ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌ల పేరుతో ఇతరులను హింసించి పైశాచికత్వాన్ని పొందుతున్న విద్యార్థుల ముఠాను మదురై ప్రభుత్వ వైద్య కళాశాలలో గుర్తించారు. వీరి భరతం పట్టేందుకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ మరుదు పాండియన్ సిద్ధం అయ్యారు. 20 మందిని గుర్తించి సస్పెండ్ చేశారు. పరీక్షలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చారు.
సాక్షి, చెన్నై: వర్సిటీలు, కళాశాలల్లో గతంలో చోటుచేసుకున్న సంఘటనల్ని పరిగణించి ర్యాగింగ్‌ను నిషేధిస్తూ పాలకులు చట్టం తీసుకొచ్చారు. అయితే, చట్టం అమల్లో విఫలమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కళాశాలు ప్రారంభమయితే చాలు ఈవ్ టీజర్లు రంగంలోకి దిగడం సాధారణంగా మారింది. బస్టాపులు, కళాశాల సమీపాల్లో , రైల్వే స్టేషన్లలో విద్యార్థినులు కన్పిస్తే చాలు డొంకతిరుగుడు మాటలతో వేధించే వాళ్లు ఎక్కువే. ఇలాంటి టీజర్ల భరతం పట్టేందుకు పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగాల్సిందే. మహిళా పోలీసుల్ని మఫ్టీలో మాటేసినా, ఆ హడావుడి మూణ్ణాళ్ల ముచ్చటగా మారుతోంది. పోలీసుల ధోరణి ఫిర్యాదులు వస్తేనే, తాము స్పందిస్తామన్నట్టుగా ఉంది. కళాశాలల విషయానికి వెళ్తే, జూనియర్లను సీనియర్లు వేధించడం ప్రతిఏటా వెలుగు చూస్తున్నాయి. ర్యాగింగ్ నియంత్రణకు కళాశాల, వర్సిటీల స్థాయిలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినా, హాస్టళ్లు, బయటి ప్రాంతాల్లో జూనియర్లను వేధించే సీనియర్లు అనేక మంది ఉన్నారు. కొన్ని ర్యాంగింగ్ సంఘటనలు వెలుగులోకి వస్తుండగా, కొందరు విద్యార్థులు సీనియర్లకు భయపడి ముందుకు రావడం లేదు. ఇంకొందరు తమ ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. కొన్ని చోట్ల సరదాగా సాగే టీజింగ్,వివాదాలకు సైతం దారితీస్తున్నాయి.
వైద్య కళాశాలలు ప్రారంభం
‘ఒక విద్యార్థిని అవమానపర్చడం, మానసికంగా దెబ్బతీయడం, భయందోళనకు గురిచేయడం, బెదిరించడం లేదా గాయపడే పరిస్థితి కల్పించడం.’ వంటివి ర్యాగింగ్‌గా పరిగణించవచ్చు. ఇక, ర్యాగింగ్ నిరోధించాల్సిన బాధ్యత కళాశాల ప్రిన్సిపాల్ లేక యాజమ్యాన్యానిది. చట్టం ప్రకారం ర్యాగింగ్ ఫిర్యాదు అందిన వెంటనే కళాశాల ప్రిన్సిపాల్ లేదా యాజమాన్యం స్పందించి విచారణ చేపట్టాలి. ప్రాథమిక సాక్ష్యాధారాలు లభిస్తే ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని వెంటనే సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తాజాగా వైద్య కళాశాలలు ప్రారంభం అయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాంగింగ్ పేరిట వేధించే పనిలో సీనియర్లు నిమగ్నం అయ్యారా..? అన్న ప్రశ్నకు సమాధానంగా మదురైలో ఘటన వెలుగు చూసింది.
ఢిల్లీకి చేరిన ఫిర్యాదు
మదురై ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్లు జూనియర్లను ఇష్టారాజ్యంగా వేధిస్తుండడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ తమకు న్యాయం లభించదన్న ఆందోళనతో జూనియర్ ఒకరు ఏకంగా ఢిల్లీలోని ర్యాంగింగ్ నియంత్రణ కమిటీకి రహస్యంగా మెయిల్ పంపించారు. ఈ మెయిల్‌ను పరిశీలించిన కమిటీ శనివారం రంగంలోకి దిగింది. మదురై వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మరుదు పాండియన్ నేతృత్వంలోని బృందంతో కలసి ర్యాగింగ్‌కు పాల్పడుతున్న సీనియర్ల భరతం పట్టే పనిలో నిమగ్నం అయ్యారు. హాస్టల్ గదుల్లో, కళాశాల వెలుపల సీనియర్లు జూనియర్లను హింసిస్తుండడాన్ని పసిగట్టారు. ఈ కమిటీకి పలువురు రెడ్ హ్యాండెండ్‌గా చిక్కారు. దీంతో పదిహేను మంది జూనియర్ విద్యార్థులు సాహసం చేసి సీనియర్ల వేధింపుల గురించి లిఖిత పూర్వకంగా ఆదివారం ప్రిన్సిపల్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో రెండో సంవత్సరం చదువుతున్న 20 మంది సీనియర్ విద్యార్థులను గుర్తించారు. వారిని ఆరు నెలల పాటు కళాశాలల నుంచి సస్పెండ్ చేశారు. సెమిస్టర్ పరీక్షలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. అలాగే, ఈ20 మంది హాస్టల్‌లో రెండేళ్ల పాటు ప్రవేశించకుండా నిషేధం విధించారు.
నిఘా నేత్రాల ఆధారంగా..
కళాశాల, హాస్టల్ పరిసరాల్లోని నిఘా నేత్రాల్లో నమోదైన దృశ్యాలను సమగ్రంగా పరిశీలించి, మరికొందరు సీనియర్ల భరతం పట్టే రీతిలో వైద్యకళాశాల వర్గాలు ముందుకు సాగుతున్నాయి. ఇందులో మరో ఇద్దరు విద్యార్థుల తీరును గుర్తించడంతో వారి మీద కూడా చర్యకు నిర్ణయించారు. సోమవారం జరగనున్న కళాశాల ర్యాగింగ్ నియంత్రణ కమిటీ సమావేశంలో వీడియో దృశ్యాలను పరిశీలించి, ర్యాగింగ్‌కు పాల్పడ్డ సీనియర్ల భరతం పట్టేందుకు నిర్ణయించామని ప్రిన్సిపాల్ మరుదు పాండి తెలిపారు. కాగా, మదురైలో ర్యాగింగ్ రక్కసి వెలుగు చూడడంతో రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నిఘాను పెంచారు. ఎవరైనా ర్యాంగింగ్, ఈవ్ టీజింగ్ వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరికల బోర్డులు ప్రత్యక్షం అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment