ఇటీవలి కాలంలో ఆహారం, ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరుగుతోంది. ఈ క్రమంలో ఆర్గానిక్ ఫుడ్, మిలెట్స్‌పై మరింత ఆసక్తి చూపిస్తున్నారు జనం. అలాంటి వాటిల్లో ఒకటి రాగులు లేదా ఫింగర్ మిల్లెట్స్. దీనిలోని ప్రయోజనాల కారణంగా మరింత ప్రజాదరణ పొందాయి. చవకగా దొరుకుతాయి కూడా. రాగుల జావ లేదా మాల్ట్ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం!
జీర్ణశక్తిని పెంచుకోవాలనుకున్నా, మధుమేహాన్ని తట్టుకోవాలనుకున్నా, లేదా మీ ఆహారాన్ని మరింత ఉత్సాహంగా మార్చుకోవాలనుకున్నా, అవసరమైన అన్ని పోషకాలతో నిండిన సూపర్‌ఫుడ్ రాగుల పిండితో చేసుకొనే జావ.
రాగుల లడ్డు, రాగుల పిండితో మురుకులు ఇలా రాగులతో తయారు చేసే పదార్థాల్లో రాగిజావ, రాగి ముద్ద బాగా పాపులర్. రాగి జావ తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలనుంచి విముక్తి లభిస్తుంది. సీ, ఈ విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్‌లు, కొవ్వులు, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తాయి. బి కాంప్లెక్స్, థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి.
రాగి జావతో ఆరోగ్య ప్రయోజనాలు
జీర్ణక్రియకు మంచిది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. రాగిజావలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతినిస్తుంది. ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి.
మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. రాగి జావలో పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్,మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రిస్తాయి. గుండె కండరాల పనితీరు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
రాగి జావ సహజ ఇనుముకు గొప్ప మూలం. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.
ఎముకలు బలోపేతం: రాగుల్లో కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. దంతాల అభివృద్ధికి సహాయపడుతుంది.
అధిక బరువుకు చెక్ చెబుతుంది. కాలేయ వ్యాధులను తగ్గిస్తుంది.
రాగి జావ తయారీ
రాగులను శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని పొడి చేసుకోవాలి. మరుగుతున్న ఒక గ్లాసు నీళ్లలో, ఒక టీ స్పూన్ రాగుల పిండి వేసి, కలుపుతూ ఉడికించుకోవాలి. దీనికి మజ్జగ, ఉప్పు కలుపుకొని తాగవచ్చు. లేదా పచ్చిమిర్చి ఉల్లిపాయల ముక్కలతో కలిపి తాగవచ్చు. బెల్లం, నెయ్యి వేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తాగుతారు. రాగులను మొలకలు వచ్చేలా చేసి, వాటిని ఎండబెట్టి, పొడి చేసుకొని కూడా జావ చేసుకోవచ్చు. ఈ పొడిని తడిలేని గాజు సీసాలో భద్రం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment