మేము సైతం..! ఆటల్లో సత్తా చాటుతున్న నారీమమణులు | Women's Day 2025: The Great Women Who Made History In The Sports World | Sakshi
Sakshi News home page

మేము సైతం..! ఆటల్లో సత్తా చాటుతున్న నారీమమణులు

Published Fri, Mar 7 2025 10:49 AM | Last Updated on Fri, Mar 7 2025 11:03 AM

Women's Day 2025: The Great Women Who Made History In The Sports World

ఒకప్పుడు క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రం. ఇప్పుడు సీన్‌ మారింది. ప్రాతినిధ్యం స్థాయి నుంచి ఎదిగి ఏకంగా దేశానికి పతకాలు అందించే స్థాయికి మన మహిళా క్రీడాకారిణులు చేరుకున్నారు. వయసుతో సంబంధం లేకుండా... ఒకవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే... మరోవైపు ప్రతికూలతలనూ అధిగమిస్తూ అత్యున్నత శిఖరానికి చేరుకుంటున్నారు. నిరంతర శ్రమ, సడలని విశ్వాసం, సాధించాలనే సంకల్పం ఉంటే తమకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. తమ ప్రతిభాపాటవాల ద్వారా భావితరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు... వారిలో కొందరి గురించి....

నూషిన్‌ అల్‌ ఖదీర్‌... 
మంచి ప్లేయర్‌ మంచి కోచ్‌ కూడా కాగలరని నిరూపించారు నూషిన్‌ అల్‌ ఖదీర్‌. 44 ఏళ్ల నూషిన్‌ గత నెలలో మలేసియాలో జరిగిన అండర్‌–19 మహిళల టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించారు. 2023లోనూ తొలిసారి జరిగిన అండర్‌–19 మహిళల టి20 ప్రపంచకప్‌లో నూషిన్‌ శిక్షణలోనే టీమిండియా జగజ్జేతగా అవతరించింది.

కర్ణాటకలోని గుల్బర్గాలో జన్మించి, ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన నూషిన్‌ 2002 నుంచి 2012 వరకు భారత సీనియర్‌ మహిళల క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 5 టెస్టులు, 78 వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌ల్లో భారత్‌ తరఫున బరిలోకి దిగింది. 2005లో ఆటకు వీడ్కోలు చె΄్పాక నూషిన్‌ కోచింగ్‌ వైపు వచ్చింది. నూషిన్‌ శిక్షణలో భారత టీనేజ్‌ క్రికెటర్లు వరుసగా రెండు టి20 ప్రపంచకప్‌లలో విజేతగా నిలిచి ఔరా అనిపించారు.

కోనేరు హంపి... 
రెండున్నర దశాబ్దాలుగా భారత మహిళల చెస్‌కు ముఖచిత్రంగా వెలుగుతూ ఎన్నో గొప్ప విజయాలు సాధించింది విజయవాడకు చెందిన 37 ఏళ్ల హంపి. రెండుసార్లు ప్రపంచ మహిళల ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 

2019లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది. మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లలో పతకాలు గెలవడం అలవాటు చేసుకున్న హంపి 2024 డిసెంబర్‌లో కజకిస్తాన్‌లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఓఎన్‌జీసీలో చీఫ్‌ మేనేజర్‌ అయిన హంపి క్లాసిక్‌ ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ సాధించడమే లక్ష్యం అంటోంది.

జ్యోతి సురేఖ
భారత మహిళల ఆర్చరీ కాంపౌండ్‌ విభాగంలో తిరుగులేని ప్లేయర్‌ వెన్నం జ్యోతి సురేఖ. విజయవాడకు చెందిన 28 ఏళ్ల జ్యోతి సురేఖ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో  రెండో ర్యాంక్‌లో ఉంది. 

14 ఏళ్లుగా అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జ్యోతి సురేఖ 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి సురేఖ  ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచకప్‌ టోర్నీలలో కలిపి 50 పతకాలు సాధించింది. 

జ్యోతి యర్రాజీ
పాఠశాలలో వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు ఇచ్చిన సలహాతో అథ్లెటిక్స్‌ లో అడుగు పెట్టి.. అచిరకాలంలోనే అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది వైజాగ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ. 100 మీటర్లు, 60 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డులు లిఖించుకున్న జ్యోతి యర్రాజీ 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. 

ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో భారత్‌ తరఫున పోటీపడ్డ తొలి మహిళా అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు పొందింది. అదే ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో ఆమెకు కాంస్య పతకం లభించింది. దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్‌ క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి వరుసగా మూడుసార్లు జాతీయ క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. 2024 సంవత్సరానికి కేంద్రం నుంచి జ్యోతికి ‘అర్జున అవార్డు’ లభించింది. 

గుగులోత్‌ సౌమ్య... 
జట్టు క్రీడ ఫుట్‌బాల్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే విశేష ప్రతిభ ఉండాల్సిందే. ఆ నైపుణ్యాన్ని సొంతం చేసుకొని భారత సీనియర్‌ మహిళల ఫుట్‌బాల్‌ జట్టులో ఫార్వర్డ్‌గా రాణిస్తోంది గుగులోత్‌ సౌమ్య. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 23 ఏళ్ల సౌమ్య అండర్‌–14, అండర్‌–16, అండర్‌–19 విభాగాల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.  

ప్రస్తుతం దేశవాళీ మహిళల ఫుట్‌బాల్‌ లీగ్‌లో విఖ్యాత ఈస్ట్‌ బెంగాల్‌ క్లబ్‌ జట్టుకు ఆడుతున్న సౌమ్య ఇటీవలే షార్జాలో జరిగిన పింక్‌ లేడీస్‌ కప్‌ నాలుగు దేశాల అంతర్జాతీయ టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.  

ఆకుల శ్రీజ
టేబుల్‌ టెన్నిస్‌లో భారత నంబర్‌వన్‌ ర్యాంకర్‌ ఆకుల శ్రీజ 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. గత ఏడాది కజకిస్తాన్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో టీమ్‌ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన 26 ఏళ్ల శ్రీజ... వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) సర్క్యూట్‌లో కంటెండర్‌ స్థాయి టోర్నీలో టైటిల్‌ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. 

గత ఏడాది జూన్‌లో నైజీరియాలో జరిగిన లాగోస్‌ ఓపెన్‌ కంటెండర్‌ టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. గతేడాది జరిగిన ప్రపంచ టీమ్‌ చాంపియన్‌షిప్‌ లీగ్‌ మ్యాచ్‌లో చైనాకు చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్‌ వాంగ్‌ యిడిపై సంచలన విజయం సాధించింది. 2022లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున అవార్డు’ అందుకుంది. 

కరణం నారాయణ, సాక్షి స్పోర్ట్స్‌ డెస్క్‌ 

(చదవండి: 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement