తమ్ముడూ నిన్నే.ఎవరూ చూడటం లేదనుకుంటున్నావేమో.ఆమెకు తెలియకుండా ఫోన్‌లోబంధించాలనుకుంటున్నావేమో.చెత్త ఆలోచనలకు వాడాలనుకుంటున్నావేమో.మానుకో. మారు.నీ పనులకు శిక్షలు ఉన్నాయి.నీ చేష్టలకు బేడీలు పడతాయి.స్త్రీలు అప్రమత్తమయ్యారు.వారు నిన్ను వదలరు. తాట తీస్తారు.
మెట్రోలో ప్రయాణిస్తున్నారు ముగ్గురు స్నేహితులు. ఆఫీస్ వేళ కావడం వల్ల రద్దీగా ఉంది ట్రైన్. ఈ ముగ్గురికీ సీట్ దొరకలేదు. కూర్చున్న లేడీస్‌కి దగ్గరగా నిలబడి ఉన్నారు. ఇంతలో మ«ధ్యలో నిలబడ్డవాడు మెల్లగా ఫోన్‌లోని కెమెరా ఆన్ చేశాడు. ఈ అమ్మాయిలను ఫోకస్ చేశాడు. కూర్చుని ఉన్న అమ్మాయిల ఎదను చేయి పైకెత్తి కేప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కూర్చున్న అమ్మాయిలు వీళ్లను గమనించట్లేదు. కాని ఆ ముగ్గురి పక్కన నిలబడ్డ ఒక అమ్మాయి పసిగట్టి.. అతని చేతిలోంచి ఫోన్ లాగేసి ‘మిమ్మల్ని వీడు వీడియో తీస్తున్నాడు’ అంటూ ఆ ఫోన్‌ను ఆ అమ్మాయిల చేతికిచ్చింది. వాళ్లు అలెర్ట్ అయ్యేలోపు ఈ ముగ్గురూ ఆ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. గోలగోల అయ్యింది. అందరూ కలిసి పక్కస్టేషన్‌లో ఆ ముగ్గురిని పోలీసులకు అప్పజెప్పారు.
బస్టాప్‌లో ఆ కుర్రాడు. ఈ పని కోసమే వచ్చినట్టున్నాడు. బస్ కోసం వెయిట్ చేస్తున్న ఒకావిడను వెనక నుంచి వీడియో తీయడం మొదలుపెట్టాడు. దూరం నుంచి చూసేవారికి అతను మామూలుగా ఫోన్ పట్టుకున్నట్టు ఉంటుంది. కాని అందులో ఆమె వెనుకభాగం రికార్డ్ అవుతోంది. ఇంతలో ఆమె వెనక్కి తిరిగింది. అతడు కంగారు పడ్డాడు. అనుమానం కలిగించింది. వెంటనే వెళ్లి ఫోన్ లాక్కుంటే కెమెరా ఆన్‌లో ఉంది.
మైట్రో ట్రైన్ వెళుతూ ఉంది. ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఎదురుగా కాలేజీ అమ్మాయి నిలబడి ఉంది. అతను ఫోన్‌లో ఒక వీడియో ఆన్ చేసి ఎదురుగా నిలబడి ఉన్న అమ్మాయికి కనిపించేలా పెడ్తున్నాడు. ముందు ఆ అమ్మాయి పట్టించుకోలేదు. ఎంతసేపైనా ఆ వీడియోను ఆఫ్ చేయకపోయేసరికి అతనికి తెలియకుండా ఏమన్నా ఆన్ అయిందేమో అనుకొని అతనికి చెప్పబోతూ ఆ వీడియోను చూసి షాక్ అయింది. అది పోర్న్ వీడియో. కావాలనే.. తనకు కనిపించాలనే అతను అలా పెట్టాడు అని అర్థమైంది ఆ అమ్మాయికి.
ఇవన్నీ నిజాలే. జరిగినవే.. జరుగుతున్నవే. అయితే ఇలాంటి చర్యలకు పాల్పపడుతున్న వాళ్లకు ఇవీ నేరాలే అది వీటికి శిక్షలున్నాయని తెలియదు. మనల్ని ఎవరు పట్టుకుంటారు అన్న ధీమాతో ప్రవర్తిస్తుంటారు. కాని వీళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకుని నడుచుకునేలా చేసే చట్టాలున్నాయి.
ఈ నేరాలు ఏ చట్టం కిందకు వస్తాయి?
‘మహిళ అనుమతి లేకుండా, ఆమెకు తెలియకుండా ఆమెను, ఆమె కదలికలను, శరీర భాగాలను చిత్రీకరిస్తే నిర్భయ చట్టంలోని 354 (డి) కింద నేరం. మొదటిసారి చేస్తే మూడేళ్ల జైలుశిక్ష.. పదేపదే చేస్తే అయిదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. ఐపీసీ 509 ప్రకారం ఇది మహిళ గౌరవమర్యాదలకు భంగం వాటిల్లే చర్య. కాబట్టి ఈ సెక్షన్ కింద కేసు నేరస్తుడికి మూడు నుంచి అయిదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటివాటికి పాల్పడినందుకు, పోర్న్‌వీడియోలు చూపించినందుకు ఐపీసీ 294 (అబ్‌సీన్ యాక్ట్) కింద మూడు నెలల నుంచి ఆరునెలల వరకు జైలు శిక్ష ఉంటుంది. వీన్నిటితోపాటు ఐటీ యాక్ట్ ఉండనే ఉంది. 67 ఆఫ్ ఐటీ యాక్ట్ ప్రకారం మహిళకు సంబంధించిన దృశ్యాలను కామాన్ని ప్రేరేపించేలా చిత్రీకరించి వాటిని ఇంటర్‌నెట్‌లో ప్రచురించిన, ప్రసారం చేసినా అయిదేళ్ల జైలు శిక్షతోపాటు లక్షరూపాయల జరిమానా ఉంటుంది. అమ్మాయిలే కాదు.. అబ్బాయిల తల్లిదండ్రులూ ఇవి తెలుసుకోవాలి. తమ పిల్లల కదలికల మీద నిఘా వేయాలి’ అని వివరిస్తున్నారు అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సెలర్ పార్వతి.
కంప్లయింట్ ఎక్కడ ఇవ్వాలి?
అయితే ఈ శిక్షలన్నీ పడాలంటే ముందు ఆ నేరం నమోదు కావాలి. అంటే నేరస్తుడిని పట్టుకోవాలి. ‘బహిరంగ ప్రదేశాల్లో ఇలా తమను ఎవరైనా వెంటాడుతున్నారు.. తమ మీద ఫోన్ ఫోకస్ అయి ఉంది అన్న అనుమానం రాగానే రియాక్ట్ కావాలి. వెంటనే అవతలి వ్యక్తి చేతుల్లోంచి ఫోన్ లాక్కోవాలి. గట్టిగా అరిచి చుట్టూ ఉన్నవాళ్ల దృష్టిని తన వైపు తిప్పి ఆ వ్యక్తి పారిపోకుండా చేయాలి. 100కి డయల్ చేస్తే షీటీమ్స్‌కి కనెక్ట్ అయ్యి దగ్గర్లో ఉన్న షీ టీమ్స్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఇప్పుడు తెలంగాణ పోలీస్ వాళ్ల ‘హాక్ – ఐ’ యాప్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘దిశ’ యాప్‌లూ ఉన్నాయి అందుబాటులో. హాక్– ఐలోని ఎస్‌ఓఎస్ నొక్కితే చాలు మీరు రక్షణ వలయంలోకి వెళ్లినట్టే. దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే ప్రమాదంలో ఉన్నామనే అనుమానం కలిగితే చాలు ఆ యాప్ ఓపెన్ చేసి ఫోన్ కదిలిస్తే సమీప పోలీస్ సిబ్బందికి సంకేతాలు వెళ్లి నేరస్తుల వేట మొదలవుతుంది. ఇవన్నీటితోపాటు మీకు దగ్గర్లో ఉన్న ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా జరిగిన సంఘటన గురించి ఫిర్యాదు చేయవచ్చు. మిమ్మల్ని వీడియో తీసిన కాపీ అతని ఫోన్‌లో లేకపోయినా... దాని కాపీ ఇంకా ఎక్కడ దొరికినా.. కూపీలాగి నేరస్తుడిని కటకటాల్లో తోసే వీలుంటుంది’ అని చెప్తారు తెలంగాణలోని విమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఇన్‌స్పెక్టర్ కిరణ్. ఇంత మందిలో నన్నెవరు చూడొచ్చారులే అనే జులాయీల ధిలాసాకు వణుకు పుట్టించే టెక్నిక్స్ ఎన్నో ఉన్నాయి. ట్రాక్ యాప్‌ల నుంచి సర్వైలెన్స్ ఐ వరకు పోలీస్ రిపోర్ట్ నుంచి కోర్ట్ కొరడా దాకా బోలెడు. అందుకే మహిళల పట్ల మర్యాద పాటించడం ఒక్కటే రక్షణ కవచం. అది నేర్చుకుంటే ఇవన్నీ దూరం. ఈ పాఠం అందరికీ! – సరస్వతి రమ
కొత్త యాప్‌లున్నాయి.. జాగ్రత్త
కొత్త కొత్త యాప్‌లు వస్తున్నాయి వాటి గురించి అవగాహన ఉండాలి. మనకు తెలియకుండానే మనల్ని వీడియో తీస్తుంటారు. అనుమానం వచ్చి పట్టుకుంటే ఆ ఫోన్‌లో ఏమీ కనిపించదు. అలాంటి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటారు. అందుకే ఫోన్ లాక్కోగానే గ్యాలరీలోకి వెళ్లి చూసే బదులు కెమెరా యాక్టివ్‌లో ఉందా అనేది చెక్ చేయాలి. కెమెరా యాక్టివ్‌లో ఉంటే కచ్చితంగా మిమ్మల్ని ట్రేస్ చేస్తున్నట్లే లెక్క. కొన్ని ఫోన్లలో టచ్ చేయంగానే కెమెరా ఆఫ్ అయిపోయేలా సెట్టింగ్స్ ఉంటాయి. అప్పుడు ఓపెన్‌లో ఉన్న ట్యాబ్స్ అన్నీ చెక్ చేయాలి. గ్యాలరీలో ఫీడ్ ఏమీ దొరక్కపోయినా తర్వాత ఎక్కడోక్కడ కాపీ చేస్తారు. అప్పుడు దాంతో ఇమేజ్ అనాలిసిస్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఫోన్ లాక్కోగానే కెమెరా పొజిషన్‌ను చెక్ చేయడం మాత్రం మరవద్దు. ఒకవేళ ఎక్కడా ఏమీ దొరక్కపోయినా సీసీ కెమెరా ఫుటేజ్‌తో నేరస్తులు ఏం చేశారో చూడొచ్చు. ఫేస్ రికగ్నినిషన్ కెమెరాలను అమర్చీ ఇలాంటి వాళ్ల ఆగడాలను అరికట్టొచ్చు.– సందీప్ ముదాల్కర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ అండ్ ట్రైనర్, ఇ. పార్వతిఅడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సెలర్
Comments
Please login to add a commentAdd a comment