రేపిస్ట్‌లయ్యే వరకు వెయిట్‌ చేయకండి! | Dont wait for an eve teaser to become a rapist says law student | Sakshi
Sakshi News home page

రేపిస్ట్‌లయ్యే వరకు వెయిట్‌ చేయకండి!

Published Wed, Jan 4 2017 7:26 PM | Last Updated on Thu, Jul 11 2019 8:06 PM

రేపిస్ట్‌లయ్యే వరకు వెయిట్‌ చేయకండి! - Sakshi

రేపిస్ట్‌లయ్యే వరకు వెయిట్‌ చేయకండి!

న్యూఢిల్లీ: ‘ఈవ్‌ టీజింగ్‌ అన్నది చిన్న విషయం కాదు. పెద్ద నేరంగానే పరిగణించాలి. ఆకతాయిల వేధింపులకు, బెదిరింపులకు భయపడవద్దు. వారు రేపిస్ట్‌ల్లా మారకముందే మనం మేలుకోవాలి. ఈవ్‌ టీజింగ్‌ చేసేవారిపై వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేయాలి’ అని లక్నోలో లా చదువుతున్న సౌమ్య గుప్తా తన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా తోటి అమ్మాయిలకు పిలుపునిచ్చారు.

ఇటీవల ఆమెకు ఎదురైన ఓ అనుభవాన్ని అందులో వివరించారు. ‘నేను ఆ రోజు బస్సులో వెళుతున్నా. నా వెనక సీటులో కూర్చున్న వ్యక్తి వెనక నుంచి చేతులపెట్టి నా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నేను వెంటనే లేచి నిలబడి ఆయన్ని నిలబడమన్నాను. ఆ మనిషికి దాదాపు 40 ఏళ్లు ఉంటాయి. గుర్తింపు కార్డు చూపించమన్నాను. అందుకు ఆయన అంగీకరించలేదు. తోటి ప్రయాణికులు కూడా నాకు మద్దతు తెలపడంతో ఆయన తన ప్రర్తనకు క్షమాపణలు చెప్పాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. క్షమాపణలతో ఇలాంటి వ్యక్తిని వదిలేయకూడదని భావించాను.

బస్సు డ్రైవర్‌కు చెప్పి దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడ బస్సు ఆపమని చెప్పాను. బస్సు డ్రైవర్‌ అలాగే చేశారు. తోటి ప్రయాణికుల సహాయంతో నేను నిందితుడిని స్టేషన్‌లోకి తీసుకెళ్లి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాను. చిన్న విషయానికి పెద్ద గొడవెందుకంటూ పోలీసులు కూడా నాకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అది చిన్నవిషయమా! లా చదువుతున్న నేనే ఊరుకుంటే లాభంలేదని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాను. ఆ తర్వాత నా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి బంధువులు, మిత్రులు నా వద్దకు వచ్చి రకరకాలుగా బెదిరించారు.
 
ఇద్దరు పిల్లల తండ్రి అలా చేస్తారంటే ఎవరు నమ్మరని, నా పరువే పోతుందని హెచ్చరించారు. వాళ్లతో వీళ్లతో తిరుగుతూ కనిపిస్తుంటావు. నీ ప్రవర్తనే సరిగ్గా ఉండదని ప్రచారం చేస్తామని, పరువు తీస్తామని బెదిరించారు. పైగా ఆయనకు పురషత్వం లేదని కూడా సర్టిఫికెట్‌ తెస్తామన్నారు. అయినా భయపడలేదు. ఇష్టమున్నట్లు ప్రచారం చేసుకోమని చెప్పాను.  పోలీసు స్టేషన్‌కు రెండు, మూడు సార్లు వెళ్లి కేసు కోర్టు వరకు వచ్చేలా చేశాను. నాకు ఈ విషయం సహకరించిన తోటి ప్రయాణికులకు నా ధన్యవాదాలు. నాలాంటి అనుభవం ఎదురైతే ఎవరూ ఉపేక్షించరాదు. ఇవ్వాళ వారిని వదిలేస్తే రేపు వారే రేపిస్టులుగా మారుతారు’ అని సౌమ్య గుప్తా తన ఫాలోవర్లకు పిలుపునిచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement