పాట మధ్యలో ఆపేసి.. హీరో అయ్యాడు!
పాట మధ్యలో ఆపేసి.. హీరో అయ్యాడు!
Published Mon, Jan 16 2017 10:17 AM | Last Updated on Sat, Mar 23 2019 8:40 PM
అతడో పాకిస్థానీ గాయకుడు. పేరు ఆతిఫ్ అస్లాం. ఓ షోలో పాట పాడుతున్నాడు. అంతలో ఒక అమ్మాయిని కొంతమంది రౌడీలు వేధిస్తుండటాన్ని చూశాడు. అంతే, వెంటనే పాట ఆపేశాడు. వాళ్ల మీద విరుచుకుపడ్డాడు. ''ఎప్పుడూ అమ్మాయిల మొఖం చూడలేదా? మీకు అక్క - అమ్మ లేరా? వాళ్లు కూడా ఇక్కడ ఉంటే ఏం చేసేవాళ్లు'' అంటూ చెడామడా వాయించేశాడు. ఈ విషయం మొత్తం అక్కడ అతడి షోను చిత్రీకరిస్తున్న వీడియోలో రికార్డయింది.
దాంతో ఒక్కసారిగా జనంలో కూడా ఉత్సాహం వెల్లివిరిసింది. 'ఆతిఫ్.. ఆతిఫ్' అంటూ అరవడం మొదలుపెట్టారు. అతడిని అభినందనలలో ముంచెత్తారు. తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి, రౌడీలు ఏడిపిస్తున్న అమ్మాయిని భద్రంగా ఇంటివద్ద దించిరమ్మన్నాడు. ఈవ్ టీజర్లకు అతడు బుద్ధి చెప్పిన వైనాన్ని చాలామంది సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకున్నారు. ఆతిఫ్ అస్లాం పాకిస్థాన్‌తో పాటు భారతదేశంలో కూడా బాగా సుప్రసిద్ధ గాయకుడు. ఇలియానాతో కలిసి 'పెహ్లీ దఫా' అనే ఆల్బంలో కనిపించాడు. భారత్ -పాక్ మధ్య సంబంధాలు చెడిపోవడం, పాక్ కళాకారులను ఇక్కడ నిషేధించడం లాంటి ఘటనలు జరుగుతున్న సమయంలోనే అతడి ఆల్బం విడుదలైనా, బాగానే క్లిక్ అయింది.
Advertisement
Advertisement