
ఆకతాయి వేధింపులు.. బాధితురాలి ఫిర్యాదు
కరీమాబాద్: కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ బుధవారం రాత్రి ఆకతాయి వేధింపులకు గురైన దంత వైద్యురాలు నుంచి వరంగల్ జీఆర్పీ పోలీసులు గురువారం మధ్యాహ్నం ఫిర్యాదు స్వీకరించారు. కేరళలోని కొట్టాయం ప్రాంతానికి చెందిన దంత వైద్యురాలు కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా బుధవారం రాత్రి 1 గంట సమయంలో తమిళనాడులోని సేలం సమీపంలో ఓ ఆకతాయి వేధింపులకు పాల్పడినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సెల్‌ఫోన్ తీసుకోవడంతో పాటు మాటలతో వేధించడం, అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఫిర్యాదు చేశారు. రైలు గురువారం ఉదయం విజయవాడ స్టేషన్‌కు చేరుకున్న వెంటనే వేధింపులకు పాల్పడిన వ్యక్తి దిగి వెళ్లిపోయినట్లు ఆమె వివరించారు. ఆకతాయి వేధింపులపై బాధిత వైద్యురాలు సెల్‌ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో.. కేరళ ఎక్స్‌ప్రెస్ వరంగల్ స్టేషన్‌కు చేరుకున్న అనంతరం పోలీసులు బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకుని విచారణ ప్రారంభించారు.