
కొత్తకోటలో సీసీ కెమెరాలు ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
కొత్తకోట: సమాజంలోని ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములుకావాలని.. అప్పుడే వందశాతం నేరాలు అదుపు చేయవచ్చని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. మండల కేంద్రంలోని బీపీఆర్ గార్డెన్‌లో ఆదివారం ఆమె సీసీ కెమెరాల ఏర్పాటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వలన కలిగే లాభాలను ఎస్పీ వివరించారు. వీటిని ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్టణవాసులు, వ్యాపారులు, వివిధ కులసంఘాల నాయకులు, గ్రామ పంచాయతీ పాలకమండలి సభ్యులు సహకరించడం అభినందనీయమన్నారు.
ఇటీవల పట్టణ కేంద్రాల్లో ఎక్కువగా చోరీలు జరుగుతుండటం మూలంగా వాటిని అరికట్టడానికి పట్టణంలో 70కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల దొంగలను గుర్తించడమే కాకుండా.. రోడ్డు ప్రమాదాలు జరిగిన వారికి ఇన్సూరెన్స్ కల్పించడం, అమ్మాయిలను రాగింగ్ చేసే వారిని గుర్తించడంతోపాటు ఇతర చట్టవ్యతిరేక సంఘటనలకు పాల్పడుతున్న దుండగులను పట్టుకోచ్చని తెలిపారు. పట్టణంలో సీసీల ఏర్పాటుకు కృషి చేసిన కొత్తకోట సీఐ సోమ్‌నారాయణŠసింగ్, ఎస్‌ఐ రవికాంత్‌రావును అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సురేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ డా. పీజే బాబు, ఎంపీపీ గుంత మౌనిక, కొత్తకోట సర్పంచ్ చెన్నకేశవరెడ్డి, సీడీసీ చైర్మన్ జగన్మోహన్‌రెడ్డి, కొత్తకోట సింగల్‌విండో చైర్మన్ సురేంద్రనాథ్‌రెడ్డి, ఆయా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.