రెచ్చిపోతున్న మృగాళ్లు | Ragging And Eve Teasing In Anantapur | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న మృగాళ్లు

Published Mon, Aug 20 2018 12:40 PM | Last Updated on Mon, Aug 20 2018 12:40 PM

Ragging And Eve Teasing In Anantapur - Sakshi

ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన యువకులకు శనివారం కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు

ఉదయం లేవగానే తయారై కళాశాలల వద్ద వేచి ఉండటం.. నచ్చిన అమ్మాయి కనిపిస్తే వెంటపడటం.. అసభ్యకరమాటలతో లైంగిక వేధింపులకు పాల్పడటం ఆకతాయిలకు నిత్యకృత్యంగామారుతోంది. ఎవరైనా తమకు ఎదురు తిరిగితే నేరాలకు, దాడులకు పాల్పడటానికి కూడా వెనుకాడటం లేదు. రహస్యంగా నిఘా ఉంచిన మహిళా రక్షక్‌ బృందాలు కొంతమంది ఈవ్‌టీజర్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజుల్లో అమ్మాయిలను వేధిస్తూ వెంటబడిన 44 మంది ఈవ్‌టీజర్లకు పోలీసులు శనివారం కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

అనంతపురం సెంట్రల్‌: సమాజంలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు వెలుగుచూస్తున్నాయి. పా ఠశాలకు వెళ్లి చదువుకోవాలన్నా.. ఉద్యోగాలు చేయాలన్నా.. ఒంటరిగా వెళ్లాలన్నా ఎక్కడ కీచకులు మాటువేసు ఉంటారోనని భయాందోళన వ్యక్తమవుతోంది. బాలికలు, మహిళల రక్షణ కో సం ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నా నేరాలు అదు పు కావడం లేదు. చట్టాలపై పెద్దగా అవగాహన లేకపోవడం వలన ఏమవుతుందిలే అనే ధోరణిలో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో పోక్సో చట్టం కింద కేసులు నమోదవుతుండడం గమనార్హం. 

చట్టంపై అవగాహన శూన్యం..
ఢిల్లీలో నిర్భయ ఉదంతం అనంతరం మహిళా రక్షణ చట్టాల్లో మార్పులు చేశారు. నిర్భయ యాక్టు, పోక్సో (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్సువల్‌ అఫెన్సెస్‌)యాక్టు అమల్లోకి వచ్చాయి. ఈ చట్టం ప్రకారం 12 సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచారం ఘటనలు జరిగితే ఏకంగా ఉరిశిక్ష పడే అవకాశం ఉంది. 18 సంవత్సరాల లోపు పిల్లలపై నేరాలు జరిగితే జీవితఖైదు శిక్ష పడే అవకాశాలున్నాయి. అయితే గ్రామీణ స్థాయి వరకు ఈ చట్టాలపై పెద్దగా అవగాహన లేకుండాపోతోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు చట్టంపై అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా నేరాలకు అడ్డుకట్ట పడడం లేదు. 

ఉసిగొల్పుతున్న సెల్‌ఫోన్స్‌..
ఇంటర్‌నెట్‌ ప్రభావం వలన ఇలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటికి తోడు పలు కంపెనీలు ఉచిత ఇంటర్‌నెట్‌ అవకాశం కల్పించడం వలన ఎక్కువశాతం యువత పెడదారి పడుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో నేరాలు మరింత ఎక్కువవుతున్నాయి. చేతిలో సెల్‌ఫోన్‌ లేకపోతే నిమిషం కూడా గడవదనే రీతిలో యువత వ్యవహరిస్తోంది. యువత మాత్రమే కాకుండా చదువుకున్న విజ్ఞానవంతులు, సన్మార్గంలో నడిపించాల్సిన వ్యక్తులు కూడా ఈ తరహా నేరాలకు పాల్పడుతుండడంతో సభ్యసమాజం తలదించుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. 

అఘాయిత్యాలకుపాల్పడితే కఠిన చర్యలు
విద్యార్థినిలు, మహి ళల రక్షణ కోసం కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. దీనిపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా మహిళా రక్షక్‌ బృందాలు పనిచేస్తున్నాయి. ప్రతి రోజూ పాఠశాలలు, కాలేజీల్లో పోక్సో, నిర్భయ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాయి. పోలీసులు గ్రామాలకు వెళ్లినప్పుడు కూడా గ్రామసభల్లో ఈ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొత్త చట్టాలు వచ్చిన తర్వాత అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడుతున్నాయి.  – జె.వెంకట్రావ్, డీఎస్పీ అనంతపురం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement