సాక్షి, ముంబై: నగరంలోని లోకల్ రైల్వేస్టేషన్లలో ఇకపై ఎవరైనా ఉమ్మితే.. వారే శుభ్రం చేయాల్సి ఉంటుంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండు నుంచి ఈ పద్ధతిని అమలుచేయాలని రైల్వే అధికారులు నిర్ణయించుకున్నారు. సాధారణంగా రైలు ఎక్కేందుకు వచ్చే ప్రయాణికులు పాన్ మసాలా తదితర పదార్థాలను తింటూ స్టేషన్ ఆవరణలోనే ఎక్కడపడితే అక్కడ ఉమ్మేస్తుంటారు. దీంతో రైల్వే సిబ్బందిపై పనిభారం పడుతోంది. దీంతో ఇకపై ఎవరైనా రైల్వే ఆవరణలో ఉమ్మినట్లు కనిపిస్తే వారితోనే దాన్ని శుభ్రం చేయించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. అంతేకాక వారికి తగిన జరిమానా కూడా విధించనున్నారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్‌ను అపరిశుభ్రం చేసే వారికి స్టేషన్ మాస్టర్ రూ.500 వరకు జరిమానా విధిస్తున్నారు.
ఇకపై ఈ నిబంధనను మరింత కట్టుదిట్టంగా అమలుచేయనున్నట్లు వెస్టర్న్ రైల్వే డివిజినల్ రైల్వే మేనేజర్ (ముంబై) శైలేంద్ర కుమార్ తెలిపారు. పరిశుభ్రత విషయంలో సిబ్బందికి పని భారం నానాటికీ పెరిగిపోతోం ది. వీరు ప్రస్తుతం రైల్వే ఆవరణలో పడివేసిన చెత్తను పోగు చేస్తున్నారు. అంతేకాకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ప్లాట్‌ఫాంపై ప్రయాణికులు ఉమ్మివేసిన పాన్‌మసాలా ఇతరత్రా వాటిని కూడా శుభ్రం చేయాల్సి వస్తోంది. రోజురోజుకు స్టేషన్లలో పెరుగుతున్న రద్దీ కారణంగా పారి శుద్ధ్య సిబ్బందిపై విపరీతమైన పనిభారం పడుతోంది. కాగా, స్టేషన్‌లో ఉమ్మివేస్తే శుభ్రం చేయడం ఎంత కష్టమో ప్రయాణికులకు ప్రత్యక్షంగా తెలియజేసేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు శైలేంద్ర తెలిపారు. ముందుగా దీన్ని చిన్న స్టేషన్లలో ప్రయోగాత్మకంగా చేపడతామని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియతో ప్రజలకు నిరసనలకు దిగే అవకాశముందని సెంట్రల్ రైల్వే డివిజినల్ మేనేజర్ (ముంబై) ముఖేష్ నిగమ్ అభిప్రాయపడ్డారు.
ఉమ్మితే.. ఊడ్చాల్సిందే!
Published Sat, Sep 20 2014 10:54 PM | Last Updated on Tue, Oct 2 2018 4:34 PM
Advertisement