
జెడ్పీ బాలికోన్నత పాఠశాల తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఈవ్‌టీజ్ చేసిన యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్తున్న పోలీసు
అనంతపురం, రాయదుర్గంటౌన్ : రాయదుర్గంలో ఈవ్‌టీజింగ్ అధికమవుతోంది. వారం వ్యవధిలోనే రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా సోమ వారం పట్టణంలోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల గుమ్మఘట్ట మండలం వీరాపురం గ్రామానికి చెందిన రవి అనే యువకుడు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డాడు. అదే గ్రామానికి చెందిన విద్యార్థిని ఉదయం పాఠశాలకు వస్తున్న సమయంలో ఆ యువకుడు వెంటపడి వేధించసాగాడు. పాఠశాల సమీపంలో రద్దీ ప్రాంతంలోనే కోపంతో విద్యార్థిని చెంపపై కొట్టాడు. దీంతో విద్యార్థిని భయాందోళనకు గురై పాఠశాలకు పరుగులు తీసింది. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు, స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. గత నెల రోజుల నుంచి తనను వేధిస్తున్నట్లు విద్యార్థిని ఉపాధ్యాయులతో పేర్కొనట్లు సమాచారం. ఈ ఘటనతో పాఠశాల, కళాశాల విద్యార్థినులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలావుండగా ఇలాంటి ఘటనే వారంరోజుల క్రితం ఇదే పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్న మరో అమ్మాయిని ప్రేమించకపోతే చేయి చేసుకుంటానని ఓ యువకుడు వేధించినట్లు ఆలస్యంగా తెలిసింది. రద్దీ ప్రాంతమైన జెడ్పీ బాలికోన్నత పాఠశాలలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ తరచూ ఈవ్‌టీజింగ్ సమస్య ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
ఇటీవల మహిళా రక్షణ టీమ్‌లు ఏర్పాటు చేశాం. ఈ టీములు గ్రామాలు కూడా తిరుగుతుండడంతో వల్ల పట్టణంలో కాస్త పర్యవేక్షణ తగ్గింది. ఉన్నతాధికారులతో చర్చించి మహిళా రక్షణ టీమ్‌ను పట్టణంలో నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటాం. కళాశాల, పాఠశాల రాకపోకల వేళల్లో పోలీసు సిబ్బంది పర్యవేక్షణ కూడా ఉంచి ఈవ్‌టీజింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం. సోమవారం పాఠశాల వద్ద జరిగిన ఘటనపై యువకుడి బంధువులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చాం. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తాం. – నాగేంద్రప్రసాద్, ఎస్‌ఐ