
నేనూ ఈవ్ టీజింగ్ బాధితురాలినే!
నేనూ ఈవ్ టీజింగ్ బాధితురాలినే నటోంది నటి ఇలియానా. ఇంతకుముందు టాలీవుడ్‌లో క్రేజీ నటిగా వెలిగిన కథానాయకి ఇలియానా. నన్భన్ చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈ గోవా బ్యూటీ ఆ తరువాత బాలీవుడ్ మోహంతో దక్షిణాదిలో కనుమరుగైంది. అయితే అక్కడా అమ్మడి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అయితే సందర్భాన్ని బట్టి ఏదో ఒక సంఘటనతో వార్తల్లో ఉంటూ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల తారల లైంగిక వేధింపుల గొడవ పెద్ద ఇష్యూగా మారడంతో తానూ అలాంటి బాధితురాలినే నంటూ మరోసారి వార్తల్లోకెక్కింది.
ఇంతకీ ఇలియానా ఏం చెప్పిందనేగా మీ ఆసక్తి. ఆ జాణ మాటల్లోనే చూద్దాం. నేనూ ఈవ్‌టీజింగ్ బాధితురాలినే. నటిగా రంగప్రవేశం చేసిన కొత్తలో అలాంటి భయంకరమైన సంఘటనను ఎదుర్కొన్నాను. మా ఇంటి సమీపంలో నివశించే ఒక కుర్రాడు రోజూ నా వెంటపడి వేధించేవాడు. మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. అలా చాలా రోజులు మౌన వేదననను భరించాను. అప్పటికి ఒక చిత్రంలోనే నటించడంతో నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు. అయితే రోజు రోజుకీ అతడి ఆగడాలు మితిమీరడంతో ఒక రోజు అమ్మకు చెప్పేశాను. మా అమ్మ చాలా ధైర్యవంతురాలు. అతడిని పిలిచి గట్టిగా హెచ్చరించింది.
అయినా చేతనైతే పోలీసులకు ఫిర్యాదు చేసుకో అని అతడు అనడంతో కచ్చితంగా ఫిర్యాదు చేస్తానని అమ్మ అంది. దీంతో ఆ మరుసటి రోజు నుంచి అతడి జాడ లేదు. అయితే ఆ కొద్దిరోజులు నేను భయంగానే గడిపాను. ఈవ్‌టీజింగ్ క్రూరమైన చర్య అని ఇలియానా పేర్కొంది.