irfan
-
కోడి కోసం.. కొండచిలువ..! అంతలోనే..
భద్రాద్రి: మండలంలోని వినాయకపురం గ్రామంలో ఉన్న ఇర్ఫాన్ చికెన్ షాపులోకి ఓ కొండ చిలువ చొరబడి కలకలం సృష్టించింది. షాపు యజమాని సయ్యద్ ఇర్ఫాన్ బుధవారం ఉదయాన్నే షాపు తెరిచి కోళ్లు ఉన్న ఫారమ్‌లోకి వెళ్లగా, కొండ చిలువ కోళ్లను మింగుతూ కనిపించింది. స్థానికుల సమాచారంతో వచ్చిన ఫారెస్ట్ సిబ్బంది సుమారు 12 అడుగుల కొండ చిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. -
ప్రాంతాన్నిబట్టి ప్లాన్
‘అన్నం మానండి, సాయంత్రం చపాతీ తినండి,ఉదయం మిల్లెట్స్ బెటర్..’ మధుమేహంతో బాధపడే వారికి ఇలాంటి సూచనలు,సలహాలు సాధారణమే. అయితే వేర్వేరు ఆహారపు అలవాట్లు ఉన్న రోగులందరికీ ఒకే రకమైన డైట్ చార్ట్ సరైనదేనా?అంటే కానేకాదు అంటున్నారు వైద్య నిపుణులు. ప్రాంతాల వారీగా, జీవనశైలులకు అనుగుణంగా కస్టమైజ్డ్ (కావలసిన విధంగా) డైట్ చార్ట్ రూపొందించాల్సిందే అంటున్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా విస్తృత అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. ఇందులో వేలాదిగా వైద్యులు, రోగులు భాగంపంచుకోనున్నారు. సాక్షి, హైదరాబాద్: ‘మన దేశపు ఆహారపు అలవాట్లలో ఉన్న విస్తృతమైన వ్యత్యాసాల కారణంగా, మధుమేహాన్ని నియంత్రించడానికి అందరికీ ఒకే రకంగా సరిపో యే డైట్ చార్ట్ లేదని తాజాగా పరిశోధకులు తేల్చారు. దీని ఫలితంగానే ట్రాన్స్కల్చరల్ డయాబెటిస్ న్యూట్రిషన్ అల్గోరిథం (టీడీఎన్ఏ) పుట్టింది..’అని చక్కెర వ్యాధి నిపుణులు డాక్టర్ ఒసామా హమ్డీ, పోషకాహార నిపుణులు డాక్టర్ ఇర్ఫాన్ షేక్ చెప్పారు. ఈ టీడీఎన్ఎపై అవగాహన కార్యక్రమాలకు రాష్ట్రంలో శ్రీకారం చుట్టిన సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీఎన్ఏ అనేది టైప్ 2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్లకు గొప్ప ఉపశమనంగా మారుతుందని వీరు పేర్కొన్నారు. ప్రాంతాల వారీగా.. వివిధ ప్రాంతాల ప్రజల విభిన్న ఆహారపు అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాలను అధ్యయనం చేసి ఆయా ప్రాంతాల్లోని రోగుల్లో మధుమేహ నియంత్రణకు అవసరమైన ఆహారపు అలవాట్లను (ఆహార ప్రణాళిక) సూచించేదే టీడీఎన్ఏ. ఈ ఆల్గోరిథమ్‌ను రూపొందించడానికి, భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ, పశ్చిమ, మధ్య, తూర్పు, ఈశాన్య జోన్లుగా విభజించారు. ఆయా ప్రాంతాల ఆహారపు అలవాట్లు పరిగణనలోకి తీసుకుని మధుమేహానికి పరిష్కారాలు అన్వేషించాలనేది ఈ విభజన ఉద్దేశం. ఉదాహరణకు.. కేరళలోని తక్కువ ఆదాయ వర్గాల్లో ఎక్కువగా కనిపించే మధుమేహానికి కారణం.. వీరు ఎక్కువ కార్బోహైడ్రేట్, తక్కువ ప్రోటీన్ తీసుకోవడమట. ఆ ప్రాంతంలో కాసావా (కర్ర పెండలం) ఎక్కువగా తీసుకుంటారు. ఈ కాసావా ప్రోటీన్ ద్వారా కాలేయంలో శరీరానికి తగ్గట్టుగా ఫిల్టర్ కావాలి. అయితే శరీరంలో ఉన్న తక్కువ స్థాయి ప్రోటీన్ల కారణంగా ఇది జరగడం లేదు. ఇది ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంథి)లో కాల్షియం ఏర్పడటానికి, అంతిమంగా మధుమేహానికి దారి తీస్తోందని తేల్చారు. ఇలాంటి పలు అధ్యయన ఫలితాల నేపథ్యంలో ప్రాంతాల వారీ డైట్ చార్ట్ (టీడీఎన్ఏ) తయారీ ఆవశ్యకత ఏర్పడింది. అందరూ చేయాల్సిందిదే.. చక్కెర వ్యాధి పెరగడానికి ప్రధాన కారణాల్లో.. ప్రోటీన్లతో పోలిస్తే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్ అధిక వినియోగం వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధుమేహులు టీడీఎన్ఏ పాటించడంతో పాటు ఆహారాన్ని నిదానంగా తీసుకోవడం, అర్ధరాత్రి అత్యధిక కేలరీలతో కూడిన ఆహార వినియోగాన్ని తగ్గించడం, ఎక్కువగా ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లను మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లాంటివి తప్పకుండా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహం విస్తృతి తెలంగాణలో ఎక్కువ ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నివేదిక ప్రకారం, గత మూడు దశాబ్దాలుగా దేశంలో మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య 150% పెరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల విస్తృతి 16.6% కాగా, ముంబై (7.5%), చెన్నై (13.5%), బెంగళూరులో 11.7% మేర పెరుగుదల ఉంది. డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు గుండె జబ్బులు, దృష్టి లోపం, మూత్రపిండాల రుగ్మతలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. మధుమేహం నియంత్రణలో జీవనశైలిలో మార్పులదే కీలక పాత్ర. అలాగే ప్రత్యేకమైన పోషకాహార సప్లిమెంట్స్ కూడా చాలా అవసరం. – డాక్టర్ ఇర్ఫాన్ షేక్, మెడికల్ అఫైర్స్ హెడ్, అబాట్ న్యూట్రిషన్ మన దగ్గర రైస్ వినియోగమే సమస్య డయాబెటిస్ నియంత్రణలో డైట్ అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంత మాత్రాన అందరికీ చపాతి/పుల్కా తినేయమని చెప్పేయడం కుదరదు. తరతరాలుగా, ప్రాంతాల వారీగా అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు మన దగ్గర రైస్ బాగా తీసుకుంటారు. సాధారణ అన్నం లాగే కాకుండా బిర్యానీ, పులిహోర తదితరాల రూపంలో కూడా రైస్ వినియోగం ఎక్కువగా ఉంటోంది. తద్వారా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతున్నాయి. దీనిని తగ్గించడం/నియంత్రించడానికే డైట్ ప్లాన్‌ను ఇస్తుంటాం. ఉదాహరణకు అన్నం మానలేమనేవారికి పరిమాణం తగ్గించమని, రాత్రి పడుకునే ముందు తినే అలవాటున్నవారికి 7 గంటల కల్లా ముగించమని చెబుతుంటా. ఉదయం పూటి ఎక్కువమంది ఇడ్లీ తీసుకుంటారు. కానీ మేం ఇడ్లీ, దోశ బదులు పెసరట్టు తినమంటాం. కాదు కూడదనే ఇడ్లీ ప్రియులకు.. ఇడ్లీ పిండిలో చిక్కుళ్లు, పెసలు, కేరట్ తురుము, రాజ్ మా గింజలు... వంటివి కలుపుకో మంటాం. తద్వారా కార్బ్స్ శాతాన్ని తగ్గించడం, ప్రోటీన్, ఫైబర్‌ని పెంచడానికి ప్రయతి్నస్తాం. – డా.పద్మనాభ వర్మ, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, ఎస్ఎల్జీ హాస్పిటల్స్, హైదరాబాద్ నియంత్రణే ముఖ్యం.. మధుమేహులు దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్న ఆహారపు అలవాట్లను మానుకుని ఆరోగ్యకరమైన ఆహారం వైపు మళ్లక తప్పదు. అయితే దీనికి కట్టుబడి ఉండే రేటు 38% కంటే తక్కువ. ఈ నేపథ్యంలో రోగుల జీవనశైలి, ఆహారపు అలవాట్ల చరిత్రకు అనుగుణంగా రూపొందించే ప్రత్యేకమైన ఆహార జాబితాయే టీడీఎన్ఏ. బరువు తగ్గడం, గ్లైసెమిక్ నియంత్రణ, నిర్వహణలో ఇది రోగికి తోడ్పడుతుంది – డాక్టర్ ఒసామా హమ్డీ, మెడికల్ డైరెక్టర్ జోస్లిన్ డయాబెటిస్ సెంటర్ -
తాగి వాహనాలు నడిపితే..
శ్రీనివాస్, ఇర్ఫాన్, చంటి, మనోహర్, లోహితలు ముఖ్య పాత్రలు చేస్తున్న చిత్రం ‘రా’. రాజ్ డొక్కర దర్శకత్వం వహించి, నిర్మించారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన, అవినాష్, సతీష్ బోట్ల ముఖ్య అతిథులుగా పాల్గొని ‘రా’ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టైటిల్ చాలా కొత్తగా అనిపించింది. ‘రా’ సినిమాలో కంటెంట్ హారర్ కామెడీ, లవ్‌స్టోరీ ఉందని అర్థమవుతోంది. రాజ్ డొక్కర దర్శకత్వం వహిస్తూ, సినిమాని నిర్మించటం గ్రేట్ ’’ అన్నారు. ‘‘ఈ టైటిల్ ఎందుకు పెట్టామనేది ఇంట్రవెల్లో తెలుస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ మెసేజ్ కూడా ఉంటు ంది. 2 పాటలు, రెండు ఫైట్లు మినహా షూటింగ్ పూర్తయింది’’ అన్నారు. -
మోడల్‌తో ప్రేమాయణం..తరచు విదేశీయానం
బంజారాహిల్స్: బెంజ్ కారులో షికారు, ఓ మోడల్‌తో ప్రేమాయణం, తరచూ ఆమెతో కలిసి ఫారిన్ టూర్లు ఇదీ ఘరానా దొంగ లైఫ్ స్టైల్. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో సంపన్నుల నివాసాలను టార్గెట్ చేసుకొని రూ. కోట్లు విలువైన వజ్రాభరణాలు దొంగిలించిన కేసులో నిందితుడు, బీహార్‌కు చెందిన ఘరానా దొంగ ఇర్ఫాన్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మూడురోజుల పాటు కస్టడీ తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా అతడు వెల్లడించిన వివరాలతో పోలీసులు అవాక్కయ్యారు. జూబ్లీహిల్స్‌లో 1, బంజారాహిల్స్‌లో 3 ఇళ్లల్లో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. బంజారాహిల్స్‌లోనే మరో ఇంట్లో చోరీకి యత్నించినట్లు తెలిపాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఇతను ఖరీదైన కార్లలో తిరుగుతూ సంపన్నులు నివాసం ఉంటున్న ప్రాంతాలను ఎంపిక చేసుకొని తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని కొల్లగొట్టేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. నెల రోజుల క్రితం బెంగళూరు పోలీసులు ఇర్ఫాన్ ముఠాను అరెస్టు చేసిన విషయం విదితమే.. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. అనంతరం మూడు రోజుల కస్టడీకి తీసుకొని విచారించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఈ ముఠా పంజా విసిరినట్లుగా తేలింది. ముంబైలో గత నెలలో బెంగళూరు పోలీసులకు చిక్కిన ఇర్ఫాన్‌తో పాటు అతడి డ్రైవర్ మారుఫ్ను కూడా పోలీసులు విచారించారు. వీరిచ్చిన సమాచారంతో నగరంలోని తలాబ్‌కట్టలో వీరికి ఆశ్రయం కల్పించిన ముజఫర్, షాహిద్‌లను అరెస్ట్ చేశారు. వీరితో పాటు బంగారాన్ని కొనుగోలు చేసిన ముంబైకి చెందిన వజ్రాల వ్యాపారులు అంకుర్, రమేష్జోషి, షావిజయలక్ష్మి చంద్, రవీంద్రలను కూడా అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌లో రూ.2కోట్లకు పైగా వజ్రాలను చోరీ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. చోరీ చేసిన సొమ్ములో కొంత తన స్వగ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఓ మోడల్‌ను ప్రేమిస్తున్నానని, ఆమెతో కలిసి తరచూ గోవాతో పాటు విదేశాల్లో పర్యటించినట్లు తెలిపారు. తాను దొంగతనాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా బెంజ్ కారులో ప్రయాణిస్తానని.. అలా అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుందని వెల్లడించారు. సెలబ్రిటీస్ లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడిన ఇర్ఫాన్ చేసిన దొంగతనాలన్నీ సినీ ఫక్కీలోనే ఉంటాయని దర్యాప్తులో తేలింది. చేతివేళ్లకు ఉంగరాలు, మెడలో బంగారు గొలుసు, సూటూ బూటు వేసుకొని బెంజ్‌కారులోనే డ్రైవర్ మారుఫ్తో కలిసి తిరుగుతుంటాడు. ప్రతి నగరంలోనూ తనకు ఆశ్రయం ఇచ్చే వారిని ముందుగానే సిద్ధం చేసుకుంటానని వెల్లడించాడు. ఢిల్లీ, ముంబై నగరాల్లోనే ఎక్కువగా ఉంటున్నట్లు తెలిపాడు. ఆయన లైఫ్‌స్టైల్‌ను తెలుసుకున్న పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. సమాజంలో ధనికుడిగా చలామణి అవుతూ పోలీసుల నిఘా నుంచి తప్పించుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ఘరానా దొంగ.. ఢిల్లీ మోడల్‌తో ప్రేమాయణం
బంజారాహిల్స్: సూటూ, బూటూ.. ఖరీదైన బెంజ్ కారు.. చేతికి బ్రాస్లెట్.. మెడలో గొలుసు.. ఐదు వేళ్లకు ఉంగరాలు.. ఢిల్లీ మోడల్‌తో ప్రేమాయణం.. ఇదీ ఇటీవల బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సంపన్నుల నివాసాల్లో దొంగతనాలకు పాల్పడి బెంగళూరు పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ఘరానా దొంగ ఇర్ఫాన్(30) చరిత్ర. అంతేకాదు బడాబాబుల ఇళ్లల్లో దోచినదాంట్లో కొంతభాగాన్ని పేదల కోసం ఖర్చుపెట్టేవాడు. బెంగళూరు పోలీసులు ఇటీవల ఇర్ఫాన్‌ను ముంబైలో అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా సంచలనాలు వెలుగు చూశాయి. దోచుకున్న సొత్తులో కొంతభాగాన్ని బీహార్‌లోని తన స్వగ్రామంలో వైద్య శిబిరాల కోసం, పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఖర్చుపెడుతున్నట్లు తేలింది. దొంగతనానికి వచ్చినప్పుడు తన బెంజ్‌కారు (హెచ్ఆర్26బీఎం0786)లోనే వస్తున్నట్లు కూడా స్పష్టమైంది. ఈ ఖరీదైన దొంగ వ్యవహారం చూసిన పోలీసులే నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఢిల్లీలోని సంపన్నుల నివాసాల్లో 12 సార్లు దొంగతనాలు చేసి దోచినదాన్ని తాను ప్రేమిస్తున్న మోడల్ కోసం, స్వగ్రామంలో సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నట్లు తేలింది. స్నేహితురాలితో ఖరీదైన నగరాల్లో, బ్యాంకాక్, బాలీద్వీపాల్లో సరదాల కోసం ఖర్చు చేసేందుకు ఇటీవల దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు ఇర్ఫాన్ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీతో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట ప్రాంతాల్లో ఐదు చోట్ల దొంగతనాలు చేయగా అన్ని దొంగతనాలకు ఈ బెంజ్‌కారులోనే వచ్చినట్లుగా తేలింది. ఎమ్మెల్యే కాలనీలో దొంగతనం చేసినప్పుడు ఓ చెట్టుకింద కారును అప్పట్లోనే బంజారాహిల్స్ క్రైం పోలీసులు గుర్తించినా దొంగ ఈ కారులో ఎందుకు వస్తాడులే అనుకుని వదిలేశారు. తాజాగా బెంగళూరు పోలీసుల విచారణలో ఎమ్మెల్యే కాలనీకి దొంగతనానికి తాను బెంజ్‌కారులోనే వెళ్లినట్లుగా చెప్పడంతో ఇక్కడి క్రైం పోలీసులు ఔరా.. అంటూ నోళ్లువెళ్లబెట్టారు. నగరంలో దొంగతనాల చిట్టా... బెంగళూరు పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ఘరానా దొంగ ఇర్ఫాన్‌ను విచారిస్తున్న కొద్ది బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో చేసిన దొంగతనాల చిట్టా బయటికొస్తోంది. తాజాగా ఇర్ఫాన్‌ను విచారించిన అక్కడి పోలీసులకు ఏడాది క్రితం ఎమ్మెల్యే కాలనీలో చేసిన దొంగతనాలతో కూడా సంబంధాలు ఉన్నట్లు తేలింది. బంజారాహిల్స్ రోడ్‌నెం. 2లో మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి సోదరుడి కొడుకు తిక్కవరపు ఉత్తమ్‌రెడ్డి నివాసంలో ఆగస్టు 28న రూ.2 కోట్ల విలువ చేసే ఆభరణాలు దొంగిలించి పరారైన ఘటనలో ఒక వైపు పోలీసులు గాలింపు చేస్తుండగానే నిందితుడు బెంగళూరు పోలీసులకు పట్టుబడ్డాడు. విచారించగా ఉత్తమ్‌రెడ్డి నివాసంతో పాటు గత జూలై 22వ తేదీన జూబ్లీహిల్స్ రోడ్ నెం. 28లో నివసించే విల్లామేరీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఫిలోమినా ఇంట్లో దొంగతనం చేసి రూ.30 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించింది ఇర్ఫాన్‌గా గుర్తించారు. అలాగే గత ఆగస్టు 24వ తేదీన ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో నివసించే జగదీష్ ఇంట్లో రూ.25 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించి పరారైంది కూడా ఇర్ఫానే అని పోలీసులు గుర్తించారు. నెల రోజుల వ్యవధిలోనే ఈ మూడు దొంగతనాలు చేసి పరారైన ఇర్ఫాన్ ఇక్కడి పోలీసులకు సవాల్‌గా మారాడు. ఈ నేపథ్యంలోనే ముంబైలో పోలీసులకు చిక్కాడు. విచారించగా 2018 ఆగస్టు 9వ తేదీన బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు వెంకట్‌రెడ్డి ఇంట్లో రూ.10 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించి మరుసటిరోజే ఎమ్మెల్యే కాలనీలో నివసించే డాక్టర్రామారావు ఇంట్లో రూ.50 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించి పరారైనట్లు విచారణలో తేలింది. హైదరాబాద్‌లో అయిదు చోట్ల చేసిన దొంగతనాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే ఆభరణాలు తస్కరించినట్లు గుర్తించారు. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తలాబ్ కట్టలో నివసించే సన్నిహితుడు సాజిద్, ముజాఫర్‌ల వద్ద ఆశ్రయం పొందేవాడని తేలడంతో ఆ ఇద్దరినీ సీసీఎస్ పోలీసులు రెండు వారాల క్రితం అరెస్ట్ చేశారు. మరింత లోతుగా ఇర్ఫాన్‌ను విచారించగా ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లో మొత్తం 20 దొంగతనాలు చేసినట్లుగా తేలింది. హైదరాబాద్‌లో సీసీఫుటేజీల్లో తన ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్న ఇర్ఫాన్‌ను పట్టుకునేందుకు గత నెల రోజుల నుంచి నగర పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండగానే బెంగళూరులో పట్టుబడ్డ ఓ దొంగద్వారా అక్కడిపోలీసులు ముంబైలో తలదాచుకున్న ఇర్ఫాన్‌ను చాకచక్యంగా పట్టుకోవడంతో నేరాల చిట్టా బయటపడింది. ప్రస్తుతం ఇర్ఫాన్ బెంగళూరు పోలీసులు లోతుగా విచారిస్తూ ఇంకా ఎక్కడెక్కడ దొంగతనాలు చేసింది ఆరా తీస్తున్నారు. -
ఆభరణాలు కనిపిస్తే అంతే!
హైదరాబాద్: హైదరాబాద్‌లోని సంపన్నుల నివాసాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే వజ్రాభరణాలు దొంగతనం చేసి పరారైన ఘరానా దొంగ ఇర్ఫాన్ (35) ఎట్టకేలకు బెంగళూరు పోలీసులకు చిక్కాడు. ఈ మోస్ట్ వాంటెడ్ దొంగను విచారిస్తున్న కొద్దీ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో చేసిన దొంగతనాల చిట్టా బయటికొస్తున్నది. తాజాగా ఇర్ఫాన్‌ను విచారించిన అక్కడి పోలీసులకు ఏడాది క్రితం ఎమ్మెల్యే కాలనీలో చేసిన దొంగతనాలతో కూడా ఇర్ఫాన్‌కు సంబంధాలు ఉన్నట్లు తెలిసింది.మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి సోదరుడి కొడుకు తిక్కవరపు ఉత్తమ్‌రెడ్డి నివాసంలో ఆగస్టు 28వ తేదీన రూ.2 కోట్ల విలువ చేసే ఆభరణాలు దొంగిలించి పరారైన ఘటనలో, ఒక వైపు పోలీసులు గాలింపు చేస్తున్న క్రమంలోనే నిందితుడు బెంగళూరు పోలీసులకు ఈ నెల 1న ముంబైలో పట్టుబడ్డాడు. విచారించగా ఉత్తమ్‌రెడ్డి నివాసంతో పాటు గత జూలై 22వ తేదీన జూబ్లీహిల్స్ రోడ్ నెం. 28లో నివసించే విల్లామేరీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఫిలోమినా ఇంట్లో దొంగతనం చేసి రూ.30 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించింది కూడా ఇర్ఫాన్‌గా గుర్తించారు. అలాగే గత ఆగస్టు 24వ తేదీన ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో నివసించే జగదీశ్ ఇంట్లో రూ.25 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించింది కూడా అతడే అని విచారణలో తేలింది. నెల రోజుల వ్యవధిలోనే ఈ మూడు దొంగతనాలు చేసి పరారైన ఇర్ఫాన్ ఇక్కడి పోలీసులకు సవాల్‌గా మారాడు. 2018 ఆగస్టు 9వ తేదీన బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సోదరుడు వెంకట్‌రెడ్డి ఇంట్లో రూ.10 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించి ఒక రోజు గడవకముందే, 2018 ఆగస్టు 10వ తేదీన ఎమ్మెల్యే కాలనీలో నివసించే డాక్టర్ రామారావు ఇంట్లో రూ.50 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించి పరారైనట్లు విచారణలో తేలింది. పీటీ వారెంట్‌తో రప్పించేలా.. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తలాబ్ కట్టలో నివసించే స్నేహితులు సాజిద్, ముజఫర్ల వద్ద ఆశ్రయం పొందేవాడని తేలడంతో ఆ ఇద్దరినీ సీసీఎస్ పోలీసులు వారం క్రితం అరెస్ట్ చేశారు. మరింత లోతుగా ఇర్ఫాన్‌ను విచారించగా ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లో మొత్తం 12 దొంగతనాలు చేసినట్లుగా తేలింది. హైదరాబాద్‌లో చేసిన దొంగతనాల్లో సీసీ కెమెరాల్లో ముఖం కనిపించకుండా ఇర్ఫాన్ జాగ్రత్తలు తీసుకున్నాడు. బెంగళూరులో పట్టుబడ్డ ఓ దొంగద్వారా అక్కడి పోలీసులు ముంబైలో తలదాచుకున్న ఇర్ఫాన్‌ను చాకచక్యంగా పట్టుకోవడంతో నేరాల చిట్టా బయటపడింది. ప్రస్తుతం ఇర్ఫాన్‌ను బెంగళూరు పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కాలనీలో రెండు చోట్ల దొంగతనం చేసిన విషయాన్ని రెండు రోజుల క్రితమే ఇర్ఫాన్ వెల్లడించగా, నగరంలో ఇంకా ఎక్కడెక్కడ భారీ దొంగతనాలు జరిగాయన్నదానిపై పోలీసులు ఆరా తీస్తూనే ఆ వివరాలను బెంగళూరు పోలీసులకు అందిస్తున్నారు. బెంగళూరు పోలీసులు ఇర్ఫాన్‌ను రిమాండ్‌కు తరలించగానే, హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పీటీ వారెంట్ జారీ చేసి నిందితుడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఇక్కడి దొంగతనాలపై విచారణ ప్రారంభించనున్నారు. మొత్తానికి ఈ గజదొంగ పోలీసులకు చిక్కడంతో నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
టోక్యో ఒలింపిక్స్‌కు ఇర్ఫాన్ అర్హత
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రేస్ వాకర్ కేటీ ఇర్ఫాన్ నిలిచాడు. ఆదివారం జపాన్ లోని నోమిలో జరిగిన ఆసియా రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్‌లో ఇర్ఫాన్ 20 కిలోమీటర్ల నడక విభాగంలో నాలుగో స్థానంలో నిలిచాడు. అతను 20 కిలో మీటర్ల దూరాన్ని గంటా 20 నిమిషాల 57 సెకన్లలో పూర్తి చేసి టోక్యో ఒలింపిక్స్ అర్హత ప్రమాణాన్ని (గంటా 21 నిమిషాలు) అధిగమించాడు. అంతేకాకుండా సెప్టెంబర్–అక్టోబర్‌లో దోహా వేదికగా జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు (అర్హత ప్రమాణం: గంటా 22 నిమిషాల 30 సెకన్లు) కూడా ఇర్ఫాన్ అర్హత పొందాడు. భారత్‌కే చెందిన మరో ఇద్దరు వాకర్లు దేవిందర్ సింగ్ (గంటా 21ని.22 సెకన్లు), గణపతి కృష్ణన్ (గంటా 22ని.12 సెకన్లు) కూడా ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు బెర్త్‌లు దక్కించుకున్నారు. కేరళకు చెందిన 29 ఏళ్ల ఇర్ఫాన్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో పదో స్థానాన్ని పొందాడు. -
జీతం అడిగితే చేయి నరికేసింది..!
లాహోర్: వేతనం అడిగినందుకు 13 ఏళ్ల బాలుడి చేయి నరికేసిన సంఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో చోటు చేసుకుంది. గత వారం ఈ ఘటన జరగ్గా.. తాజాగా బాలుడు ఇర్ఫాన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సఫ్దరాబాద్లో నివాసముంటున్న షఫ్కాత్ బిబీ ఇంట్లో నెలకు రూ.3 వేల వేతనానికి ఇర్ఫాన్ పనిలో చేరాడు. పనిలో చేరి నెల రోజులు పూర్తి కావడంతో వేతనం ఇవ్వాలంటూ ఇర్ఫాన్ బీబీని కోరాడు. కోపగించుకున్న ఆమె జీతం అడగడం కాదు.. పని ఎలా చేయాలో తెలుసుకో.. అంటూ పచ్చి గడ్డిని నరకడానికి ఉపయోగించే మిషన్‌లో బాలుడి చేయి పెట్టింది. దీంతో బాలుడి చేయి తెగి పోయింది. బీబీపై కేసు నమోదు చేయడానికి పోలీసులు అంగీకరించకపోవడంతో బాధితుడి తల్లి స్ధానిక న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. నిందితురాలు, ఆమె ఇద్దరు సోదరులపై కేసు నమోదు చేయాలనే కోర్టు తీర్పుతో కదిలిన పోలీసులు వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పంజాబ్ ప్రావిన్సు ముఖ్యమంత్రి తనకు ఓ రిపోర్టు ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. బాలుడిన వేధించిన వారందరిని చట్టం శిక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు. -
ఇర్ఫాన్‌కు కాంస్య పతకం
న్యూఢిల్లీ: ఆసియా రేస్ వాక్ చాంపియన్‌షిప్‌లో భారత వాకర్ కె.టి.ఇర్ఫాన్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఆదివారం జపాన్‌లో జరిగిన ఈ ఈవెంట్లో ఇర్ఫాన్ పురుషుల 20 కిలోమీటర్ల నడక విభాగంలో మూడో స్థానాన్ని సంపాదించాడు. కేరళకు చెందిన ఇర్ఫాన్ గంటా 20 నిమిషాల 59 సెకన్లలో గమ్యానికి చేరుకున్నాడు. కిమ్ హున్ సబ్ (కొరియా–1గం: 19ని: 50 సెకన్లు) స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా... జార్జీ షీకో (కజకిస్తాన్–1గం: 20ని: 47 సెకన్లు) రజత పతకాన్ని దక్కించుకున్నాడు. మహిళల 20 కిలోమీటర్ల విభాగంలో భారత్‌కు చెందిన ప్రియాంక గంటా 37 నిమిషాల 42 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. -
ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
హిందూపురం రూరల్ : మండలంలోని పూలకుంటలో ఇర్ఫాన్(22) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్ఐ ఆంజనేయులు గురువారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పూలకుంటకు చెందిన ఇర్ఫాన్ కూలి పనులకు వెళ్లకుండా నెల రోజులుగా ఖాళీగా ఉండటంతో అతడి తల్లి సహినా మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఇర్ఫాన్ గురువారం ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూలి పనుల నుంచి తల్లి సహినా, అన్న సత్తార్ ఇంటికి వచ్చి చూసే సరికి తలుపులు ఎంతకీ తెరవలేదు. అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పానీపూరీల కోసం ప్రాణాలు తీశారు!
న్యూఢిల్లీ: పానీపూరీలు ఎవరు ముందు కొనాలనేదానిపై మాటామాటా పెరిగి ఓ వ్యక్తిని హత్య చేసేవరకు వెళ్లింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఆగస్టు 4న వాయవ్య ఢిల్లీలోని భలాస్వా డైరీ ప్రాంతంలో జరిగింది. భలాస్వా ప్రాంతంలోని సింఘానియా గ్లాస్ గోదాము సమీపంలోని కచ్చీ గల్లీలో ఓ వ్యక్తి అపస్మాకర స్థితిలో పడిపోయి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు అతణ్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు డాక్టరు తెలిపారు. చనిపోయిన వ్యక్తి రాజీవ్ నగర్ కు చెందిన ఇర్ఫాన్ గా పోలీసులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు అతనిని మోటారుసైకిల్‌పై తీసుకొచ్చి గల్లీలో పడేసి వెళ్లిపోయారని దర్యాప్తులో తేలింది. వాళ్లే ఇర్ఫాన్ ను హత్యచేసి ఉంటారని అనుమానించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. హత్య జరిగిన రోజు.. ఇర్ఫాన్, అతణ్ని చంపిన ఇద్దరు వ్యక్తులు ఓ పానీ పూరీ బండి దగ్గర తగువులాడుకున్నారు. పానీ పూరీ ఎవరికి ముందు ఇవ్వాలనే విషయమై జరిగిన గొడవలో బైక్ మీద వచ్చిన ఇద్దరూ ఇర్ఫాన్ ను కొట్టి చంపారు. సమీపంలోని సీసీటీవీల దృశ్యాల ఆధారంగా సునీల్ కుమార్(22), లక్కీ(21) అనే యువకులను పోలీసులు అరెస్టుచేశారు. -
స్ట్రీట్ ఫైట్‌లో యువకుడు మృతి
హైదరాబాద్: పాతబస్తిలో స్ట్రీట్ ఫైట్ మరో యువకున్ని బలితీసుకుంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తరహాలో ఆదివారం జరిగిన స్ట్రీట్ ఫైట్ లో ఇర్ఫాన్ అనే యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఓల్డ్ సిటీలోని రెయిన్ బజార్లో చోటు చేసుకుంది. రెయిన్ బజార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఇర్ఫాన్‌తో ఫైట్ చేసిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు సమాచారం. ప్రెండ్లీగా స్ట్రీట్ ఫైట్ చేశారా లేక బెట్టింగ్‌కు పాల్పడ్డారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇర్ఫాన్ పెట్రోల్ బంక్‌లో పని చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. ఇదే తరహాలో నబిల్ అనే యువకుడు స్ట్రీట్ ఫైట్ చేస్తూ మృతి చెందిన విషయం తెలిసిందే. గత ఏడాదిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో బయటకు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. -
ఇర్ఫాన్ అయ్యాడు శంకర్!
హైదరాబాదీ పేరుతో బెంగళూరు వాసి ఎత్తుగడ ఐదేళ్లుగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగం ఇంటర్వ్యూకు వెళ్లి వేరే వారి సర్టిఫికెట్లు చోరీ గుట్టురట్టు చేసి ‘బ్యాంకు రుణం’ దరఖాస్తు సిటీబ్యూరో: సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేరే కనీస అర్హత లేని ఇర్ఫాన్ అనే ఓ వ్యక్తి ప్రముఖ సంస్థలో రవి శంకర్ శర్మ పేరుతో క్వాలిటీ మేనేజర్‌గా మారాడు. అదెలా సాధ్యమైంది? చివరకు ఏ రకంగా గుట్టురట్టైంది? బెంగళూరులో జరిగిన ఈ వ్యవహారంతో అసలు మన నగరానికి సంబంధం ఏమిటి..? ఈ ప్రశ్నలకు జవాబులతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం... గోవా నుంచి వచ్చి బెంగళూరులో... బెంగళూరు ఆర్టీ నగర్ పరిధిలోని గంగానగర్‌లో నివసిస్తున్న మహ్మద్ ఇర్ఫాన్ స్వస్థలం గోవా. పదో తరగతి పూర్తయ్యాక డిప్లమో కోర్సులో చేరిన ఇతగాడు ఆర్థిక కారణాలతో డ్రాప్ఔట్గా మారాడు. బతుకుతెరువు కోసం తన తల్లితో కలిసి కర్ణాటకకు వలస వచ్చి బెం గళూరులో స్థిరపడ్డాడు. పూర్తై పదో తరగతి, పూర్తి కాని డిప్లమోకు సంబంధిం చిన సర్టిఫికెట్లతో బెంగళూరులో ఉద్యోగ వేట ప్రారంభించాడు. కనీస విద్యార్హతలు లేకపోవడంతో సుదీర్ఘకాలం ప్రయత్నించినా ఎక్కడా ప్లేస్మెంట్ లభించలేదు. అయినా ఇంటర్వ్యూలకు వెళ్లడం మాత్రం మానుకోలేదు. సర్టిఫికెట్లు తస్కరించి రవి శంకర్‌గా.. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఉన్నతోద్యోగం చేస్తున్న రవి శంకర్ శర్మ 2008లో బెంగళూరులో ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇదే ఇం టర్వ్యూకు వచ్చిన ఇర్ఫాన్.. రవి శంకర్‌తో మాటలు కలిపాడు. ఇద్దరూ కలిసి కాఫీ తాగడానికి బయటకు వెళ్లినప్పుడు అదును చూసుకుని శంకర్‌కు చెందిన సర్టిఫికెట్లు, ఇతర యోగ్యతా పత్రాలను ఇర్ఫాన్ తస్కరించాడు. తిరిగి వచ్చిన రవి శంకర్ ఆయా విద్యా సంస్థల నుంచి డూప్లికేట్ పత్రాలు తీసుకున్నారు. శంకర్ పత్రాలను తస్కరించిన ఇర్ఫాన్ వాటిపై తన ఫొటోలను పెట్టి ఫోర్జరీ పత్రాలు రూపొందించాడు. వీటి ఆధారంగా తన పేరు రవి శంకర్ శర్మ అంటూ 2010లో బెంగళూరులోని ఎంఫసిస్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. ఆ తరవాత మరో ప్రముఖ సంస్థ కన్వర్గైస్ ఇండియా సర్వీసెస్ లిమిటెడ్‌లో క్వాలిటీ మేనేజర్‌గా చేరాడు. సీఐబీఐఎల్ డేటాబేస్ ఆధారంగా... తన పేరిట మరెవరో క్రెడిట్‌కార్డులు, బ్యాంకు రుణం తీసుకున్నారని గుర్తిం చిన రవి శంకర్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ (సీఐబీఐఎల్)ను ఆశ్రయించారు. బ్యాంకు రుణాల డిఫాల్టర్ల డేటాబేస్‌ను పర్యవేక్షించే ఈ సంస్థ బెంగళూరులో రుణం తీసుకున్నట్లు సమాచారం ఇచ్చింది. ఈ విషయాన్ని బాధితుడు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు బెంగళూరులోని సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు రుణం, క్రెడిట్ కార్డుల చెల్లిం పులు కన్వర్గైస్ ఇండియా సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఓ శాలరీ అకౌంట్ నుంచి జరిగినట్లు గుర్తించిన సీసీబీ ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. దీంతో అతడు అన్ని విషయాలు బయటపెట్టడంతో గతనెల 14న అరెస్టు చేసింది. అసలు పేరుతో ఉన్న ఓటర్ ఐడీ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరులోని మైకో లేఔట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.