ఘరానా దొంగ.. ఢిల్లీ మోడల్‌తో ప్రేమాయణం | Most Wanted Thief Irfan Arrest in Mumbai | Sakshi
Sakshi News home page

బెంజ్‌లో వచ్చి దర్జాగా దోచి..

Published Sun, Oct 20 2019 7:57 AM | Last Updated on Sun, Oct 20 2019 7:57 AM

Most Wanted Thief Irfan Arrest in Mumbai - Sakshi

ఘరానా దొంగ ఇర్ఫాన్‌

బంజారాహిల్స్‌: సూటూ, బూటూ.. ఖరీదైన బెంజ్‌ కారు.. చేతికి బ్రాస్‌లెట్‌.. మెడలో గొలుసు.. ఐదు వేళ్లకు ఉంగరాలు.. ఢిల్లీ మోడల్‌తో ప్రేమాయణం.. ఇదీ ఇటీవల బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ సంపన్నుల నివాసాల్లో దొంగతనాలకు పాల్పడి బెంగళూరు పోలీసులకు చిక్కిన మోస్ట్‌ వాంటెడ్‌ ఘరానా దొంగ ఇర్ఫాన్‌(30) చరిత్ర. అంతేకాదు బడాబాబుల ఇళ్లల్లో దోచినదాంట్లో కొంతభాగాన్ని పేదల కోసం ఖర్చుపెట్టేవాడు. బెంగళూరు పోలీసులు ఇటీవల ఇర్ఫాన్‌ను ముంబైలో అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా సంచలనాలు వెలుగు చూశాయి. దోచుకున్న సొత్తులో కొంతభాగాన్ని బీహార్‌లోని తన స్వగ్రామంలో వైద్య శిబిరాల కోసం, పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఖర్చుపెడుతున్నట్లు తేలింది. దొంగతనానికి వచ్చినప్పుడు తన బెంజ్‌కారు (హెచ్‌ఆర్‌26బీఎం0786)లోనే వస్తున్నట్లు కూడా స్పష్టమైంది. ఈ ఖరీదైన దొంగ వ్యవహారం చూసిన పోలీసులే నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఢిల్లీలోని సంపన్నుల నివాసాల్లో 12 సార్లు దొంగతనాలు చేసి దోచినదాన్ని తాను ప్రేమిస్తున్న మోడల్‌ కోసం, స్వగ్రామంలో సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నట్లు తేలింది. స్నేహితురాలితో ఖరీదైన నగరాల్లో, బ్యాంకాక్, బాలీద్వీపాల్లో సరదాల కోసం ఖర్చు చేసేందుకు ఇటీవల దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు ఇర్ఫాన్‌ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీతో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట ప్రాంతాల్లో ఐదు చోట్ల దొంగతనాలు చేయగా అన్ని  దొంగతనాలకు ఈ బెంజ్‌కారులోనే వచ్చినట్లుగా తేలింది. ఎమ్మెల్యే కాలనీలో దొంగతనం చేసినప్పుడు ఓ చెట్టుకింద కారును అప్పట్లోనే బంజారాహిల్స్‌ క్రైం పోలీసులు గుర్తించినా దొంగ ఈ కారులో ఎందుకు వస్తాడులే అనుకుని వదిలేశారు. తాజాగా బెంగళూరు పోలీసుల విచారణలో ఎమ్మెల్యే కాలనీకి దొంగతనానికి తాను బెంజ్‌కారులోనే వెళ్లినట్లుగా చెప్పడంతో ఇక్కడి క్రైం పోలీసులు ఔరా.. అంటూ నోళ్లువెళ్లబెట్టారు. 

నగరంలో దొంగతనాల చిట్టా...
బెంగళూరు పోలీసులకు చిక్కిన మోస్ట్‌ వాంటెడ్‌ ఘరానా దొంగ ఇర్ఫాన్‌ను విచారిస్తున్న కొద్ది బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో చేసిన దొంగతనాల చిట్టా బయటికొస్తోంది. తాజాగా ఇర్ఫాన్‌ను విచారించిన అక్కడి పోలీసులకు ఏడాది క్రితం ఎమ్మెల్యే కాలనీలో చేసిన దొంగతనాలతో కూడా సంబంధాలు ఉన్నట్లు తేలింది. బంజారాహిల్స్‌ రోడ్‌నెం. 2లో మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి సోదరుడి కొడుకు తిక్కవరపు ఉత్తమ్‌రెడ్డి నివాసంలో ఆగస్టు 28న రూ.2 కోట్ల విలువ చేసే ఆభరణాలు దొంగిలించి పరారైన ఘటనలో ఒక వైపు పోలీసులు గాలింపు చేస్తుండగానే నిందితుడు బెంగళూరు పోలీసులకు  పట్టుబడ్డాడు. విచారించగా ఉత్తమ్‌రెడ్డి నివాసంతో పాటు గత జూలై 22వ తేదీన జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 28లో నివసించే విల్లామేరీ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఫిలోమినా ఇంట్లో దొంగతనం చేసి రూ.30 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించింది ఇర్ఫాన్‌గా గుర్తించారు. అలాగే గత ఆగస్టు 24వ తేదీన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో నివసించే జగదీష్‌ ఇంట్లో రూ.25 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించి పరారైంది కూడా ఇర్ఫానే అని పోలీసులు గుర్తించారు. నెల రోజుల వ్యవధిలోనే ఈ మూడు దొంగతనాలు చేసి పరారైన ఇర్ఫాన్‌ ఇక్కడి పోలీసులకు సవాల్‌గా మారాడు.

ఈ నేపథ్యంలోనే ముంబైలో పోలీసులకు చిక్కాడు. విచారించగా 2018 ఆగస్టు 9వ తేదీన బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి సోదరుడు వెంకట్‌రెడ్డి ఇంట్లో రూ.10 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించి  మరుసటిరోజే ఎమ్మెల్యే కాలనీలో నివసించే డాక్టర్‌రామారావు ఇంట్లో రూ.50 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించి పరారైనట్లు విచారణలో తేలింది. హైదరాబాద్‌లో అయిదు చోట్ల చేసిన దొంగతనాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే ఆభరణాలు తస్కరించినట్లు గుర్తించారు. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తలాబ్‌ కట్టలో నివసించే సన్నిహితుడు సాజిద్, ముజాఫర్‌ల వద్ద ఆశ్రయం పొందేవాడని తేలడంతో ఆ ఇద్దరినీ సీసీఎస్‌ పోలీసులు రెండు వారాల క్రితం అరెస్ట్‌ చేశారు. మరింత లోతుగా ఇర్ఫాన్‌ను విచారించగా ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లో మొత్తం 20 దొంగతనాలు చేసినట్లుగా తేలింది. హైదరాబాద్‌లో సీసీఫుటేజీల్లో తన ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్న ఇర్ఫాన్‌ను పట్టుకునేందుకు గత నెల రోజుల నుంచి నగర పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండగానే బెంగళూరులో పట్టుబడ్డ ఓ దొంగద్వారా అక్కడిపోలీసులు ముంబైలో తలదాచుకున్న ఇర్ఫాన్‌ను చాకచక్యంగా పట్టుకోవడంతో నేరాల చిట్టా బయటపడింది. ప్రస్తుతం ఇర్ఫాన్‌ బెంగళూరు పోలీసులు లోతుగా విచారిస్తూ ఇంకా ఎక్కడెక్కడ దొంగతనాలు చేసింది ఆరా తీస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement