ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సిటీబ్యూరో: ఏడాది క్రితం తొమ్మిదో తరగతి పిల్లాడు ఆకస్మాత్తుగా స్కూలుకెళ్లడం మానేశాడు. చదువులో పూర్తిగా వెనుకబడిపోయాడు. 24 గంటలూ తన గదిలోనే ఉండేవాడు. ఆ పిల్లాడి ప్రవర్తనలో మార్పును తల్లిదండ్రులు పసిగట్టలేకపోయారు. చివరకు ఎదురుగా ఉన్న ఓ లేడీస్ హాస్టల్‌లో స్నానం చేస్తున్న అమ్మాయిల ఫొటోలను తన మొబైల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తూ పట్టుబడిపోయాడు. అప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్లు తెరుచుకున్నాయి. నగరంలో అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. అదొక్కటే కాదు. తల్లిదండ్రుల పెంపకంలోని లోపాలు, సామాజిక మాద్యమాలు, మీడియా, సినిమాలు వంటి అనేక కారణాలు చిన్నారుల్లో నేరప్రవృత్తికి ఆజ్యం పోస్తున్నాయి. అశ్లీల సాహిత్యం, హింసాత్మక సినిమాలు ఎదుగుతున్న పిల్లలను నేరాల వైపు నడిపిస్తున్నాయి. మరోవైపు స్కూళ్లు, కాలేజీల్లో కంఫ్యూటర్ సైన్స్ వంటి కోర్సులకు ఇచ్చే ప్రాధాన్యం మోరల్ సైన్స్‌కు ఇవ్వడం లేదు. నీతి కథలు బోధించే అధ్యాపకుల జాడే లేదు. ఏది మంచి, ఏది చెడు అని విడమర్చి చెప్పే చదువులు లేవు. దీంతో ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వంగా అందాల్సిన ఉన్నతమైన మానవ విలువలు అంతరించిపోతున్నాయి.
విచ్ఛిన్న సంబంధాల్లోనే చిచ్చు....
ఒక్క ‘దిశ’ విషయంలోనే కాదు. గతంలో జరిగిన అనేక లైంగిక దాడుల్లోనూ అరాచకమైన మనస్తత్వం కలిగిన వారే నేరాలకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల మైనారిటీ తీరని పిల్లలు ఉంటే, మరి కొన్ని చోట్ల అప్పుడప్పుడే మేజర్లుగా మారుతున్న వారు ఎక్కువ శాతం నేరగాళ్లుగా మారుతున్నారు. ఈ తరహా నేరాల్లో విచ్ఛిన్నమై న కుటుంబసంబంధాలే ప్రధాన కారణమని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘‘ భార్యాభర్తల మధ్య తర చూ జరిగే ఘర్షణలు, విడాకులు కోసం దారితీసే పరిస్థితులు, వివాహేతర సంబంధాలు తదితర అంశాలు పిల్లలపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రశ్నించేవారు, పర్యవేక్షించే వారు లేకపోవడం వల్లనే తప్పులు చేస్తున్నా రు. ’’ అని ప్రముఖ మనస్తత్వ నిపుణులు డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి పేర్కొన్నారు. మరోవైపు పేదరికం కారణంగా, తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్లస్కూల్ దశలోనే చదువు ఆపేసిన పిల్లల మెదళ్లు నేరాలకు అడ్డాలవుతున్నాయి. ఇలాంటి వారి మెదళ్లు చదువు, విజ్ఞానానికి బదులు శూన్యంతో ఉండి నేరపూరితమైన ఆలోచనలు, అరాచకత్వంతో నిండిపోతున్నాయి అన్నారు.
మానసిక అసమతౌల్యం...
‘‘పిల్లల్లో నేరప్రవృత్తికి సంబంధించిన లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు దూరం కావడం, ఒంటరిగా గడపడం, చదువులో వెనుకబడిపోవడం వంటివి నేరపూరితమైన ఆలోచనలుగా భావించవచ్చు. ప్రాథమికంగా గుర్తిస్తే మార్పు తేవడం సాధ్యమే...’’ అంటారు ప్రముఖ మానసిక నిపులు డాక్టర్ లావణ్య. మొదట్లోనే గుర్తించి మార్పు తేకపోవడం వల్లనే ఇలాంటి వ్యక్తులు కుటుంబాల నుంచి విడివడి నేరస్తులుగా మారుతున్నారని, శవంపైన సైతం లైంగిక దాడికి పాల్పడే క్రూరత్వాన్ని సంతరించుకుంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు అరచేతిలో అశ్లీలాన్ని చూపించే మొబైల్ ఫోన్ ఒక మహమ్మారిలా యువతను కబళిస్తోంది. టీనేజీ యువత మంచి కంటే చెడు పట్ల ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. కానీ ఈ మంచి, చెడులను చెప్పే కుటుంబాలు, విద్యాసంస్థలు ఆ పని చేయకపోవడం వల్ల నేరస్తులుగా మారుతున్నారు.
మనిషిలోని ‘బాధ’ తెలియాలి
ఒక మనిషి పరిపూర్ణమైన ఉత్తమ వ్యక్తిత్వాన్ని సంతరించుకోకుండానే ఎదుగుతున్న దశలో నేరస్తుడగా మారుతున్నాడంటే సుస్థిరమైన కుటుంబం లేకపోవడమే ప్రధాన కారణం. నీతి, నైతిక విలువలు లేని విద్యాబోధన మరో కారణం. దీంతో మనుషులను గౌరవించే మనస్తత్వం అలవడడం లేదు. అలాగే తన చర్యల వల్ల ఎదుటి మనిషిని ఎలా బాధకు గురిచేస్తున్నాడో కూడా తెలుసుకోలేక పశువుగా మారుతున్నాడు. విలువలు బోధించే కుటంబం, విద్య చాలా అవసరం.–డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి, మానసిక వైద్య నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment