24/7 భరోసా
► బాధిత మహిళలు, యువతులు కాల్ చేస్తే కేసు నమోదు
► వైద్యం, న్యాయం, పునరావాసం కూడా..
► వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కోర్టులో హాజరు
► వేధింపులకు గురయ్యే పిల్లలకూ ఉచిత సేవలు
► సమాజ సేవకు మేముసైతం అంటున్న నగర పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసులు అతివల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటికే ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ చేసే వారి ఆట కట్టించేందుకు షీ టీమ్స్ బృందాలను రంగంలోకి దింపిన వీరు.. ఒత్తిడులు, వేధింపులకు గురవుతున్న మహిళలకు మేమున్నామంటూ 24 గంటలు.. ఏడు రోజుల(24/7) ‘భరోసా’ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాధితులైన, వేధింపులకు గురవుతున్న మహిళలు, పిల్లలు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేస్తే క్షణాల్లో కేసు నమోదు మొదలు... న్యాయం జరిగే వరకు అంతా వీరే చూసుకుంటారు. వీరికి కావాల్సిన వైద్య ఆరోగ్య సేవలు, న్యాయ సేవలు, పునరావాస సౌకర్యం, మానసిక ఒత్తిడి లోనైన వారికి నిపుణుల కౌన్సెలింగ్, శిక్షణతో పాటు వారికి ఆత్మస్థైర్యం కలిగించే దిశగా భరోసా కల్పిస్తున్నారు.
సైఫాబాద్‌లోని హకా భవన్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటుచేసిన భరోసా కేంద్రం శనివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రారంభోత్సవంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, క్రైమ్స్ అండ్ సిట్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా, అన్ని జోన్ల డీసీపీలు పాల్గొన్నారు.
ఏకీకృత సేవలు...
గృహహింస, కార్యాలయాల్లో వేధింపులు, ఫోన్‌లో అసభ్య సందేశాలు, అత్యాచార బాధితులు, ఒత్తిడిలో ఉన్న మహిళలు 100కి కాల్ చేస్తే ఆ కాల్‌ను భరోసా కేంద్రానికి అనుసంధానిస్తారు. ఆ కాల్‌ను రిసీవ్ చేసుకున్న ఆ సెంటర్ సోషియో కౌన్సెలర్లు(కేస్ వర్కర్లు) బాధితురాలితో మాట్లాడి సమగ్ర కేసు వివరాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తారు. సంబంధిత ఠాణా అధికారులకు ఆ వివరాలను పంపించి కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణలో నిజనిజాలు తెలుసుకుంటారు. బాధితురాలి పరిస్థితిని బట్టి వైద్య సహాయం అందిస్తారు. ఇందుకోసం కేంద్రంలో ప్రత్యేకంగా మెడికల్ ఎగ్జామినేషన్ రూమ్‌ను ఏర్పాటుచేశారు.
వేధింపులకు గురైన మహిళలకు కేంద్రంలో ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారికి మెరుగైన చికిత్స కావాలనుకుంటే సమీపంలోని ఆస్పత్రికి రెఫర్ చేస్తారు. ఇందుకోసం భరోసా అంబులెన్స్ వెహికల్‌ను ఉపయోగిస్తారు. శారీరకంగా, మానసికంగా కోలుకునేందుకు బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తారు. వారి అవసరాలను బట్టి పునరావాసం కల్పించడంతో పాటు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తారు. కేసు నమోదైన దగ్గరి నుంచి కోర్టులో సాక్ష్యాలు ప్రవేశపెట్టేంత వరకు పోలీసులతో పాటు బాధితురాలికి న్యాయం జరిగే వరకు న్యాయాధికారులు చూసుకుంటారు. ఈ సేవలన్నీ ఉచితంగానే అందేలా భరోసా సిబ్బంది చూసుకుంటుంది. ఇప్పటికే మార్చి 8న జ్ట్టిఞ://ఠీఠీఠీ.ఛజ్చిటౌట్చజిడఛీఞౌజీఛ్ఛి.ౌటజ ను ప్రారంభించారు.
వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం...
గృహహింసకు గురైన మహిళలు, అత్యాచారం, వేధింపులకు గురైన యువతులు కోర్టుకు వెళ్లకుండానే వారి రికార్డు స్టేట్‌మెంట్ అయ్యేలా భరోసా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రంలో ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు తమ వాదనను వినిపించేలా ఏర్పాట్లు చేశారు. దేశంలోనే ఈ తొలి భరోసా సెంటర్ ఏర్పాటులో నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, నగర క్రైమ్స్ అండ్ సిట్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా కీలకపాత్ర పోషించారు.