రౌడీ షీటర్లపై నిఘా | District SP Babji Said That Special Attention Was Paid To Goons | Sakshi
Sakshi News home page

రౌడీ షీటర్లపై నిఘా

Published Wed, Jun 12 2019 7:57 AM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

District SP Babji Said That Special Attention Was Paid To  Goons - Sakshi

విశాఖ ఎస్పీ అట్టాడ బాబూజీ

సాక్షి, అనకాపల్లి (విశాఖపట్నం) : త్వరలో జరగనున్న పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామాలు, పట్టణాల్లో ఉండే రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ చెప్పారు. అనకాపల్లిలోని కొత్తూరు మహార్షి ఫంక్షన్‌ హాల్లో పోలీస్‌సబ్‌ డివిజన్‌ పరిధిలో అధికారులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది నేరాల సంఖ్యను తగ్గించామన్నారు.

పాఠశాలలు, కళాశాలల వద్ద ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. అలాగే ప్రస్తుతం ఎక్కువగా గొడవలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై రౌడీ షీట్‌ నమోదు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది వేసవిలో చోరీలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో క్రైం రేటు తగ్గించగలిగామన్నారు. ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారించేందుకు ఆర్‌అండ్‌బీ, రవాణాశాఖ, వివిధశాఖల అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మావోస్టుల ప్రభావం ఏజెన్సీ ప్రాంతంలో తగ్గుముఖం పట్టిందని, గతంలో గిరిజనులు వారికి ఆశ్రయం ఇచ్చేవారని, ఇప్పడు ఆ పరిస్థితి లేకుండాపోయిందన్నారు. గిరిజనులు అభివృద్ధి చెందాలని రోడ్లు, సెల్‌టవర్లు ఏర్పాట్లు చేసేందుకు సహకరిస్తున్నట్లు ఆయన చెప్పారు.

బెల్ట్‌షాపులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, అటువంటి వారు తరుచూ ఏర్పాటు చేసినట్లయితే పీడీ యాక్టులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. గంజాయి రవాణా చేస్తున్న పాత నేరస్తులపై ఎప్పటికప్పుడు దృష్టిపెడుతూ, ఎక్సైజ్‌ శాఖతో  చర్చిస్తున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. సమావేశంలో డీఎస్పీ ఎస్‌.వి.వి.ప్రసాదరావు, సీఐలు కిరణ్‌కుమార్, తాతారావు, రామచంద్రరావు, శ్రీనివాసరావు, ఎస్సైలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement