
మరో యువతి.. ఇంకో యువకుడు.. ఆత్మహత్య!
కొన్నాళ్ల క్రితం సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున విశ్వవిద్యాలయం హాస్టల్లో రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు మహారాష్ట్రలో దాదాపు అలాంటి ఘటనే మరోటి చోటుచేసుకుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా తనను ఓ వ్యక్తి పదే పదే ఈవ్ టీజింగ్ చేస్తుండటంతో.. ఆ అవమానాన్ని తట్టుకోలేక 18 ఏళ్ల అమ్మాయి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో జరిగింది. పచోరా పట్టణంలోని ఓ కాలేజిలో ఆ అమ్మాయి చదువుతోంది. శరద్ పాటిల్ (25) అనే వ్యక్తి ఆమెను పదే పదే వెంబడిస్తూ వేధించేవాడు.
ఎంత చెప్పినా వదలకుండా.. అతడు ఈవ్ టీజింగ్ చేయడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఆగస్టు 17వ తేదీన ఆమె ఎలుకలను చంపేందుకు వాడే మందు తినేసి ఆత్మహత్య చేసుకుంది. శరద్ పాటిల్ను పోలీసులు అదేరోజు అరెస్టు చేశారు. ఆమె ఎక్కడికి వెళ్లినా అతడు వెంటపడేవాడని తెలిపారు.