ఫిట్...రైట్...
►వ్యాయామ ప్రారంభంలో తప్పనిసరిగా వైద్యసలహా తీసుకోవాలి
► జిమ్‌లో షోల్డర్‌కు వెయిట్స్‌తో కఠినమైన వ్యాయామాలు చేసేప్పుడు లోయర్ బ్యాక్ సపోర్టర్, కాళ్ళకు చేసేప్పుడు టెస్టికల్ సపోర్టర్ తప్పనిసరిగా వాడాలి.
► అతిగా వ్యాయామం చేసినట్టన్పిస్తే మరుసటి రోజు నిరభ్యంతరంగా విశ్రాంతి తీసుకోవాలి.
►హార్ట్‌రేట్, క్యాలరీల ఖర్చు వంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలి. దేహం బరువు మరీ అధికంగా తగ్గడం, పెరగడం జరిగితే జాగ్రత్త పడాలి.
►నేలమీద పడుకుని చేసే స్ట్రెచెస్, క్రంచెస్‌కు నిపుణుల పర్యవేక్షణ, తప్పనిసరి. లేని పక్షంలో బ్యాక్‌పెయిన్ సమస్యలు తలెత్తే ప్రమాదముంది.
► వ్యాయామానికి ముందు వార్మప్, ముగించాక కూల్‌డవున్ వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి.
►నొప్పులొచ్చేట్టు చేస్తేనే వ్యాయామం అనేది కరెక్ట్ కాదు. ప్రారంభంలో వచ్చే సాధారణ నొప్పులకు పెయిన్‌కిల్లర్స్‌తో సమాధానం చెప్పడం మంచిది కాదు.
►నొప్పి అనేది మజిల్‌పై పెరిగిన ఒత్తిడికి సూచన, రక్షణ కూడా. వీలైనంత వరకూ సహజమైన పద్ధతుల్లోనే దాన్ని తగ్గించాలి.
►సెట్‌కి సెట్‌కి మధ్య ఏదో ఒక రూపంలో తగినంత విరామం తప్పకుండా ఇవ్వాలి.
► అధికంగా చెమట వల్ల వచ్చే ఎలర్జీలు, చర్మవ్యాధులు, తదితర సమస్యలపై ముందస్తు అవగాహన, తగిన జాగ్రత్తలు అవసరం.
► వ్యాయామం ప్రారంభించగానే హార్ట్‌రేట్(గుండెకొట్టుకునే స్ధాయి) సాధారణ స్ధాయి నిమిషానికి 60–70 స్పందనల నుంచి అత్యధికంగా 200 వరకూ చేరుకునే అవకాశం ఉంది. అదే విధంగామన ఊపిరితిత్తుల బ్రీతింగ్ సామర్ధ్యం నిమిషానికి 6నుంచి 10లీటర్స్. వ్యాయామం దానిని 150 నుంచి 200 వరకూ వెళ్ళేందుకు దోహదం చేస్తుంది. కండరాల్లో రక్తప్రసరణ స్ధాయిని 15శాతం నుంచి 88శాతం దాకా తీసుకెళ్తుంది. ఈ పెరుగుదల వ్యక్తి వయసు, ఫిట్‌నెస్, ఆరోగ్యం... తదితర అంశాల ఆధారంగా మారుతుంటాయి.
►ఆరోగ్యకరమైన బరువుని మెయిన్‌టెయిన్ చేయడానికి కనీసం 30నిమిషాల నుంచి 60 నిమిషాల చొప్పున వారంలో 5రోజులు చేయాలి. ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి అనే దాని కంటే వ్యాయామానికి తీసుకున్న వ్యవధి చాలా ముఖ్యం.
► డయాబెటిస్, అధికరక్తపోటు, హృద్రోగబాధితులు రోజుకి కనీసం 30నిమిషాల చొప్పున వారానికి 5రోజులు వ్యాయామం చేస్తే చాలు.
►ఆస్త్మా, దగ్గు వంటి తీవ్ర సమస్యలున్నవారు అవి తగ్గేవరకూ వ్యాయామాల జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. అలాగే జ్వరంతో ఉన్నపుడు, ఊపిరందని పరిస్థితుల్లో కూడా వ్యాయామాన్ని కొనసాగించాలనుకోవడం కరెక్ట్ కాదు.
►ఎండలు, వర్షాకాలం సమయాల్లో కాస్త వ్యవధి తగ్గించి, చలికాలం మాత్రం బాగా కష్టమైన వ్యాయామాలు కూడా చేయవచ్చు.
►అనూహ్యంగా ఎక్కువ బరువు తగ్గిపోవడం, ముక్కునుంచి రక్తం కారడం, ఊపిరి అందకపోవడం, ఊపిరితిత్తులకు గాయాలు, తలతిరగుతున్నట్టు ఉండడం, దగ్గు వంటి ఆరోగ్యసమస్యలు అతి వ్యాయామం వల్ల వచ్చే ప్రమాదముంది.
►బాగా చల్లని వాతావరణంలోనూ, మితిమీరిన వేడి వాతావరణంలోనూ కాక వీలైనంత వరకూ తెల్లవారుఝామున, సాయంత్రం పూట మాత్రమే వ్యాయామం చేయడం ఆరోగ్యకరం.
►వ్యాయామం చేస్తున్నప్పటికీ బరువు పెరిగాను... ఆరోగ్యం కోసం జిమ్‌కి వెళ్తుంటే కొత్త ప్రాబ్లెమ్స్... వగైరా ఫిర్యాదులు పెరిగాయి. ఏ రకంగా చూసినా ఎక్సర్‌సైజ్‌లు దేహానికి మేలు చేసేవే అయితే అసలు వ్యాయామం వల్ల కొత్త ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయ్? ఈ ప్రశ్నకు జవాబులు కావాలంటే వ్యాయామానికి ‘వైద్య’పరీక్షలు నిర్వహించాల్సిందే. వైద్యం చేయాలంటే లోపమెక్కడుందో గుర్తించాలంటున్నారు ఫిట్‌నెస్ ట్రైనర్ ఎం.వెంకట్