
చెన్నేకొత్తపల్లి: జీవితంపై విరక్తి చెంది భార్యాభర్తలు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన చెన్నేకొత్తపల్లి మండలం హరియాన్‌చెరువు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... హరియాన్‌చెరువుకు చెందిన నిచ్చెనమెట్ల సుధాకర్(60) భార్య రామలీల (55)లు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరికున్న ఇద్దరు కుమార్తెలకు వివాహాలు కావడంతో తమకున్న అనారోగ్య సమస్యలపై తరచూ ఆస్పత్రులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి ఆహారంలో పురుగుల మందు కలుపుకుని తిన్నారు. అయితే ఉదయాన్నే వారు ఎంతకూ తలుపులు తెరుచుకోకపోవడంతో తలుపులు తెరవగా విగతజీవులై పడి ఉన్నారు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ రమేష్‌బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరో జంట ఆత్మహత్యాయత్నం
రొద్దం: మండల పరిధిలోని నారనాగేపల్లి గ్రామంలో భూ వివాదం కారణంగా బుధవారం భార్యభర్తలు గన్నేరు ఆకుల రసం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలమేరకు... నారనాగేపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు చెన్నారెడ్డికి ముగ్గురు కుమారులు. అయితే ఇటీవల వారు తమ భూములను పంచుకున్నారు. అయితే రెండో కుమారుడు వీరచిన్నయ్యరెడ్డి తనకు భూ పంపిణీలో అన్యాయం జరిగిందని మనస్థాపానికి గురై భార్య యశోదతో కలిసి గన్నేరు ఆకుల రసం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని అపస్మారకస్థితిలో ఉన్న ఇద్దరిని పోలీస్ వాహనంలో పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించినట్లు హెడ్‌కానిస్టేబుల్ చంద్రశేఖర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment