ఈవ్‌టీ జింగ్ బంద్? | Eve teasing a bandh? | Sakshi
Sakshi News home page

ఈవ్‌టీ జింగ్ బంద్?

Published Tue, Dec 16 2014 12:05 AM | Last Updated on Thu, Jul 11 2019 8:06 PM

Eve teasing a bandh?

21 రోజులుగా నమోదు కాని టీజింగ్ కేసు
షీట్‌మ్ ఏర్పాటే కారణం

 
సిటీబ్యూరో: నగరంలో ఈవ్‌టీజింగ్ బంద్ అయ్యిందా? ఈవ్‌టీజర్లు పారిపోయారా? లేక ప్రవర్తన మార్చుకున్నారా ?... గత 21 రోజుల నుంచి షీ టీమ్ పోలీసులకు ఒక్క ఈవ్ టీజర్ దొరక్కపోవడం.. ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడమే ఇందుకు నిదర్శనం.  ఈవ్‌టీజింగ్‌కు పేరుగాంచిన మెహిదీపట్నం, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో సైతం ఈవ్ టీజింగ్ జాడలు కనుమరుగయ్యాయి. నగరంలోని బస్టాపు, రైల్వేస్టేషన్లు, కళాశాలలు, షాపింగ్ మాల్స్, మార్కెట్ల వద్ద మహిళలు ఎదుర్కొంటున్న ఈవ్‌టీజింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు రెండు నెలల క్రితం అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా నేతృత్వంలో నగరంలో 100 షీటీమ్‌లను కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఈ ప్రత్యేక పోలీసు బృందాలు ఆయా ప్రాంతాలలో సివిల్ దుస్తుల్లో కాపు కాశాయి. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న వారిని వీడియోలో బంధించి, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. ఇలా వీరు రెండు నెలల్లో సుమారు 82 కేసులు నమోదు చేశారు. వీరిలో 11 మందిని జైలుకు కూడా పంపారు.

కౌన్సెలింగ్ చేయడం ద్వారా ప్రవర్తన మార్చుకున్న 20 మంది విద్యార్థులు తాము సైతం ఈవ్‌టీజింగ్‌కు చెక్ పెట్టేందుకు కళాశాలలు, బస్టాప్‌ల వద్ద ప్రచారం చేశారు. బస్సులు, ఆటోలు, ఎంఎంటీఎస్ రైళ్లలో సైతం పోలీసులు విస్తృతంగా ఈవ్ టీజింగ్ కలిగే అనర్థాలపై ప్రచారం చేసి మహిళలకు భరోసా ఇచ్చారు. ఎవరైనా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని ప్రచారం చేయడంతో పాటు 10 నిముషాలలో ఘటనా స్థలానికి చేరుకునేలా పోలీసులు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ రెండు నెలల్లో 100 నెంబర్‌నుంచి వచ్చిన ఫిర్యాదులను ఏసీపీలు కవిత, శ్రీనివాస్‌లు స్వీకరించి వెంటనే రంగంలో ఉన్న షీ టీమ్స్ ఎస్‌ఐలు ముత్యాలు, రాజేందర్‌గౌడ్, రమేష్‌గౌడ్, రమేష్, బ్రహ్మచారి, హరికృష్ణలను అప్రమత్తం చేసి పది నిముషాల్లో ఘటనా స్థలానికి చేరుకునేలా చేశారు. షీ టీమ్స్ ప్రచారం వల్ల నగరంలో ఈవ్‌టీజింగ్ జాడ లేకుండా పోయింది.
 
అప్రమత్తంగా ఉన్నాం:  


ఈవ్‌టీజింగ్ కోసం మేము తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి. రెండు నెలల పాటు టాస్క్‌ఫోర్, సీసీఎస్ పోలీసులు చాలా కృషి చేశారు. 21 రోజుల నుంచి ఈవ్‌టీజింగ్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఈవ్‌టీజింగ్ బంద్ అయ్యిందని అనుకుంటున్నాం. అయినా మేము   అప్రమత్తంగానే ఉన్నాం. షీ టీమ్స్ కూడా నిరంతరం రంగంలో ఉంటాయి. ఈవ్‌టీజింగ్ చేస్తున్నట్టు అనిపిస్తే వెంటనే 100కు ఫోన్ చేయాలి. మహిళల నుంచి కూడా తమకు మంచి స్పందన వచ్చింది.
 
-స్వాతిలక్రా, అదనపు పోలీసు కమిషనర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement