వెంట పడకురా కంటపడేవు | eve teasing special story | Sakshi
Sakshi News home page

వెంట పడకురా కంటపడేవు

Published Tue, Mar 29 2016 11:29 PM | Last Updated on Thu, Jul 11 2019 8:06 PM

eve teasing special story


మై డియర్ మమ్మీ అండ్ డాడీ...
ఇంట్లో టీనేజ్ అబ్బాయి ఉంటే బీ కేర్‌ఫుల్.
ఇంట్లో టీనేజ్ అమ్మాయి ఉంటే బహు కేర్‌ఫుల్.
ఈవ్ టీజింగ్ (ఆడపిల్లల్ని ఏడిపించడం)
స్టాకింగ్ (ఆడపిల్లల వెంట పడడం)
సినిమాల్లో చూడ్డానికి బాగానే ఉంటాయి కానీ...
సీసీ కెమెరాల్లో పడితే మాత్రం లైఫ్ ‘వి’చిత్రం అయిపోతుంది.
పేరెంట్స్‌కి చిత్రహింస అయిపోతుంది. 
అమ్మాయిల్ని అలవాటుగా వేధించేవాళ్ల మీద
రౌడీషీట్ ఓపెన్ చెయ్యాలని చట్టసభల్లో చర్చ మొదలైంది!
అదే జరిగితే...
ఈవ్ టీజర్లకు రేపు పాస్‌పోర్టులు రావు. ఉద్యోగాలు రావు.
సమాజం మొత్తానికీ ‘టార్గెట్’ అయిపోతారు!
రీల్ లైఫ్‌లో ఈవ్ టీజింగ్... ఆకతాయిగా, అల్లరిగా, చిల్లరగా...
అతిగా, వింతగా, విడ్డూరంగా ఉన్నా... అదేంటో..!
మమ్మీ డాడీలు... సన్‌లు, డాటర్లు ఎంజాయ్ చేస్తున్నారు.
రియల్ లైఫ్‌లో అలా ఉండదు.
అర్జెంటుగా అలెర్ట్ కాకపోతే డేంజర్ లైట్ వెలిగినట్లే.
ఎందుకంటే...
వారానికి, నెలకి, సంవత్సరానికి..
అమ్మాయి పడినా పడకపోయినా...
అబ్బాయికి మాత్రం కనీసం ఒక రోజు నుంచి మూడేళ్ల వరకు
జైలు శిక్ష పడడం ఖాయం.

రాపోలు తిరుపతమ్మ మాచర్లలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక ఉరేసుకుని ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. కాలేజీకి బస్సులో వెళుతున్న సమయంలో అదే బస్సులో ప్రయాణించే ఆరుగురు సహ విద్యార్థులు తనను నిత్యం వేధిస్తున్నారని, వారి బెదిరింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, మూడు పేజీల లేఖ రాసి మరీ చనిపోయింది. ఆ లేఖలో తనను వేధింపులకు గురిచేసిన వారి వివరాలను రాయడమే కాక వారిని ఏ విధంగా చంపాలో కూడా వివరించింది. అంతగా ఆ అమ్మాయిని టార్చర్ పెట్టారు వాళ్లు! పొలం నుండి వచ్చిన తల్లిదండ్రులు ఫ్యానుకు వేలాడుతున్న తిరుపతమ్మను చూసి కన్నీరుమున్నీరయ్యారు.

ఆకతాయి వేధింపులు తాళలేక భార్గవి అనే పదవ తరగతి విద్యార్థిని కిరోసిన్ పోసుకొని, తనను తాను తగలబెట్టుకుంది. నల్లగొండ జిల్లాలో ఈ దారుణం జరిగింది. సహ విద్యార్థి ప్రేమించ మని వేధిస్తుండటంతో ఆత్మహత్య చేసుకుంది.

తన ప్రేమను నిరాకరించిందనే ఉన్మాదం... రెండేళ్లుగా ఉన్న పరిచయాన్ని పట్టించుకోలేదనే ఆగ్రహం.. తనకు దక్కకపోతే ఇక బతకొద్దన్న రాక్షసత్వం కలిసి ఓ ఉన్మాది... ప్రేమించిన యువతి గొంతు కోయడానికి ప్రయత్నించాడు. బ్లేడుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ యువతి కేకలు వేయడంతో పారిపోవడానికి ప్రయత్నించాడు. గ్రామస్తులు ఆ ఉన్మాదిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం బండ్లగూడెంలో ఇటీవల ఈ ఘటన జరిగింది.

నలుగురు వ్యక్తులు.. అందులో మహబూబ్‌నగర్‌కి చెందిన 50 ఏళ్ల ఓ వ్యక్తి. ఈ నలుగురు ఒకే రోజు బస్‌స్టాప్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా సైబరాబాద్ షీ టీమ్స్‌కు ఈవ్ టీజింగ్ చేస్తూ దొరికిపోయారు. ఆరామ్‌ఘర్ ఎక్స్ రోడ్స్ మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల ఈ సంఘటన. ఆ వ్యాపారి అరామ్‌ఘర్ ఎక్స్ రోడ్స్‌కి  ఏదో పనిమీద వచ్చాడు. కూకట్‌పల్లికి వెళ్లే బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. అక్కడే ఉన్న ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వెంటనే యాక్షన్ తీసుకున్న ఆ యువతి  అతన్ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంది. ఆమె షీ టీమ్ సభ్యురాలు. 

పోకిరీలకు చెలగాటం... ఆడవాళ్లకు ప్రాణసంకటం... ఈవ్ టీజింగ్! ఇదొక సామాజిక బెడదగా మారింది. ఒకప్పుడు ఈ ధోరణి నగరాల్లోనే ఎక్కువగా ఉండేది. ఇప్పుడిది చిన్న చిన్న పట్టణాలకు, చివరకు పల్లెలకూ పాకింది. ప్రభుత్వాలు ఉన్నాయి. చట్టాలు ఉన్నాయి. చట్టాలను అమలు చేసే కోర్టులూ, పోలీసు యంత్రాంగమూ ఉన్నాయి. అయినా, మన సమాజంలో ఈవ్ టీజింగ్ ఏమాత్రం తగ్గకపోగా మరింతగా వేళ్లూనుకుంటోంది. వయసు చాపల్యం ఒకవైపు, సినిమాల ప్రోద్బలం మరోవైపు కుర్రాళ్లను శతమర్కటాలుగా మార్చేస్తున్నాయి.

నాన్‌స్టాప్ సతాయింపు!
బస్టాపులు, కిక్కిరిసిన సిటీబస్సులు, రద్దీగా ఉండే బజార్లు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్... ఇవన్నీ పోకిరీల అడ్డాలే. ఇలాంటి ప్రదేశాల్లో మహిళలకు బొత్తిగా భద్రత లేకుండా పోతోంది. వెకిలి చూపులు... అసభ్యమైన మాటలు... ఇంకా చొరవ చేసి శరీరాన్ని తాకే ప్రయత్నాలు... ఇలాంటి నీచ నికృష్ట వికృత చేష్టలు మహిళలకు మనశ్శాంతి కరువు చేస్తున్నాయి. జనసమ్మర్దం ఎక్కువగా ఉండే బహిరంగ ప్రదేశాలు మాత్రమేనా... చివరకు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ ఇదే తతంగం. ఇదంతా ఇక్కడితో సరిపోతుందా..? ఇంకొందరు మరీ వికృత మనస్కులు ఉంటారు. ప్రేమా దోమా అంటూ వెంటపడతారు. ఇంటి చుట్టూ చక్కర్లు కొడతారు. మొబైల్ నంబర్లు, ఫేస్‌బుక్, ఈ-మెయిల్ ఐడీలు సంపాదిస్తారు. వద్దు వద్దని వారిస్తున్నా కంటికి కునుకు పట్టనివ్వనంతగా నాన్‌స్టాప్‌గా సతాయిస్తారు.

    ఈవ్ టీజింగ్‌కి గురవుతున్న వాళ్లలో 98 శాతం మంది చదువులో రాణించలేకపోతున్నారనీ,  తాము ఏర్పరచుకున్న భవిష్యత్ లక్ష్యాలను సాధించలేకపోతున్నారని మానసిక చికిత్సా నిపుణులు చెబుతున్నారు.

 ఢిల్లీ కోర్టు అక్షింతలు
‘‘ఈవ్ టీజింగ్ సామాజిక బెడదగా మారింది... ఈ దుర్మార్గం వల్ల మహిళల జీవించే హక్కుకు భంగం కలుగుతోంది’’ అంటూ ఢిల్లీ కోర్టు ఒకటి ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అఘాయిత్యాలను అరికట్టలేని పోలీసు యంత్రాంగంపైన అక్షింతలు వేసింది. ఇలాంటి వ్యవహారాల్లో అక్షింతలు వేయడం మన కోర్టులకు ఎంతగా పరిపాటో... సామాజిక సమస్యలపై మొద్దునిద్ర వీడకపోవడం మన ప్రభుత్వాలకూ అంతే పరిపాటి.

 రెండు రోజుల క్రితమే వరంగల్ (తూర్పు) ఎమ్మెల్యే కొండా సురేఖ ఈవ్ టీజింగ్ సమస్యను తెలంగాణా అసెంబ్లీలో లేవనెత్తారు. ఈవ్ టీజింగ్‌ను నిరోధించడానికి, నిర్మూలించడానికి అవసరమైన సూచనలు చేశారు. సలహాలు ఇచ్చారు. వీటిల్లో ఇప్పటికీ షీ టీమ్ కొన్నిటిని పాటిస్తోంది. మరికొన్నిటిని అమలు చేయబోతోంది.

ఈవ్ టీజింగ్‌కి, స్టాకింగ్‌కి పాల్పడే వాళ్లకు ముందే చట్టపరంగా అడ్డుకట్ట వెయ్యకపోతే మున్ముందు మహిళలపై జరిగే నేరాలను నిరోధించడం కష్టం అవుతుందని ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ తన తాజా నివేదికలో హెచ్చరించింది.

మారే వరకు హాజరు తప్పదు
ఈవ్‌టీజింగ్ కేసులో అరెస్టయిన వారి మీద నిఘా ఉంటుంది. వారం వారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి హాజరు వేయించుకోవాలి. వారిలో పరివర్తన వచ్చినట్లు విశ్వాసం కలిగేంత వరకు ఇది కొనసాగుతుంది. మూడు కేసుల్లో అయితే ప్రతిరోజూ హాజరు వేయించుకోవాల్సిన నియమాన్ని పెట్టాం. సాధారణంగా 99.9 శాతం మంది ఒక దఫా అరెస్టు, కేసు పెట్టడంతోనే దారిలోకి వస్తున్నారు. రిపీటెడ్ కేసులు అతి స్వల్పంగానే ఉంటున్నాయి. ఒక వ్యక్తి ఏకకాలంలో వందల మంది మహిళలను వేధించాడు. అతడి మీద సైబర్ యాక్ట్, నిర్భయ, పి.డి యాక్ట్ కింద కేసు పెట్టాం. అంతకంటే ముందు మహిళలను వేధిస్తే శిక్షించే చట్టం ఉందని, అది చురుగ్గా పని చేస్తోందనే సమాచారం ప్రతి ఒక్కరికీ చేరాలి. ఇందుకు మీడియా సహకారం కూడా అవసరమే.  - దారా కవిత, ఎసిపి, షీ టీమ్స్, హైదరాబాద్ సిటీ పోలీస్

పాఠాల్లో నేర్పిస్తే పరివర్తన వస్తుంది
విద్యావ్యవస్థలో మార్పు తీసుకురాకుండా, స్త్రీల పట్ల గౌరవాన్ని కలిగించే పాఠ్యాంశాలను సిలబస్‌లో చేర్చకుండా... ఆడవాళ్ల మీద జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రభుత్వాలు దగ్గర దారులు వెదుక్కుంటున్నాయి. కఠిన చట్టాలు తెచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నాయి. సమాజంలో మార్పు రావాలి. అంతేకాని తక్షణ పరిష్కారాలు కాదు. ఆడపిల్లల సంఖ్య విపరీతంగా తగ్గిపోతోంది. దానిని అరికట్టే చట్టాలు ఉన్నాయి కదా మన దగ్గర. అయినా ఎందుకు తగ్గిపోతుంది? ఇప్పుడేమో ఈవ్‌టీజింగ్ చేసిన వాళ్లపై రౌడీషీట్ ఓపెన్ చేయాలి అంటున్నారు! అంటే  మగవాళ్లందరినీ ఆడవాళ్లకు శత్రువులను చేయడమే కదా! ఇలాంటి పరిష్కారం ఎవరికి కావాలి? ఆడ, మగ ఇద్దరినీ సమంగా చూడండి.. ఒకరినొకరు గౌరవించుకునే వాతావరణాన్ని కల్పించండి.. అలాంటి సంస్కారాన్ని పెంపొందించండి.   - దేవి, సామాజిక కార్యకర్త

స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. స్త్రీలను గౌరవించేలా మన మగపిల్లలను పెంచడం కూడా మన సమాజంలో ఒక సంప్రదాయం కావాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement