజుల్లో స్పెషలిస్ట్ వైద్యులు మాత్రమే చేస్తున్న హైడ్రోసిల్, హెర్నియా, అపెండిసైటిస్, ఫ్రాక్చర్స్, ట్యూమర్ లాంటివి కూడా వున్నాయి. ఎవరూ చేపట్టని ధనుర్వాతం కేసులకూ ఆయన చికిత్స అందించేవారు. అప్పట్లో క్షయ వ్యాధి చికిత్సకు ఒక క్రమ పద్ధతి అవలంబించారు రాధాకృష్ణమూర్తి. ప్రపంచ వ్యాప్తంగా అవలంబించే ‘ఆర్టిఫీషియల్ న్యూమో థొరాక్స్’ అనే విధానం ద్వారా, ఊపిరి తిత్తులను ‘కొలాప్స్’ చేసే పద్ధతి పాటించే వారు. ఎముకలు విరిగినవారికి ప్లాస్టర్ వేసి బాగు చేయడం డాక్టర్ రాధాకృష్ణమూర్తి ఒక ప్రత్యేక నైపుణ్యంగా అలవరచుకున్నారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో నేర్చుకున్న దానిని, మరింత పదును పెట్టడానికి, నిరంతర అధ్యయనం చేసేవారాయన. ఇంకా కొంచెం వెనక్కు పొతే, ఆర్ఎంపీల ప్రాక్టీసు చేసిన రోజులు జ్ఞప్తికి వస్తాయి. నా చిన్నతనంలో, మా గ్రామంలో ఎవరికైనా ‘సుస్తీ‘ చేస్తే, వైద్యం చేయడానికి, వూళ్లో వున్న నాటు వైద్యుడే దిక్కు. నాటు వైద్యులలో అల్లోపతి వారు, హోమియోపతి వారు. ఆయుర్వేదం వారు, పాము–తేలు మంత్రాలు వచ్చిన వాళ్లు, మూలికా వైద్యులు, ఇలా అన్ని రకాల వాళ్లు వుండేవారు. ఎవరికి ఏ సుస్తీ చేసినా వాళ్లే గతి. వారిలో కొందరికి ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం చేసే అలవాటుండేది. జ్వరాలకు (ఎక్కువగా ఇన్ ఫ్లుయెంజా, మలేరియా–చలి జ్వరం) ఏపీసీ ట్యాబ్లెట్లు ఇచ్చేవారు. గ్రామాలలో ‘గత్తర’ (కలరా), ‘స్పోటకం– పాటకం’ (స్మాల్ పాక్స్) వ్యాధులు తరచుగా వస్తుండేవి. వీటికి తోడు ‘దద్దులు’, ‘వంచెలు’ కూడా చిన్న పిల్లలకు పోసేవి. ఇవి రాకుండా ముందస్తు నివారణ చర్యగా కలరా ఇంజక్షన్లు చేయడానికి, ‘టీకాలు’ వేయడానికి ప్రభుత్వ వైద్యుల బృందం గ్రామంలోకి వచ్చేది. ఊళ్లో ఏవైనా సీరియస్ కేసులు వుంటే, ఎడ్ల బండిలోనో, మేనాలోనో తీసుకుని సమీపంలోని పట్టణానికి పోయే వాళ్లు. వారి వెంట (ఆర్ఎంపీ) డాక్టర్ కూడా వెళ్లేవాడు. (క్లిక్ చేయండి: ‘భావజాల’ విముక్తే ప్రత్యామ్నాయానికి దారి) ఇప్పుడైతే ప్రతిచోటా వందలాది మంది ఎంబీబీఎస్ డాక్టర్లు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు, మల్టీ సూపర్ స్పెషలిస్టులు, వందల–వేల నర్సింగ్ హోంలు, సూపర్ స్పెషాలిటీ– మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు; వాటికి ధీటుగా, మరింత మెరుగ్గా ప్రభుత్వ రంగంలో, వివిధ అంచెలలో అన్నిరకాల వైద్యసేవలు, అందరికీ ఉచి తంగా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి వైద్యం అందరికీ అందుబాటులోకి తేవడం జరుగుతున్నది. డయాగ్నాస్టిక్ పరీక్షలన్నీ ప్రభుత్వ పరంగా అన్ని స్థాయి ఆసుపత్రులలో ఉచితంగా లభ్యమవు తున్నాయి. భవిష్యత్తులో, బహుశా క్వాలిఫైడ్ డాక్టర్ లేని గ్రామం వుండదంటే అతిశయోక్తి కాదేమో! అయినా ఎక్కడో, ఎందుకో, ఏదో కానరాని వెలితి! (క్లిక్ చేయండి: కొత్త స్త్రీలు వస్తున్నారు జాగ్రత్త!) - వనం జ్వాలా నరసింహారావు తెలంగాణ ముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ -
వాస్క్యులర్ వ్యాధులు–శస్త్ర చికిత్సలు..
శారీరకంగా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలంటే, మంచి వాస్క్యులర్ (నాడీ వ్యవస్థ) ఆరోగ్యాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం అంటున్నారు అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్‌కు చెందిన వాస్క్యులర్ –ఎండోవాస్క్యులర్ సర్జన్, డా. సి. చంద్ర శేఖర్. ఈ వ్యాధుల వివరాలు అందించే చికిత్సల విషయాలను ఆయన ఇలా తెలియజేస్తున్నారు.. రక్త సరఫరాపై ప్రభావం... రక్తనాళాలు కణజాలాల నుండి వ్యర్థాలను తొలగిస్తాయి శరీరమంతటికీ ఆక్సిజన్, పోషకాలను తీసుకువెళతాయి. అయితే వాస్క్యులర్ వ్యాధులు సాధారణంగా ఈ రక్త నాళాలను ప్రభావితం చేస్తాయి, ఈ ఫలకం (కొవ్వు, కొలెస్ట్రాల్‌తో తయారైనది) సిరలు లేదా ధమనుల లోపల రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది . రక్త నాళాలకు ఏదైనా నష్టం జరిగి రక్తం ప్రవహించకుండా నిరోధించడం వలన ప్రాణాంతక అంతర్గత రక్తస్రావం లేదా స్ట్రోక్ వంటి వివిధ సమస్యలు కలుగుతాయి. శస్త్రచికిత్సలతో... చిన్నపాటి వాస్కులర్ వ్యాధులను జీవనశైలి మార్పుల ద్వారా సరిచేయవచ్చు, అయితే కొంతమందికి మందులు లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు. వాస్కులర్ వ్యాధుల చికిత్సకు అందుబాటులో ఉన్న వాస్కులర్ సర్జరీలు... ► యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ అనే ప్రక్రియలో కాథెటర్–గైడెడ్ బెలూన్ని ఉపయోగించి ఇరుకైన ధమనిని తెరుస్తారు. ఈ విధానం కనిష్ట ఇన్వాసివ్ ప్రక్రియ. ► అథెరెక్టమీ: ఇది రక్తనాళాల నుండి ఫలకాన్ని కత్తిరించడానికి, తొలగించడానికి అనుమతించే ఒక ప్రత్యేకమైన కాథెటర్‌ను నిరోధించబడిన ధమనిలోకి చొప్పించే మరొక అతితక్కువ ఇన్వాసివ్ ప్రక్రియ, ► ఆర్టెరియోవెనస్ ఫిస్టులా: ముంజేయిలోని సిర నేరుగా ధమనికి అనుసంధానించి, సిరను బలంగా వెడల్పుగా చేస్తుంది ► ఆర్టెరియోవెనస్ గ్రాఫ్ట్: ఈ రకమైన శస్త్రచికిత్సలో సింథటిక్ ట్యూబ్ ద్వారా ధమనిని సిరకు కనెక్ట్ చేయడం జరుగుతుంది. ► ఓపెన్ అబ్డామినల్ సర్జరీ: ఈ శస్త్రచికిత్సలో పొత్తికడుపు గుండా వెళ్ళే ప్రదేశంలో చిన్న కోత ఉంటుంది. సమస్య ఉన్న ప్రాంతం చుట్టూ రక్త ప్రవాహాన్ని మళ్లించడానికి దీన్ని చేస్తారు. ► థ్రోంబెక్టమీ: ఈ ప్రక్రియలో సిర లేదా ధమని నుంచి రక్తం గడ్డకట్టడం తొలగించబడుతుంది. సరైన రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడంలో ఈ ప్రక్రియ సహాయపడుతుంది. దీనికి బదులుగా ఒక్కోసారి యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ కూడా చేయవచ్చు. ► వాస్కులర్ బైపాస్ సర్జరీ: బైపాస్ గ్రాఫ్టింగ్ అనేది దెబ్బతిన్న నాళాన్ని దాటవేసే రక్త ప్రవాహానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది. వెర్టెబ్రోబాసిలర్ వ్యాధి, పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి, మూత్రపిండ వాస్కులర్ వ్యాధి, మెసెంటెరిక్ వాస్కులర్ వ్యాధి ఉన్న రోగులకు దీన్ని చేస్తారు. ఓపెన్ కరోటిడ్ , ఫెమోరల్ ఎండార్టెరెక్టమీ: ఈ ప్రక్రియలో కాళ్లు లేదా మెదడులకు రక్తాన్ని అందించే ధమనుల లోపలి పొరలో ఉన్న ఫలకాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం జరుగుతుంది. ► ఈ శస్త్రచికిత్సలు రోగి జీవితాన్ని మెరుగుపరుస్తాయి, రోగుల శారీరక పరిస్థితిని బట్టి శస్త్ర చికిత్స అనంతరం కోలుకోవడానికి 1–2 వారాలు అవసరం కావచ్చు –డా. సి. చంద్ర శేఖర్,వాస్కులర్ – ఎండోవాస్కులర్ సర్జన్, అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి -
కరోనా: మరో రెండేళ్లు ఇదే కథ
సాక్షి, హైదరాబాద్: దేశంలో, రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేత, పాక్షికంగా ఆంక్షల సడలింపు ఇతర అంశాలతో నిమిత్తం లేకుండా అందరూ కరోనా నుంచి రక్షణకు సుదీర్ఘకాలం పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే! ఈ మహమ్మారి నుంచి సురక్షితులమని, తమకు మినహాయింపు ఉంటుందని ఎవరూ భావించొద్దు.. ప్రతి ఒక్కరూ అన్నిరకాల ముందస్తు చర్యలు చేపట్టాల్సిందే. మాసు్కలు కట్టుకోవడం, శానిటైజర్ల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత, మనుషుల మధ్య దూరం పాటించడం వంటివి కనీసం ఏడాది పాటు కొనసాగించాల్సిందే. సాధారణ జలుగు, దగ్గు రూపంలో మామూలు ఫ్లూ మాదిరిగా సోకినా ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా కనీసం మనకు సోకిందని తెలియకుండా ఈ వైరస్ వెళ్లిపోయేందుకు, దానికి అందరూ అలవాటు పడటానికి మరికొంత కాలం (మరో సంవత్సరం) పడుతుంది. కరోనా మహమ్మారి గురించి నిష్ణాతులైన వైద్యులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చడమే కాకుండా పలు హెచ్చరికలు కూడా చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ముఖ్యంగా కేన్సర్, కిడ్నీ, ఇతర రోగులు ఎలాంటి పద్ధతులు పాటించి సురక్షితంగా ఉండాలన్న దానిపై వివిధ రోగాలకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసింది. వివిధ అంశాలకు సంబంధించి డాక్టర్లు ఇచ్చిన సలహాలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.. షుగరున్న వారికి సమస్యలు ‘డయాబెటిస్, హైపర్ టెన్షన్‌తో పాటు గుండె, ఊపిరితిత్తుల వ్యాధి ఉన్న వారు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడే అవకాశాలున్నాయి. షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకోవాలి. వేళకు మందులు వేసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవాలి. మనుషుల మధ్య దూరాన్ని పాటిస్తూ, పరిశుభ్రత పాటించాలి. లాక్‌డౌన్‌తో 60 ఏళ్లకు పైబడిన వారు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఇళ్లలోనే కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయాలి. అన్‌కంట్రోల్డ్ షుగర్ ఉన్న వారిలో కాంప్లికేషన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనా, అమెరికా, ఇటలీ, స్పెయిన్ తదితర పశి్చమ దేశాల్లోని డయాబెటిస్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలున్న పెద్ద వయసు్కల్లో ఈ వైరస్ ఎక్కువ మందికి సోకినట్లు, ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు తేలింది. – బెట్రైస్ ఆనీ, నిమ్స్ హెచ్‌వోడీ, ఎండోక్రైనాలజీ అండ్ డయాబెటిస్ మరో రెండేళ్లు ఇదే పరిస్థితి ‘మరో రెండేళ్ల దాకా ఏదో ఒక రూపంలో ఈ వైరస్ బయటపడుతూనే ఉండే అవకాశాలున్నాయి. వ్యాక్సిన్ రావడానికి ఏడాది, ఏడాదిన్నర పట్టొచ్చు. అందరూ అన్ని జాగ్రత్తలూ తీసుకోవాల్సిందే. లాక్డౌన్ ఎత్తేశాక కూడా సినిమా హాళ్లు, మాల్స్ వంటివి ఉండవు కాబట్టి మతపరమైన అంశాలతో పాటు సమూహాలు ఒక్కచోట గుమికూడకుండా, విదేశీయాత్రలు, విహార యాత్రలకు వెళ్లకుండా, పెళ్లిళ్లలో ఎక్కువ మంది గుమిగూడకుండా చూసుకోవాలి. యువత, ఆరోగ్యవంతులైన వారి ద్వారానే ఈ వైరస్ వ్యాపిస్తున్నందున వారు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. వారిపై ఇది పెద్దగా ప్రభావం చూపకపోయినా వారి ఇళ్లలో, బయటా పెద్ద వయసున్న వారు, ఏదైనా జబ్బు బారిన వారికి ప్రాణాంతకంగా మారే ప్రమాదముంది.’ – డా.యలమంచిలి రవీంద్రనాథ్, జనరల్ సర్జన్ (ఖమ్మం) కిడ్నీ పేషెంట్లు బయటకు రావొద్దు ‘కిడ్నీ పేషెంట్లు ఎవరూ అస్సలు బయటకు రావొద్దు. మందులు అస్సలు మానేయొద్దు. ఇళ్లలోనూ క్వారంటైన్ పాటించాలి. ఎవ్వరినీ కలవొద్దు. జలుబు, దగ్గు, విరేచనాలు వంటివి ఉన్నా, వైరస్ సోకడంపై ఏ మాత్రం అనుమానం అనిపించినా బ్లడ్‌టెస్ట్ చేసుకోవాలి. డాక్టర్‌ను సంప్రదించాలి. మాసు్కలు, శానిటైజర్లు వాడుతూ.. పరిశుభ్రంగా ఉండాలి. కిడ్నీ వ్యాధి ఉన్నవారు, డయాలసిస్ చేయించుకుంటున్న వారు, కిడ్నీ మారి్పడి చేయించుకున్న వారు.. డాక్టర్ల సూచనల మేరకు తమకు సూచించిన ఆహారాన్ని, పండ్లను, కూరగాయలు, నాన్‌వెజ్, పండ్ల రసాలు తీసుకోవాలి.’ – డా.భూషణ్‌రాజు, నిమ్స్ ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ కళ్ల కలక వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి ‘కంజెక్టివిటీస్/మద్రాస్ ఐ వంటి కళ్ల కలక ఎవరికి వచ్చినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. దగ్గు, జలుబుతో పాటు కంటి ఇన్ఫెక్షన్లు, జ్వరంతో పాటు కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలతో కూడా ఈ వైరస్ సోకే అవకాశాలున్నాయి. కళ్ల కలక వచి్చన వారు వెంటనే ఐసోలేషన్ పాటించాలి. చేతులతో కళ్లను తాకినప్పుడు, ఎదుటివారి తుంపరలు (డ్రాప్‌లెట్లు) పడినప్పుడు, అప్రయత్నంగా కళ్లు నలుపుకున్నపుడు చాలా వేగంగా ఇది వ్యాపిస్తుంది. అయితే దీని నుంచి రికవరీ కూడా బాగానే ఉంది. దీని వ్యాప్తికి వాతావరణ పరిస్థితులు కూడా దోహదం చేస్తున్నందున, వర్షాకాలంలో ఇది మరింత తీవ్రరూపం తీసుకోవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం తర్వాత చలికాలం కూడా దీని విజృంభణకు తోడ్పాటునిచ్చే అవకాశాలున్నందున అందరూ కచి్చతమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.’ –డా. దీప, కంటి వైద్య నిపుణురాలు ఒక్కరోజు కూడా మందులు మానొద్దు గుండె జబ్బున్న వారు ముఖ్యంగా స్టెంట్ వేసిన వారు, శస్త్రచికిత్స చేయించుకున్న వారు రొటీన్‌గా వేసుకునే మందులు ఒక్కరోజు కూడా గ్యాప్ రానివ్వొద్దు. స్టెంట్ పడిన వారు ఒక్కరోజు మందులు మానినా దాని ప్రభావం పడుతుంది. ప్రస్తుతం ఇళ్లలోనే ఉండటం వల్ల కాలక్షేపానికి ఏదో ఒకటి తినడం, వ్యాయామం చేయకపోవడం కూడా ప్రభావం చూ పే అవకాశాలున్నాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, పండ్లు, తాజా కూరగాయాలు వంటివి తీసుకోవాలి. యాంగ్జయిటీ, డిప్రెషన్‌కు గురికాకూడదు. ధ్యానం, మంచి సంగీతం వినాలి. గుండెనొప్పి వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి, పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటే వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఫోన్ లేదా టెలీ మెడిసిన్ ద్వారా డాక్టర్ల సలహా ప్రకారం మందులు మార్చడం, డోస్‌ను పెంచడం చేయాలే తప్ప సొంతంగా డోస్ పెంచుకోవద్దు. – డా. డి.శేషగిరిరావు, ప్రముఖ కార్డియాలజిస్ట్ గర్భిణులకు 4 విజిట్స్ చాలు ‘వైరస్ సొకేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు ఆసుపత్రులకు నాలుగు విజిట్లకు వస్తే సరిపోతుంది. ఇంట్లో కూడా వారు మనుషుల మధ్య 4 అడుగుల దూరం పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ఆన్ లౌన్, బయటి ఆహార పదార్థాలను తీసుకోవద్దు. ఇళ్లలో వండిన వేడి వేడి ఆహారాన్నే తీసుకోవాలి. ప్రతి అర గంటకు ఒకసారి చేతులు సబ్బుతో కడుక్కోవాలి. ఇళ్లలోని డోర్ నాబ్ లను స్పిరిట్‌తో శుభ్రం చేస్తుండాలి. మ హిళలు, వృద్ధులు, మధుమేహం, హైపర్ టెన్ష న్ ఉన్న స్త్రీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.’ – డా.కృష్ణవేణి, గైనకాలజిస్ట్ కేన్సర్ రోగులూ.. ఫ్రిడ్జ్లోనివి తినవద్దు ‘కేన్సర్ పేషెంట్లు చల్లటి పదార్థాలు ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉంచిన ఆహార పదార్థాలు అస్సలు తీసుకోవద్దు. వేళకు వేడి వేడి సూప్‌లు, ప్రోటీన్లున్న తాజా ఆహారం, కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. రోజుకు 3,4 సార్లు బట్టలు మార్చుకోవాలి. వారి బట్టలను ఉతికాక ఎండలో ఆరేలా చూడాలి. ఈ వైరస్ వ్యాప్తి గురించి అనవసర భయాందోళనలకు గురికావొద్దు. వేడి నీటితో తరచుగా పుక్కిలించాలి. ప్రతిరోజూ శ్వాస సంబంధ వ్యాయామాలు చేయాలి. వీరికి నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో త్వరగా ఈ వైరస్ బారిన పడే అవకాశాలున్నాయి. మా ఆస్పత్రిలో ఇన్పేషంట్లకు ప్రతిరోజూ చెకప్‌లు నిర్వహించి ఏ కొంచెం అనుమానమున్నా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం.’ – డా.జయలత, ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ చదవండి: కేసీఆర్ తాత నిన్ను పాస్ చేసిండుపో.. చైనా పీపీఈ కిట్లు నాసిరకం! -
‘థెరపీ’ ప్రకటనలపై గూగుల్ బ్యాన్
శాన్ప్రాన్సిస్కో: శాస్త్రీయంగా నిర్థారణ కాని వైద్య చికిత్సలకు సంబంధించిన ప్రకటనలపై నిషేధం విధిస్తున్నట్లు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ శుక్రవారం ప్రకటించింది. స్టెమ్ సెల్ థెరపీ, సెల్యూలార్ థెరపీ, జీన్ థెరపీల వంటి శాస్త్రీయంగా పూర్తిగా నిర్ధారణకాని ప్రయోగాత్మక వైద్య విధానాలకు సంబంధించిన యాడ్లు ఇకపై గూగుల్‌లో కనుమరుగు కానున్నాయని గూగుల్ పాలసీ సలహాదారు ఆడ్రిన్నె బిడ్డింగ్స్ తెలిపారు. బయో మెడికల్, సైంటిఫిక్ ఆధారాలు లేని అన్ని వైద్యవిధానాలు, థెరపీ ప్రకటనల నియంత్రణ కోసం కొత్త పాలసీ తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు. రోగాలతో బాధపడుతున్న వారు ఈ తరహా యాడ్స్ కారణంగా తప్పుదోవ పడుతున్నారని గూగుల్ పేర్కొంది. ఇది మెడికల్ పరిశోధనలను తప్పుబట్టడం కాదని, నిర్థారణ కానటువంటి వాటిపై ఓ కన్నేసి ఉంచడం మాత్రమే అని స్పష్టం చేసింది. దీన్ని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ అధ్యక్షుడు దీపక్ శ్రీవత్సవ స్వాగతించారు. సంపూర్ణ చికిత్సా విధానాలుగా అభివృద్ధిగాని ఇలాంటి చికిత్సలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటివి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయన్నారు. ఇలాంటి సందేశాలను నియంత్రించడంలో ఆన్లైన్ సర్వీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. -
ఫిట్...రైట్...
►వ్యాయామ ప్రారంభంలో తప్పనిసరిగా వైద్యసలహా తీసుకోవాలి ► జిమ్‌లో షోల్డర్‌కు వెయిట్స్తో కఠినమైన వ్యాయామాలు చేసేప్పుడు లోయర్ బ్యాక్ సపోర్టర్, కాళ్ళకు చేసేప్పుడు టెస్టికల్ సపోర్టర్ తప్పనిసరిగా వాడాలి. ► అతిగా వ్యాయామం చేసినట్టన్పిస్తే మరుసటి రోజు నిరభ్యంతరంగా విశ్రాంతి తీసుకోవాలి. ►హార్ట్‌రేట్, క్యాలరీల ఖర్చు వంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలి. దేహం బరువు మరీ అధికంగా తగ్గడం, పెరగడం జరిగితే జాగ్రత్త పడాలి. ►నేలమీద పడుకుని చేసే స్ట్రెచెస్, క్రంచెస్కు నిపుణుల పర్యవేక్షణ, తప్పనిసరి. లేని పక్షంలో బ్యాక్‌పెయిన్ సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ► వ్యాయామానికి ముందు వార్మప్, ముగించాక కూల్డవున్ వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. ►నొప్పులొచ్చేట్టు చేస్తేనే వ్యాయామం అనేది కరెక్ట్ కాదు. ప్రారంభంలో వచ్చే సాధారణ నొప్పులకు పెయిన్‌కిల్లర్స్‌తో సమాధానం చెప్పడం మంచిది కాదు. ►నొప్పి అనేది మజిల్పై పెరిగిన ఒత్తిడికి సూచన, రక్షణ కూడా. వీలైనంత వరకూ సహజమైన పద్ధతుల్లోనే దాన్ని తగ్గించాలి. ►సెట్‌కి సెట్‌కి మధ్య ఏదో ఒక రూపంలో తగినంత విరామం తప్పకుండా ఇవ్వాలి. ► అధికంగా చెమట వల్ల వచ్చే ఎలర్జీలు, చర్మవ్యాధులు, తదితర సమస్యలపై ముందస్తు అవగాహన, తగిన జాగ్రత్తలు అవసరం. ► వ్యాయామం ప్రారంభించగానే హార్ట్‌రేట్(గుండెకొట్టుకునే స్ధాయి) సాధారణ స్ధాయి నిమిషానికి 60–70 స్పందనల నుంచి అత్యధికంగా 200 వరకూ చేరుకునే అవకాశం ఉంది. అదే విధంగామన ఊపిరితిత్తుల బ్రీతింగ్ సామర్ధ్యం నిమిషానికి 6నుంచి 10లీటర్స్. వ్యాయామం దానిని 150 నుంచి 200 వరకూ వెళ్ళేందుకు దోహదం చేస్తుంది. కండరాల్లో రక్తప్రసరణ స్ధాయిని 15శాతం నుంచి 88శాతం దాకా తీసుకెళ్తుంది. ఈ పెరుగుదల వ్యక్తి వయసు, ఫిట్నెస్, ఆరోగ్యం... తదితర అంశాల ఆధారంగా మారుతుంటాయి. ►ఆరోగ్యకరమైన బరువుని మెయిన్‌టెయిన్ చేయడానికి కనీసం 30నిమిషాల నుంచి 60 నిమిషాల చొప్పున వారంలో 5రోజులు చేయాలి. ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి అనే దాని కంటే వ్యాయామానికి తీసుకున్న వ్యవధి చాలా ముఖ్యం. ► డయాబెటిస్, అధికరక్తపోటు, హృద్రోగబాధితులు రోజుకి కనీసం 30నిమిషాల చొప్పున వారానికి 5రోజులు వ్యాయామం చేస్తే చాలు. ►ఆస్త్మా, దగ్గు వంటి తీవ్ర సమస్యలున్నవారు అవి తగ్గేవరకూ వ్యాయామాల జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. అలాగే జ్వరంతో ఉన్నపుడు, ఊపిరందని పరిస్థితుల్లో కూడా వ్యాయామాన్ని కొనసాగించాలనుకోవడం కరెక్ట్ కాదు. ►ఎండలు, వర్షాకాలం సమయాల్లో కాస్త వ్యవధి తగ్గించి, చలికాలం మాత్రం బాగా కష్టమైన వ్యాయామాలు కూడా చేయవచ్చు. ►అనూహ్యంగా ఎక్కువ బరువు తగ్గిపోవడం, ముక్కునుంచి రక్తం కారడం, ఊపిరి అందకపోవడం, ఊపిరితిత్తులకు గాయాలు, తలతిరగుతున్నట్టు ఉండడం, దగ్గు వంటి ఆరోగ్యసమస్యలు అతి వ్యాయామం వల్ల వచ్చే ప్రమాదముంది. ►బాగా చల్లని వాతావరణంలోనూ, మితిమీరిన వేడి వాతావరణంలోనూ కాక వీలైనంత వరకూ తెల్లవారుఝామున, సాయంత్రం పూట మాత్రమే వ్యాయామం చేయడం ఆరోగ్యకరం. ►వ్యాయామం చేస్తున్నప్పటికీ బరువు పెరిగాను... ఆరోగ్యం కోసం జిమ్‌కి వెళ్తుంటే కొత్త ప్రాబ్లెమ్స్... వగైరా ఫిర్యాదులు పెరిగాయి. ఏ రకంగా చూసినా ఎక్సర్సైజ్లు దేహానికి మేలు చేసేవే అయితే అసలు వ్యాయామం వల్ల కొత్త ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయ్? ఈ ప్రశ్నకు జవాబులు కావాలంటే వ్యాయామానికి ‘వైద్య’పరీక్షలు నిర్వహించాల్సిందే. వైద్యం చేయాలంటే లోపమెక్కడుందో గుర్తించాలంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ ఎం.వెంకట్ -
సెల్లో వైద్య సలహాలు
సరికొత్త ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను రూపొందించిన ఏపీఎస్ కళాశాల విద్యార్థులు అప్లికేషన్లో నిపుణులైన వైద్యుల పేర్లు, ఈ-బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లింపునకు అవకాశం సాక్షి, బెంగళూరు : అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులు తాము ఉన్న చోటే వైద్య సలహాలు, సూచనలు పొందడం ద్వారా చికిత్సను అందుకునేలా నగరంలోని ఏపీఎస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఓ సరికొత్త ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను రూపొందించారు. doc.onmove పేరిట రూపొందించిన ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ పనితీరును రూపకర్తలైన ప్రణతి, వినుతా, ప్రసన్నలు మీడియాకు వివరించారు. వీరంతా ఏపీఎస్ కళాశాలలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆండ్రాయిడ్ అప్లికేషన్ రూపకర్తలు మాట్లాడుతూ...వృద్ధాప్యంతో బాధపడేవారు, అత్యవసర చికిత్స అవసరమైన వారిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను రూపొందించినట్లు చెప్పారు. నగర ప్రాంతాల్లోని వృద్ధులు తమ పిల్లలు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తిన ప్రతిసారి ఆస్పత్రికి వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటారని అన్నారు. ఇక అత్యవసర చికిత్స అవసరమైన సందర్భాల్లో ఆస్పత్రికి చేర్చే వరకు రోగి ప్రాణానికి ప్రమాదం లేకుండా ఉండేందుకు ప్రాథమిక చికిత్స ఎంతైనా అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు. ఇక ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను తమ సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న అనంతరం ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నారనే విషయాన్ని నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆ వెంటనే ఆయా వ్యాధులకు సంబంధించిన నిపుణులైన వైద్యుల పేర్లన్నీ సెల్‌ఫోన్ తెరపై ప్రత్యక్షమవుతాయని తెలిపారు. అనంతరం వారిలో ఎవరోఒకరి పేరును ఎన్నుకోవాల్సి ఉంటుందని, తర్వాత ఫోన్లో లైవ్ చాటింగ్ ద్వారా వైద్యులు ఏ మందులు వాడాలి, తదుపరి ఎలాంటి చికిత్స అవసరమౌతుంది వంటి విషయాలపై సూచనలు, సలహాలు అందిస్తారని వెల్లడించారు. వైద్య సేవలకు గాను ఈ-బ్యాంకింగ్ ద్వారా వైద్యుల ఫీజును చెల్లించేందుకు ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్లో అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యులను సైతం వైద్యుల జాబితాలో చేర్చితే ప్రజలకు ఉచితంగా వైద్య సలహాలు అందుకునేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ అంశాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ వ ుంత్రి యు.టి.ఖాదర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు అప్లికేషన్ రూపకర్తలు తెలిపారు. ఈ విషయంపై త్వరలోనే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు.