షీ టీమ్‌ కానిస్టేబుల్‌కే వేధింపులు | Harassment to the She Team Constable | Sakshi
Sakshi News home page

షీ టీమ్‌ కానిస్టేబుల్‌కే వేధింపులు

Published Wed, Aug 16 2017 12:45 AM | Last Updated on Thu, Jul 11 2019 8:06 PM

నిందితుడు నిఖిల్‌ కుమార్‌ - Sakshi

నిందితుడు నిఖిల్‌ కుమార్‌

- ఈవ్‌టీజింగ్‌ కేసు విచారణలో భాగంగా నిందితుడికి ఫోన్‌కాల్‌
ఆ నంబర్‌కే అసభ్యకర సందేశాలు పంపిస్తూ వేధింపులు
ఏకంగా పోర్న్‌ వెబ్‌సైట్‌లో మహిళా కానిస్టేబుల్‌ నంబర్‌
ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్న రాచకొండ పోలీసులు
 
సాక్షి, హైదరాబాద్‌: ఈవ్‌టీజర్ల ఆటకట్టించే షీ టీమ్‌లోని కానిస్టేబుల్‌నే ఎనిమిది నెలలుగా వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని ఎట్టకేలకు రాచకొండ షీ టీమ్‌ బృందం పట్టుకుంది. మంగళవారం రాచకొండ షీ టీమ్స్‌ ఇన్‌చార్జ్‌ ఏసీపీ స్నేహిత వివరాలను మీడియాకు వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి తన ఫోన్‌కు అసభ్యకర సందేశాలు వస్తున్నాయంటూ రంగారెడ్డి జిల్లా మంచాలలోని ప్రతిభా డిగ్రీ కాలేజీకి చెందిన అమ్మాయి రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు ఇబ్రహీంపట్నం షీ టీమ్స్‌ వాట్సాప్‌ నంబర్‌కు మెసేజ్‌ పంపింది. దీనిపై ఏఎస్‌ఐ నరసింహ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి ఆ అమ్మాయిని సంప్రదించగా, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఎలాగైనా తన సమస్యను పరిష్క రించాలని అభ్యర్థించింది. అయితే విచారణ క్రమంలో నిందితుడి సెల్‌ నంబర్‌కు షీ టీమ్‌ సభ్యురాలు మహిళా పోలీసు కానిస్టేబుల్‌ వివరాల కోసం ఫోన్‌కాల్‌ చేసింది. ఆ తర్వాత మహిళా కానిస్టేబుల్‌ సెల్‌ నంబర్‌కు అసభ్యకర మెసేజ్‌లు పంపించడం ప్రారంభించాడు. తొలినాళ్లలో పట్టించుకోకున్నా వేధింపులు మరింత ఎక్కువ కావడంతో కానిస్టేబుల్‌ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో జనవరి 23న ఫిర్యాదు చేసింది.

కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు మహిళా కానిస్టేబుల్‌ను వేధించడం మాత్రం మానలేదు. నెల రోజుల క్రితం మహిళా కానిస్టేబుల్‌ ఫోన్‌ నంబర్‌ను పోర్న్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడంతో ఆమెకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి విపరీతమైన కాల్స్‌ వచ్చేవి. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడు వరంగల్‌ జిల్లా పరకాల మండలానికి చెందిన బి.నిఖిల్‌ కుమార్‌గా గుర్తించి అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement