సాక్షి, ముంబై : ఆకతాయిల వేధింపులు కంటపడితే మనకెందుకులే.. సమయం వృథా... అని కొందరు పక్కకెళ్లి పోతున్న ఈ రోజుల్లో... ముంబైకి చెందిన దిపేష్ తంక్ చేస్తున్న పనిని మాత్రం అభినందించకుండా ఉండలేం. ఎందుకంటే రైల్వే రౌడీల భరతం పడుతున్న ఆయన ఇప్పుడు ముంబై హీరో అయిపోయాడు. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నాడో చదవండి.
సామాజిక వేత్త అయిన దిపేష్ తంక్ ఉదయాన్నే లేచి ముంబై రైళ్లు, రైల్వే స్టేషన్‌లలో సంచరిస్తూ కనిపిస్తుంటారు. ఎక్కడైనా ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తూ కనిపిస్తే చాలూ కాసేపు వారినే ఆయన తదేకంగా చూస్తుంటారు. ఆపై వారి దగ్గరి కెళ్లి ఆ చేష్టలను అడ్డుకుంటారు. ఈ గ్యాప్‌లోనే అసలు వ్యవహారం ఉంటుంది. కళ్లద్దాలు పెట్టుకుని జేమ్స్ బాండ్ తరహాలో ఆయన అక్కడి దృశ్యాలను చిత్రీకరిస్తుంటారు. ఇందుకోసం తన కళ్లజోడులో ఓ క్వాలిటీ కెమెరాను ఫిక్స్ చేసుకున్నారు. అమ్మాయిలను వేధించే వారిని మాత్రమే కాదు.. రైళ్ల నుంచి తిక్క చేష్టలు చేసే వారిని కూడా ఆయన చిత్రీకరిస్తుంటారు. వారిని అడ్డుకునే సమయంలో బుకాయిస్తే వాటిని సాక్ష్యాలుగా చూపిస్తారన్న మాట.
ఈ విధంగా 6 నెలలుగా ఈ వన్ మన్ ఆర్మీ మిషన్ ద్వారా సుమారు 140 మందిని సాక్ష్యాలతోసహా ఆయన పోలీసులకు పట్టించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు బెదిరింపులు ఎదురు కాలేదా? అని ఆయన్ని అడిగితే.. జైలుకు వెళ్లి వచ్చిన కొందరు తనను చంపుతామని బెదిరించారని... మహిళలకు వేధింపులు ఆగేంతవరకు తాను ఎంత దూరమైన వెళ్తానని దిపేష్ చెబుతున్నారు. ఓవైపు సోషల్ మీడియా మొత్తం హర్వే వ్యవహారం తర్వాత మీటూ క్యాంపెయినింగ్‌తో నిండిపోయిన సమయంలో దీపేశ్ చేస్తున్న పనిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment