భోపాల్: అక్షయ్ కుమార్–కాజల్ అగర్వాల్ సినిమా ‘స్పెషల్ చబ్బీస్’ గురించి తెలుసు.. ఈ ‘స్పెషల్ 40’ ఏమిటి? అనే కదా డౌటు. ఆ సినిమాలో ఒక గ్రూప్ సభ్యులు సీబిఐ, ఇన్‌కామ్‌టాక్స్ ఆఫీసర్లుగా పోలీసులను బోల్తా కొట్టిస్తుంటారు. అయితే ఈ‘స్పెషల్ 40’ ని మాత్రం పోలీసులే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మహిళలపై జరిగే రకరకాల అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు ఏర్పాటు చేసిన గ్రూప్ ఇది. మురికివాడల్లో నివసించే ఆడపిల్లలపై రౌడీలు, తాగుబోతుల కన్నుపడింది. అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే రకరకాలుగా వేధించడం, అఘాయిత్యాలకు పాల్పడటం లాంటివి జరిగేవి. ‘ఈ దేశంలో ప్రతి పౌరుడు టోపీ ధరించని పోలీసే’ అనేది మన తెలుగు సినిమా డైలాగ్ కావచ్చుగానీ శాంతిభద్రతల సంరక్షణ అనేది మన అందరి బాధ్యత.
‘స్పెషల్ 40’లో ఉన్న మహిళల్లో ఎవరూ పోలిస్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన వారు కాదు. ఎక్కడో ఏదో సంఘటన చూసి కడుపు రగిలిపోయిన వారు, ‘చూస్తూ కూడా ఏమీ చేయలేమా’ అని నిస్సహాయంగా పిడికిళ్లు బిగించిన వారు, ‘మనకెందుకులే’ అని రాజీపడి, అదో పశ్చాత్తాపమై, భారమై, బాధపడి ‘లేదు. ఏదో ఒకటి చేయాలి’ అనుకున్నవాళ్లు ఎందరో ఉన్నారు. ‘స్పెషల్ 40’ సభ్యులకు కరాటే, తైక్వాండోలాంటి ఆత్మరక్షణ విద్యలలో శిక్షణ ఇవ్వడంతో పాటు, చట్టం, న్యాయ సంబంధిత విషయాలపై అవగాహన కలిగిస్తున్నారు.
ఎలాంటి చర్యలు నేరాల పరిధిలోకి వస్తాయి? ఏ నేరానికి ఎలాంటి శిక్ష పడుతుంది? ముఖ్యమైన సెక్షన్‌లు ఏం చెబుతున్నాయి?... మొదలైనవి ‘స్పెషల్ 40’ సభ్యులకు కొట్టిన పిండి. ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా అక్కడ వాలిపోయి, ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ‘స్పెషల్ 40’ సభ్యులు ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’లాంటి విషయాలపై పిల్లలకు అవగాహన కలిగిస్తున్నారు. అనుకోకుండా ఆపద ఎదురైతే ముందుగా చేయాల్సిన పని ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?... మొదలైన విషయాలను తెలియపరుస్తున్నారు.
ఈ గ్రూప్‌లో 20 ఏళ్ల వయసు నుంచి మొదలు 60 పైబడి ఉన్న మహిళలు కూడా ఉన్నారు. వీరి గ్రూప్‌లో సీనియర్ అయిన చంద్రకాంత మాలవీయాకు 63 సంవత్సరాలు. ‘ఈ వయసులో ఇదంతా ఎందుకు తల్లీ!’ అన్నవారు లేకపోలేదు. అయితే చంద్రకాంత వారి మాటలను పట్టించుకోలేదు. ‘భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం గా దీన్ని భావిస్తున్నాను. ఎందరో ఆడపిల్లలు నన్ను సొంత తల్లిలా భావించి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు’ అంటుంది చంద్రకాంత.
‘స్పెషల్ 40లో నేను సభ్యురాలిని అనే విషయం తలచుకోగానే చెప్పలేనంత ఉత్సాహం, ధైర్యం ఒంట్లోకి వచ్చి చేరుతాయి. ఆడపిల్లల రక్షణ కు అవసరమైతే ప్రాణాలు కూడా లెక్క చేయను’ అంటుంది సంధ్యా మనోజ్ కాస్త ఉద్వేగంగా.ఒక మురికి వాడలో నివసించే రీతి అనే అమ్మాయి ఒకరోజు పోకిరీల బారిన పడింది. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే ‘ఈ సమయంలో అటు వైపు ఎందుకు వెళ్లావు?’ అని మందలించాడు నాన్న. నిజానికి అప్పుడు రాత్రి ఎనిమిది కూడా దాటలేదు.
మరోసారి ఒకచోట తాగుబోతుల బెడద ఎదురైతే వెంటనే ‘స్పెషల్ 40’కి సమాచారం ఇచ్చింది. ‘స్పెషల్ 40’ ఆ తాగుబోతుల భరతం పట్టింది. ఇప్పుడు ‘స్పెషల్ 40’ సభ్యుల దగ్గర వాకీ–టాకీలు ఉన్నాయి. వాటికంటే మఖ్యంగా అంతులేని ధైర్యం ఉంది. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవాలనే అపారమైన తపన ఉంది. ఇంతకంటే కావల్సింది ఏమిటి!
Comments
Please login to add a commentAdd a comment