కుటుంబంతో కలిసి ఉన్న కవిత (ఫైల్)
అనంతపురం ,పామిడి: కానిస్టేబుల్ అదనపు కట్నం దాహం.. అతని ఇల్లాలి ప్రాణాలు బలిగొంది. పామిడి ఎస్‌ఐ గంగాధర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా.. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన దాసరి ఓబులేసు కుమార్తె కవితను యాడికి మండలం చందన లక్షుంపల్లి గ్రామానికి చెందిన ఓబులాపురం రాజు కుమారుడు కృష్ణకు నాలుగేళ్ల క్రితం ఇచ్చి పెళ్లి చేశారు. అప్పట్లో రూ.2లక్షలు నగదు, 15 తులాల బంగారు, పామిడిలో రెండు సెంట్ల స్థలం కట్నకానుకల కింద అందజేశారు. పెద్దవడుగూరు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కృష్ణ.. తన కుటుంబంతో కలిసి పామిడిలోనే కాపురముంటున్నాడు. వీరికి మూడేళ్ల కుమారుడు, 14 నెలల పాప ఉంది.
పెళ్లి అయిన ఏడాది తర్వాత నుంచే కృష్ణ అసలు నైజం బయటపడుతూ వచ్చింది. అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో పలుమార్లు పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకువచ్చి ఇస్తూ వచ్చింది. అయినా అతనిలో మార్పు రాలేదు. భర్తతో పాటు అత్త వెంకటలక్ష్మమ్మ కవితను శారీరకంగా, మానసికంగా వేధించేవారు. కొన్నిరోజులుగా ఈ పరిస్థితి భరించలేని స్థాయికి చేరుకుంది. కుటుంబపెద్దలు పంచాయితీ నిర్వహించిన నచ్చచెప్నినా.. కృష్ణలో మార్పు రాలేదు. దీంతో మనస్థాపం చెందిన కవిత బుధవారం రాత్రి 11.45 గంటలకు ఇంటిల్లిపాది నిద్రిస్తుండగా ఉరివేసుకుంది. గురువారం ఉదయం విషయం తెలుసుకున్న కవిత తల్లిదండ్రులు నల్లమ్మ, ఓబులేసు పామిడి చేరుకుని కూతురి మృతదేహం చూసి బోరున విలపించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని, కోర్టుకు హాజరపరచనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment