- సరికొత్త ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను రూపొందించిన ఏపీఎస్ కళాశాల విద్యార్థులు
- అప్లికేషన్‌లో నిపుణులైన వైద్యుల పేర్లు, ఈ-బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లింపునకు అవకాశం
సాక్షి, బెంగళూరు : అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులు తాము ఉన్న చోటే వైద్య సలహాలు, సూచనలు పొందడం ద్వారా చికిత్సను అందుకునేలా నగరంలోని ఏపీఎస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఓ సరికొత్త ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను రూపొందించారు. doc.onmove పేరిట రూపొందించిన ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ పనితీరును రూపకర్తలైన ప్రణతి, వినుతా, ప్రసన్నలు మీడియాకు వివరించారు.
వీరంతా ఏపీఎస్ కళాశాలలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆండ్రాయిడ్ అప్లికేషన్ రూపకర్తలు మాట్లాడుతూ...వృద్ధాప్యంతో బాధపడేవారు, అత్యవసర చికిత్స అవసరమైన వారిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను రూపొందించినట్లు చెప్పారు. నగర ప్రాంతాల్లోని వృద్ధులు తమ పిల్లలు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తిన ప్రతిసారి ఆస్పత్రికి వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటారని అన్నారు.
ఇక అత్యవసర చికిత్స అవసరమైన సందర్భాల్లో ఆస్పత్రికి చేర్చే వరకు రోగి ప్రాణానికి ప్రమాదం లేకుండా ఉండేందుకు ప్రాథమిక చికిత్స ఎంతైనా అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు. ఇక ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను తమ సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న అనంతరం ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నారనే విషయాన్ని నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
ఆ వెంటనే ఆయా వ్యాధులకు సంబంధించిన నిపుణులైన వైద్యుల పేర్లన్నీ సెల్‌ఫోన్ తెరపై ప్రత్యక్షమవుతాయని తెలిపారు. అనంతరం వారిలో ఎవరోఒకరి పేరును ఎన్నుకోవాల్సి ఉంటుందని, తర్వాత ఫోన్‌లో లైవ్ చాటింగ్ ద్వారా వైద్యులు ఏ మందులు వాడాలి, తదుపరి ఎలాంటి చికిత్స అవసరమౌతుంది వంటి విషయాలపై సూచనలు, సలహాలు అందిస్తారని వెల్లడించారు.
వైద్య సేవలకు గాను ఈ-బ్యాంకింగ్ ద్వారా వైద్యుల ఫీజును చెల్లించేందుకు ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లో అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యులను సైతం వైద్యుల జాబితాలో చేర్చితే ప్రజలకు ఉచితంగా వైద్య సలహాలు అందుకునేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ అంశాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ వ ుంత్రి యు.టి.ఖాదర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు అప్లికేషన్ రూపకర్తలు తెలిపారు. ఈ విషయంపై త్వరలోనే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు.