
ప్రేమించకుంటే.. ఇద్దరినీ పెట్రోల్ పోసి తగలేస్తా..
బంజారాహిల్స్: తనను ప్రేమించకపోతే పెట్రోల్ పోసి తగలేస్తానంటూ బెదిరిస్తున్న యువకుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కల్లకూరు గ్రామానికి చెందిన యువతి తల్లిదండ్రులతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్‌లో నివాసం ఉంటోంది. సమీపంలోని ఓమెగా ఆస్పత్రిలో 2014 నుంచి టెక్నికల్ ఆపరేటర్‌గా పని చేస్తోంది. ఆస్పత్రికి వచ్చిపోయే సమయంలో అందులోనే గతంలో ఎలక్ట్రీషన్‌గా పనిచేసిన మహేష్ ఏడాది కాలంగా ప్రేమించాలంటూ వెంట పడుతున్నాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెకు ఫోన్ చేసి ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. తనను కాకుండా ఇంకెవరినైనా పెళ్ళి చేసుకుంటే ఇద్దరినీ కలిసి పెట్రోల్ పోసి తగలేస్తానంటూ గత నెల మరోసారి ఎస్‌వీఆర్ స్కూల్ వద్ద అడ్డగించి బెదిరించాడు. రెండో రోజుల క్రితం మరోసారి ఫోన్ చేసి తనను ప్రేమిస్తావా లేకపోతే చస్తావా అంటూ హెచ్చరించాడు. తనను కాదని పెళ్ళి చేసుకుంటే అంతు చూస్తానంటూ బెదిరించడమే కాకుండా మానసికంగా వేధింపులకు గురి చేస్తానని బెదిరించాడు. దీంతో మహేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు మహేష్‌పై సెక్షన్ 354(డి), 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.